NRI-NRT

తితిదే ప్రపంచ రికార్డు. జర్మనీ విలవిల. అమెరికాకు గండం-తాజావార్తలు

తితిదే ప్రపంచ రికార్డు. జర్మనీ విలవిల. అమెరికాకు గండం-తాజావార్తలు

* యూరప్‌లో కొవిడ్‌ మళ్లీ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా జర్మనీలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. భారీ సంఖ్యలో బాధితులతో ఇక్కడి ఆస్పత్రులు నిండిపోతున్నాయి. తాజాగా దేశంలో కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ రేటు గరిష్ఠ స్థాయికి చేరుకుంది. వారం వ్యవధిలో ఈ రేటు లక్ష మందికిగానూ 277.4గా నమోదైంది. వైరస్‌ వ్యాప్తి మొదలైనప్పటినుంచి ఇదే అత్యధికం. జర్మన్‌ ప్రభుత్వ సంస్థ రాబర్ట్ కోచ్ ఇన్‌స్టిట్యూట్(ఆర్‌కేఐ) ఈ గణాంకాలు వెల్లడించింది. గత వారమే ఈ రేటు 201.1గా ఉండగా, అతి తక్కువ సమయంలోనే 277కు చేరుకోవడం స్థానికంగా కొవిడ్‌ తీవ్రతకు అద్దం పడుతోంది! అంతకుముందు గతేడాది డిసెంబర్‌ 22న 197.6గా నమోదైంది. మరోవైపు రోజువారీ కేసులు మరోసారి 50 వేలు దాటాయి. 24 గంటల వ్యవధిలో 235 మంది మృతి చెందినట్లు ఆర్‌కేఐ వెల్లడించింది. సాక్సోని, తురింగియా, బవేరియాలో పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు పేర్కొంది.

* తిరుమల తిరుపతి దేవస్థానానికి అరుదైన గుర్తింపు లభించింది. ప్రపంచంలో ఏ ఇతర ఆలయంలో లేని విధంగా భక్తులకు సేవలందిస్తున్నందుకు గాను తితిదేకు ఇంగ్లాండ్‌కి చెందిన వరల్డ్‌ బుక్‌ ఆఫ్ రికార్డ్స్‌ సంస్థ సర్టిఫికెట్‌ అందజేసింది. శనివారం తిరుమలలో తితిదే పాలకమండలి ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డికి ఆ సంస్థ ప్రతినిధులు ధ్రువీకరణ పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వై.వి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలో ఎక్కడా లేనంతగా భక్తులకు సేవలు, సదుపాయాలు అందిస్తోందన్నారు. సాధారణ రోజుల్లో తిరుమలలో 60 నుంచి 70వేల మంది భక్తులకు చిన్న పాటి అసౌకర్యం కూడా లేకుండా సంతృప్తికరమైన దర్శనం చేయిస్తున్నామన్నారు. క్యూలైన్ల నిర్వహణ శాస్త్రీయ పద్ధతిలో జరుగుతోందని సుబ్బారెడ్డి చెప్పారు. రోజుకు 3.5లక్షల లడ్డూలు ఆరోగ్యకరమైన వాతావరణంలో తయారు చేస్తున్నట్టు వివరించారు.

* భారత్‌కు నిజమైన స్వాతంత్య్రం 2014లో వచ్చిందని, 1947లో వచ్చింది భిక్ష మాత్రమేనని పేర్కొంటూ బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగుతోంది. స్వాతంత్ర్య సమరయోధులను అవమానించిన కంగనను అరెస్టు చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే విమర్శలు ఎదురవుతున్నా.. ఆమె మాత్రం తన వ్యాఖ్యలను మరోసారి సమర్థించుకున్నారు. అంతేగాక, తాను చేసిన వ్యాఖ్యలు తప్పని నిరూపిస్తే ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేస్తానంటూ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో రాసుకొచ్చారు.

* టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో పాకిస్థాన్‌ పరాజయం పాలైంది. ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఆసీస్ పైచేయి సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ క్రమంలో పాక్‌ ఆటతీరుతో క్రీడాభిమానుల మనసు గెలుచుకుంటే.. వికెట్‌ కీపర్‌ మహమ్మద్‌ రిజ్వాన్‌ను అయితే స్వదేశం సహా యావత్‌ క్రికెట్‌ ప్రపంచం అభినందనలతో ముంచెత్తింది. మ్యాచ్‌కు ముందు రెండు రోజులపాటు ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొంది మరీ కీలక పోరు కోసం సమాయత్తం కావడం ప్రశంసల వర్షం కురిపించింది. అయితే రిజ్వాన్‌కు చికిత్సను అందించిన వైద్య సిబ్బందిలో భారతీయ వైద్యుడు ఉండటం విశేషం. రిజ్వాన్‌ ఆరోగ్య పరిస్థితి, ఫిట్‌నెస్‌ సాధించడంపై ఇవాళ వివరాలను వెల్లడించారు. సెమీఫైనల్‌ మ్యాచ్‌ కోసం రిజ్వాన్‌ వేగంగా రికవరీ కావడం తమనే ఆశ్చర్యానికి గురి చేసిందని డాక్టర్‌ సహీర్‌ సైనాలబ్దీన్‌ పేర్కొన్నారు.

* భాజపా ప్రభుత్వంపై వరుస విమర్శలు చేసుకుంటూ వస్తున్న కాంగ్రెస్‌ అగ్ర నేత ప్రియాంక గాంధీ.. తాజాగా శనివారం మరోసారి విరుచుకుపడ్డారు! ఉత్తర్‌ప్రదేశ్‌లో యువతులు నగలు ధరించి, అర్ధరాత్రి సమయంలోనూ రోడ్లపై నిర్భయంగా తిరగగలరంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యను ‘జుమ్లా’గా అభివర్ణించారు. గత నెలలో యూపీలో నిర్వహించిన ఓ సభలో భాగంగా రాష్ట్రంలో శాంతిభద్రతలను ప్రశంసిస్తూ.. షా ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే.. క్షేత్రస్థాయిలో అసలైన పరిస్థితులు ఏంటో రాష్ట్ర మహిళలకు మాత్రమే తెలుసని ప్రియాంక పేర్కొన్నారు.

* రాష్ట్రపతిభవన్‌లో క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. భారత అత్యున్నత క్రీడాపురస్కారం మేజర్ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న-2021 అవార్డులు, అర్జున, లైఫ్‌ ఎచీవ్‌మెంట్ పురస్కారాలను రాష్ట్రపతిభవన్‌లోని దర్బార్‌ హాల్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ క్రీడాకారులకు అందించారు. ఖేల్‌రత్న పురస్కారం అందుకున్న వారిలో నీరజ్‌ చోప్రా, రవికుమార్‌, లవ్లీనా, శ్రీజేష్, అవని, సుమిత్, ప్రమోద్‌, కృష్ణ నగార్‌, మనీశ్‌, మిథాలీరాజ్‌, సునీల్ ఛెత్రి, మన్‌ప్రీత్‌ సింగ్‌ ఉన్నారు. గతంలో లేని విధంగా ఈసారి పన్నెండు మందికి ఖేల్‌ రత్న పురస్కారాలను ప్రకటించడం విశేషం. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకంతో భారత జెండాను రెపరెపలాడించిన నీరజ్ చోప్రా, హాకీలో జట్టుకు కాంస్య పతకం సాధించడంలో కీలక పాత్ర పోషించిన మన్‌ప్రీత్‌ సింగ్‌, శ్రీజేష్‌, మహిళల క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన క్రీడాకారిణి మిథాలీరాజ్‌ సహా పలువురికి ఖేల్‌రత్న పురస్కారం వరించింది.

* వరి ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్ర ప్రభుత్వం ఎక్కడైనా చెప్పిందా? అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ధర్నాలు చేసే బదులు ఉద్యోగాల భర్తీ, ఆయుష్మాన్‌ భారత్‌, ఎస్సీలకు మూడెకరాల భూమి పంపిణీపై దృష్టి పెట్టాలని సూచించారు. పావలా వడ్డీ రుణాలు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వకుండా ఒక్క హుజూరాబాద్‌కే ఎందుకు పరిమితం చేశారని ప్రశ్నించారు. యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.

* అమెరికాలో ఉద్యోగాలను వదులుకుంటున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. వరుసగా రెండో నెలలోనూ భారీ సంఖ్యలో అమెరికన్లు తమ ఉద్యోగాలను వదులుకున్నారు. ఆగస్టులో 43 లక్షల మంది తమ ఉద్యోగాలను విడిచిపెట్టగా.. సెప్టెంబర్​లో ఈ సంఖ్య 44 లక్షలుగా నమోదైంది. సెప్టెంబర్​లో 44 లక్షల మంది ఉద్యోగాలకు రాజీనామా చేశారని అమెరికా కార్మిక శాఖ వెల్లడించింది. దేశంలోని మొత్తం శ్రామిక వర్గంలో ఇది 3 శాతం కావడం గమనార్హం.

* నగరంలోని పంజాగుట్టలో జరిగిన బాలిక హత్య కేసులో చిక్కుముడి వీడింది. ఈ కేసులో చిన్నారి తల్లితో సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని తల్లే ప్రియుడితో కలసి కుమార్తెను హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు. రాజస్థాన్‌లోని అజ్‌మేర్‌లో తల్లి హీనాబేగం, ప్రియుడు షేక్‌ మహ్మద్‌ ఖాదర్‌ను నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పంజాగుట్టలోని ద్వారకాపురికాలనీలో ఒక దుకాణం ముందు ఎనిమిది రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో బాలిక మృతదేహం పోలీసులకు కనిపించింది. అప్పటి నుంచి పోలీసులు హంతకుల కోసం గాలిస్తున్నారు. ఘటనా స్థలానికి కొంత దూరంలో లభించిన కీలకాధారంతో నిందితులను గుర్తించారు. ఘటనకు సంబంధించి ఈ మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించి పోలీసులు వెల్లడించారు.