Business

అమెజాన్ ద్వారా గంజాయి రవాణా. ఇక 24గంటల పోస్టుమార్టమ్-నేరవార్తలు

అమెజాన్ ద్వారా గంజాయి రవాణా. ఇక 24గంటల పోస్టుమార్టమ్-నేరవార్తలు

* ఎవరైనా వ్యక్తి చనిపోయిన సందర్భంలో మెడికోలీగల్ కేసులన్నింటికీ చట్టప్రకారం పోస్టుమార్టం చేస్తారనే విషయం తెలిసిందే. అయితే, అలాంటి మృతదేహాలకు ఇప్పటివరకు కేవలం పగటిపూట మాత్రమే పోస్టుమార్టం చేసేందుకు చట్టం అనుమతిస్తోంది. దీంతో కొన్ని సందర్భాల్లో పోస్టుమార్టం కోసం గంటలతరబడి ఆస్పత్రుల్లోనే మృతదేహాన్ని ఉంచాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో సూర్యాస్తమయం తర్వాత పోస్టుమార్టం చేసేందుకు వీలు కల్పిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పోస్టుమార్టం చేసేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలున్న ఆస్పత్రుల్లో శవపరీక్షలను 24గంటలూ చేసేందుకు నిర్ణయించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.

* తెలుగు రాష్ట్రాల్లో గంజాయి అక్రమ రవాణాపై పెద్దఎత్తున చర్చ జరుగుతున్న వేళ.. ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. గంజాయి అక్రమ రవాణాకు అక్రమార్కులు ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ను వినియోగించినట్లు వెలుగుచూసింది. టన్ను గంజాయిని ఈ విధంగా తరలించినట్లు తేలింది. మధ్యప్రదేశ్‌లో గంజాయితో పట్టుబడిన ఇద్దరు వ్యక్తులు పోలీసుల విచారణలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఏపీలోని విశాఖ నుంచి నాలుగు నెలలుగా ఈ వ్యవహారం సాగుతున్నట్లు వారు చెప్పడంతో ఆశ్చర్యపోవడం పోలీసుల వంతైంది. సూరజ్‌ అలియాస్‌ కల్లూ పావవియా, పింటూ అలియాస్‌ బిజేంద్ర సింగ్‌ తోమర్‌ అనే ఇద్దరు వ్యక్తుల నుంచి 20 కేజీల గంజాయిని మధ్యప్రదేశ్‌లోని బింద్‌ జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకుని అరెస్ట్‌ చేశారు. నాలుగు నెలలుగా అమెజాన్‌ ద్వారా గంజాయిని తరలిస్తున్నట్లు వారు పోలీసుల విచారణలో వెల్లడించారు. ఇప్పటి వరకు రూ.1.10 కోట్ల విలువైన గంజాయిని తరలించినట్లు పేర్కొన్నారు. నిందితుల్లో ఒకరైన సూరజ్‌ హెర్బల్‌ ప్రోడక్ట్స్‌, కరివేపాకు విక్రేతగా అమెజాన్‌లో పేరు నమోదు చేసుకుని గంజాయిని తరలిస్తున్నట్లు తెలిసింది. ఇలా తరలించిన గంజాయిని మధ్యప్రదేశ్‌ సహా ఉత్తరాఖండ్‌, రాజస్థాన్‌ కూడా తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

* కృష్ణా జిల్లా తోట్లవల్లూరు వద్ద విషాదం చోటు చేసుకుంది. కార్తిక సోమవారం సందర్భంగా కృష్ణా నదిలో స్నానాలకు దిగి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. వారిలో ఇద్దరి మృతదేహాలు వెలికితీశారు. మరొకరి కోసం గాలిస్తున్నారు. మృతులను తోట్లవల్లూరుకు చెందిన గురుపత్తి నరేంద్ర బాబు, గురుపత్తి శివనాగరాజు, గురుపత్తి పవన్‌లుగా గుర్తించారు. ముగ్గురు 20 ఏళ్ల వయస్సున్న యువకులు మృతి చెందడంపై ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

* తమ ఫాలోవర్స్‌కి కొత్తగా ఏదైనా చూపించాలన్న కాంక్షతో యూట్యూబర్లు కొన్నిసార్లు అత్యుత్సాహం ప్రదర్శించి సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ యూట్యూబర్‌ ఇలాగే ఓ పవిత్రమైన ప్రదేశంలో అనుమతి లేకుండా వీడియోలు తీసి.. పండితుల ఆందోళనకు కారణమయ్యాడు. వారి ఫిర్యాదుతో జైలుపాలయ్యాడు. వివరాల్లోకి వెళితే..దిల్లీకి చెందిన గౌవర్‌ శర్మకు ‘గౌరవ్‌ జోన్‌’ పేరుతో యూట్యూబ్‌ ఛానెల్‌ ఉంది. వినూత్న వీడియోలు తీసి అందులో అప్‌లోడ్‌ చేస్తుంటాడు. ఈ క్రమంలోనే అతడికి ‘నిధివన్‌ రాజ్‌’ గురించి తెలిసింది. ఉత్తరప్రదేశ్‌లో ఉన్న బృందావన్‌ ప్రాంతంలోని చిన్న అటవీ ప్రాంతమే ‘నిధివన్‌ రాజ్‌’. ఇక్కడ రాత్రుళ్లు శ్రీకృష్ణుడు, ఆయన ప్రేయసి రాధ ఏకాంతంగా గడుపుతుంటారని, నృత్యాలు చేస్తారని అక్కడి ప్రజల విశ్వాసం. అందుకే రాత్రుళ్లు ‘నిధివన్‌ రాజ్‌’లోకి ఎవరినీ అనుమతించరు. దీంతో రాత్రి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని భావించిన గౌరవ్‌ నవంబర్‌ 6వ తేదీ రాత్రి తన స్నేహితులతో కలిసి ‘నిధివన్‌ రాజ్‌’లోకి చొరబడి వీడియోలు తీశాడు. నవంబర్‌ 9న ఈ వీడియోని తన ఛానెల్‌లో ప్రసారం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న పండితులు గౌరవ్‌ శర్మపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రమైన ప్రాంతంలో అపచారానికి ఒడిగట్టాడని, అతడిపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగారు. ఈ విషయం వివాదంగా మారుతోందని తెలుసుకున్న గౌరవ్‌ ఆ వీడియోను యూట్యూబ్‌ నుంచి తొలగించాడు. అయినా.. పండితులు అతడిపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా దిల్లీలో గౌరవ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకు పంపించారు.