* కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో తిరుపతిలోని తాజ్ హోటల్‌లో దక్షిణాదిరాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో ఏపీ సీఎం జగన్ ప్రారంభ ఉపన్యాసం చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి, తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, సీఎస్ సోమేశ్‌కుమార్, తమిళనాడు విద్యాశాఖ మంత్రి పొన్ముడి, ఇంఛార్జ్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేరళ రెవెన్యూ శాఖ మంత్రి రాజన్, అండమాన్ నికోబార్ ఎల్‌జీ దేవేంద్ర కుమార్ జోషి, లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ సమావేశానికి హాజరయ్యారు. దక్షిణాది ప్రాంతీయ మండలి 29వ సమావేశం ఎజెండాలో మొత్తం 26 అంశాల్ని పొందుపరిచారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన చర్యల నివేదికలు రెండింటితోపాటు 24 కొత్త అంశాల్ని చర్చకు చేపడతారు. ఏపీ సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రాల మధ్య సమస్యలను నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని కోరారు. రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ వేయాలన్నారు. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందన్న సీఎం… రాష్ట్రం విడిపోయి ఏడేళ్లు దాటినా హామీలు అమలు కాలేదన్నారు. విభజన సమస్యలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయన్నారు. ఏపీ, తెలంగాణ మధ్య ఆస్తుల పంపిణీ కూడా జరగలేదన్నారు. పోలవరం ఖర్చు నిర్ధరణలో 2013- 2014 ధరల సూచీతో ఏపీకి అన్యాయం జరుగుతోందని, పోలవరం ఖర్చుపై విభజన చట్టాన్ని ఉల్లంఘించారని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా హామీని కూడా నెరవేర్చలేదని సమావేశం దృష్టికి తెచ్చారు. తెలంగాణ నుంచి విద్యుత్ బకాయిలు ఇప్పించి.. తీవ్ర కష్టాల్లో ఉన్న ఏపీ డిస్కంలకు ఊరట ఇవ్వాలని కోరారు. గత ప్రభుత్వంలో పరిమితి దాటారని రుణాలపై ఇప్పుడు కోతలు విధించటం సరికాదన్నారు. రుణాలపై కోతల అంశంపై వెంటనే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రేషన్ లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియలో హేతుబద్ధత లేదని, సవరణలు చేయాల్సిన అవసరముందని సీఎం జగన్ అభిప్రాయ పడ్డారు.
* రైలు టికెట్ల రిజర్వేషన్ సౌకర్యం ఆరురోజుల పాటు అర్ధరాత్రి సమయాల్లో అందుబాటులో ఉండదని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. 14వ తేదీ రాత్రి 11:30 గంటల నుంచి 15వ తేదీ ఉదయం 5:30 గంటల వరకు రిజర్వేషన్ సౌకర్యం నిలిపివేయనున్నారు. ఇదే తరహాలో 20వ తేదీ ఉదయం 5.30 గంటల వరకు రిజర్వేషన్ సేవలు అందుబాటులో ఉండవని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం ఆరు రోజుల పాటు ఆరేసి గంటల పాటు ఈ అసౌకర్యం ఏర్పడుతోందని, ప్రయాణికులు సహకరించాలని రైల్వే శాఖ విజ్ఞప్తి చేసింది. దక్షిణ మధ్య రైల్వేతో పాటు దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో ఆరు రోజుల పాటు రిజర్వేషన్లకు సంబంధించి ఇదే పరిస్థితి ఉంటుందని రైల్వే వర్గాలు వెల్లడించాయి. ప్రత్యేక రైళ్ల నంబర్లకు బదులుగా సాధారణ రైళ్ల నంబర్లతో రైళ్లు నడపనున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన ప్రక్రియ కోసం ఆయా గంటల్లో సేవలను నిలిపివేస్తున్నట్లు పేర్కొంది.
* రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలను ఉన్నత ప్రమాణాలతో అభివృద్ధి చేయాల్సిన ప్రభుత్వం వాటి నిధులను మళ్లించడం దురదృష్టకరమని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి తలమానికమైన ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ నిధులను ప్రభుత్వ అవసరాలకు తీసుకోవడానికి విశ్వవిద్యాలయం పాలక మండలిపై ఒత్తిడి తీసుకురావడం మానుకోవాలన్నారు. వైద్యవిద్య ప్రమాణాలు మెరుగుపర్చేందుకు మరిన్ని నిధులు సమకూర్చాల్సిన పాలకులు ఉన్న నిధులను లాక్కోవాలని చూడటాన్ని విద్యావేత్తలు, వైద్య నిపుణులు ముక్తకంఠంతో ఖండించాలన్నారు. ఈ మేరకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటన విడుదల చేశారు.
* న్యాయ వ్యవస్థ స్వతంత్రత, సమగ్రతను అన్ని దశల్లోనూ కాపాడటం ఎంతో కీలకమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఈ ఏడాది గాంధీ జయంతి రోజు జాతీయ న్యాయసేవల సంస్థ (నల్సా) ప్రారంభించిన దేశవ్యాప్త న్యాయ అవగాహన కార్యక్రమ ముగింపు సదస్సులో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొన్నారు. పేదరిక నిర్మూలన సహా న్యాయవ్యవస్థపై అవగాహనకు నల్సా చేపట్టిన కార్యక్రమాన్ని ఈ సందర్భంగా సీజేఐ అభినందించారు. ‘‘ట్రయల్ కోర్టులు, జిల్లా న్యాయ వ్యవస్థ తమ చర్యల ద్వారా భారత న్యాయవ్యవస్థ ఆలోచనలను కోట్లాది మంది ప్రజలకు తెలియజేయాలి. భారత్‌ను సంక్షేమ రాజ్యంగా తీర్చిదిద్దడంలో భారత న్యాయవ్యవస్థ ముందు వరుసలో ఉంది. రాజ్యాంగ న్యాయస్థానాల నిర్ణయాలు సామాజిక ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తున్నాయి. చట్టం మానవతా దృక్పథంతో పని చేయాలి. ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు, వారి ఆకాంక్షలే మన రాజ్యాంగాన్ని తీర్చిదిద్దాయి. ప్రతి ఒక్కరి జీవితాల్లో గౌరవం, సమానత్వాన్ని తీసుకురావడమే స్వాతంత్ర్య పోరాటం వెనక ప్రాథమిక ఉద్దేశం. కాని స్వతంత్ర భారతం.. వలస పాలకుల నుంచి వివిధ భాగాలుగా విడిపోయిన సమాజాన్ని వారసత్తంగా పొందింది. సంక్షేమ రాజ్యంలో భాగంగా ఉన్నప్పటికీ భారత్‌లో అభివృద్ధి ఫలాలు నిజమైన లబ్ధిదారులకు అనుకున్నంతగా చేరడం లేదు. గౌరవంగా జీవించాలన్న ప్రజల ఆకాంక్షలకు తరచూ సవాళ్లు ఎదురవుతున్నాయి. అందులో ప్రాథమికమైనది పేదరికం. ఈ సందర్భంలో గాంధీ జయంతి రోజు నల్సా చేపట్టిన అవగాహన కార్యక్రమానికి చాలా ప్రాధాన్యం ఉంది. రాష్ట్ర న్యాయ వ్యవస్థలు ప్రజలకు దగ్గరగా పని చేయాలి. అప్పుడే ప్రజల కష్టాలు తెలుస్తాయి’’ అని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు.
* ఆంధ్రప్రదేశ్‌లో ఏ సంఘటన జరిగినా రాజకీయాలతో ముడిపెడుతున్నారని .. ప్రజల గురించి, రాష్ట్రం గురించి ప్రతిపక్ష పార్టీ ఆలోచించడం లేదని ఏపీ చీఫ్‌విప్ శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ‘‘వివేకానందరెడ్డి చనిపోయినప్పుడు పుట్టెడు దుఃఖంలో ఉండి కూడా జగన్ మోహన్‌రెడ్డి సీబీఐ విచారణ జరిపించాలన్నారు. కర్ణాటక రాష్ట్రం వ్యక్తులు కూడా ఉన్నారు కాబట్టీ సీబీఐ విచారణ కోరారు. ఆనాడు వివేకా గెలుపుకోసం జగన్మోహన్‌రెడ్డి కృషి చేశారు. ఈ ఘటనలో తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలి’’ అని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.
* తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ తీవ్రంగా ఖండించారు. లోకేశ్‌పై విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు సరికాదన్నారు. ఈ మేరకు దిల్లీ నుంచి కనకమేడల సెల్ఫీ వీడియో విడుదల చేశారు. సూట్‌కేసులు తరలించే అలవాటు తెదేపాకు లేదని స్పష్టం చేశారు. భాష గురించి విజయసాయి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. సభ్యత గురించి మాట్లాడే హక్కు వైకాపా నేతలకు లేదని కనకమేడల వ్యాఖ్యానించారు.
* మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆవు పేడను కొనే యోచనలో ఉన్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. దాన్నుంచి ఎరువులు సహా ఇతర ఉత్పత్తులు తయారు చేసే ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. అలాగే పశుసంరక్షణ, చికిత్స నిమిత్తం ‘109’ నంబర్‌పై ప్రత్యేక అంబులెన్స్ సర్వీసులను కూడా ప్రారంభించేందుకు ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు. ఏటా ‘ఇండియన్ వెటర్నరీ అసోసియేషన్’ జరిపే మహిళా పశువైద్యుల సదస్సు ‘శక్తి 2021’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
* దేవాలయానికి వెళ్తే ఎంత పుణ్యమో.. సేవాలయానికి వెళ్తే అంతే పుణ్యమని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. సేవే అసలైన మతమని ప్రగాఢంగా నమ్ముతానని చెప్పారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్టు 20వ వార్షికోత్సవాల్లో ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో కలసి పాల్గొన్నారు. ‘‘నా ఆకాంక్ష. మాతృభాష, మాతృభూమిని మర్చిపోవద్దు. మాతృభాషను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది’’ అని వెంకయ్య అన్నారు.
* ధాన్యం కొనుగోళ్లపై తెరాస, భాజపా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆ రెండు పార్టీలు తోడు దొంగలని ధ్వజమెత్తారు. గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా చైతన్య యాత్రను రద్దు చేయలేదని.. వాయిదా వేశామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో జిల్లా కలెక్టర్లు రాజకీయ నేతల అవతారం ఎత్తారని ఆక్షేపించారు.