ప్రస్తుతం ఎవరిని చూసినా చేతిలో స్మార్ట్ ఫోన్, చెవిలో ఇయర్ ఫోన్ సర్వసాధారణంగా మారిపోయింది. మారుతోన్న కాలానికి అనుగుణంగా ఇయర్ ఫోన్స్‌లో కూడా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు ఉన్న వైర్ ఇయర్ ఫోన్స్ స్థానంలో ఇప్పుడు వైర్ లెస్ ఇయర్ బడ్స్ వచ్చాయి. చేవిలో అసలు ఉన్నాయా లేవా అన్నట్లు ఇమిడిపోయే ఇయర్ బడ్స్ కంఫర్ట్‌గా ఉండడంతో ఎక్కువ మంది వీటిని ఉపయోగిస్తున్నారు. ఇక ధరలు కూడా అందుబాటులోకి రావడంతో వీటి కొనుగోలు విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే వీటి వల్ల ఎంత మేలు జరుగుతుందో అంతే కీడు జరుగుతుందని మీకు తెలుసా.? ముఖ్యంగా ఇయర్ ఫోన్స్‌ను కేవలం ఒకరు మాత్రమే వాడడం అనేది చాలా కష్టం. ఎందుకంటే స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు ఒకసారి సౌండ్ క్లారిటీ చూస్తామనో, అవసరం నిమిత్తమో ఇయర్ ఫోన్స్ ఎక్సేంజ్ చేసుకుంటుంటారు. అయితే ఇలా చేయడం వల్ల ఇన్‌ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. హెడ్ ఫోన్స్ షేరింగ్ వల్ల ఒకరి నుంచి మరొకరి చెవి ఇన్‌ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంది. చెవుల్లో ఉండే బ్యాక్టీరియా ఒకరి నుంచి మరొకరికి సోకుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక పూర్తిగా చెవిని ప్యాక్ చేసే ఇయర్ బడ్స్ కారణంగా చెవిలో చెమటపట్టి అది బ్యాక్టీరియా వృద్ధికి కారణంగా మారుతుందని చెబుతున్నారు. మరి ఇయర్స్ ఫోన్స్ ఇలాగే వాడేయాలా.? వేరే మార్గం లేదా.. అంటే కచ్చితంగా ఉంది వాటిని ఎప్పుటికప్పుడు శుభ్రంగా చేసుకుంటే వీటికి చెక్ పెట్టవచ్చు.
ఎలా శుభ్రపరచాలంటే..
* ఇయర్‌ఫోన్స్‌ను కచ్చింగా వారానికి రెండు నుంచి మూడు సార్లు శుభ్రం చేసుకోవాలి. అలా అయితేనే బ్యాక్టీరియా వృద్ధిని అరికట్టగలం.
* ఇయర్ బడ్స్‌ను శుభ్రపరచడానికి ఆల్కహాల్ రబ్బింగ్ వైప్స్ అందుబాటులో ఉంటాయి. వీటితో శానిటైజ్ చేస్తే బ్యాక్టీరియాను తరిమికొట్టవచ్చు.
* ఇక ఇయర్ బడ్స్‌ను క్లీన్ చేసే సమయంలో మెత్తటి వస్త్రాన్ని ఉపయోగించాలి ఎందుకంటే గీతలు పడకుండా ఉంటాయి.
* ఇయర్ బడ్స్ ఉపయోగించే వారు వాటిని ఉపయోగించని సమయంలో చార్జింగ్ కేసులో ఉంచాలి. ఇలా చేస్తే దుమ్ము దూళి చేరకుండా ఉంటుంది.