‘‘పెళ్లెప్పుడవుతుంది బాబూ.. నీకు పిల్ల యాడ దొరుకుతుంది బాబు’’ ఓ తెలుగు సినిమాలోని పాట ఇది. సరిగ్గా ఇప్పుడు ఈ వాక్యాలు తమిళ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన యువకులకు ఇట్టే సరిపోతాయి. కేవలం ఒకరిద్దరి సమస్య మాత్రమే కాదు.. పెళ్లి వయసు దాటిపోతున్న సుమారు 40వేల మంది సమస్య. అందుకే తమిళనాడు బ్రాహ్మణ అసోసియేషన్ (తంబ్రాస్) ఓ ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. ఇక్కడి పెళ్లికాని ప్రసాదులకు యూపీ, బిహార్లో ఇదే సామాజిక వర్గానికి చెందిన పెళ్లి కుమార్తెలను వెతికే పనిలో పడింది. దీనికి సంబంధించి ఓ తమిళ మ్యాగజైన్లో ఆ సంఘం అధ్యక్షుడు నారాయణన్ ఓ బహిరంగ ప్రకటన ఇచ్చారు.
**రాష్ట్రంలో 30-40 ఏళ్ల వయసున్న వారు పెళ్లికాకుండా ఉన్న తమిళ బ్రాహ్మణుల సంఖ్య సుమారు 30-40 వేలకు వరకు ఉంటుందని నారాయణన్ తెలిపారు. తమిళనాడు పరిధిలో వారికి సరిపడా సంబంధం దొరకడం లేదన్నారు. 10 మంది అబ్బాయిలకు కేవలం ఆరుగురు మాత్రమే అమ్మాయిలు దొరుకుతున్నారని, మిగిలిన వారికి వివాహ వయసు మీరిపోతోందని చెప్పారు. అందుకే దిల్లీ, లఖ్నవూ, పట్నాలో సమన్వయకర్తలను నియమించుకోనున్నట్లు వెల్లడించారు. హిందీ చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చిన వారిని ఆయా చోట్ల సమన్వయకర్తలుగా నియమించనున్నట్లు చెప్పారు. ఇప్పటికే లఖ్నవూ, పట్నాలోని కొందరితో మాట్లాడుతున్నామన్నారు. బ్రాహ్మణ సంఘం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలువురు స్వాగతించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వివాహాల గురించి కొందరు తమ అభిప్రాయాలను ‘పీటీఐ’ వార్తా సంస్థతో పంచుకున్నారు. వివాహ వయసు వచ్చిన ఆడపిల్లలు లేకపోవడం వల్లే పెద్ద ఎత్తున యువకులు పెళ్లి కాకుండా మిగిలిపోతున్నారని విద్యావేత్త పరమేశ్వరన్ అన్నారు. అదే సమయంలో పెళ్లికొడుకు తల్లిదండ్రుల వైఖరిలోనూ మార్పులు రావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. చాలా మంది హంగూ ఆర్బాటాలతో కూడిన వివాహం జరగాలని కోరుకుంటున్నారని, పెళ్లి ఖర్చంతా భరించే ఆనవాయితీ ఉన్న పెళ్లి కుమార్తె కుటుంబానికి అది భారంగా మారుతోందని చెప్పారు. రెండు మూడ్రోజులు సాగే ఈ వివాహ తంతుకు సుమారు రూ.12-15 లక్షలు ఖర్చువుతోందని తెలిపారు. ఆర్థికంగా ఉన్నవారికి పర్లేదు గానీ, మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి వారు అప్పుల్లో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఆడపిల్లలకు పెళ్లి చేయాలంటేనే ఏళ్ల పాటు కూడబెట్టాల్సిన పరిస్థితి నెలకొందని, ఇలాంటి అహాన్ని పక్కనపెడితే తమిళనాడులోనే అమ్మాయిలు దొరుకుతారని పేర్కొన్నారు. తమిళ- తెలుగు బ్రాహ్మణుల వివాహాలు, కన్నడ బ్రాహ్మణులతో వివాహాలు ఇటీవల పెద్ద ఎత్తున జరుగుతున్నాయని పెళ్లి కోసం ఎదురుచూస్తున్న అజయ్ అనే వ్యక్తి చెప్పారు. ఉత్తరాది బ్రాహ్మణులతో సైతం పెద్దలు కుదిర్చిన వివాహాలు జరుగుతుండడం చూస్తున్నామని పేర్కొన్నారు. ఒకప్పుడంటే ఇవన్నీ జరిగేవి కావని, ఇప్పుడు జరుగుతున్నాయని చెప్పారు. సంఘం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు.
దక్షిణాదిలో వధువుల కొరత. ఉత్తరాది నుండి దిగుమతి.
Related tags :