శాసనసభలో ముఖ్యమంత్రి జగన్ తో పాటు ఆయన పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు చేస్తున్న హెలనలు అవమానాలు తాను భరించలేక పోతున్నానని ఈ దుర్మార్గపు కౌరవ సభలో తాను ఉండలేనని ప్రతిపక్ష నేత చంద్రబాబు అసెంబ్లీని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. తాను ముఖ్యమంత్రిగానే తిరిగి అసెంబ్లీలో అడుగు పెడతానని ఆయన భీకర ప్రతిజ్ఞ చేశారు. అనంతరం పత్రికా విలేకరుల సమావేశంలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నడూ రాజకీయాలలో వేలు పెట్టని తన భార్య భువనేశ్వరిపై కూడా అభాండాలు వేస్తున్నారని ఆయన కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యారు.
*** రాష్ట్రంలో రాజకీయ కలకలం
చంద్రబాబు ప్రకటనతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి గతంలో ఎన్నో ఉపద్రవాలు ఎదుర్కొన్న కాకలు తీరిన రాజకీయవేత్తగా పేరుపొందిన చంద్రబాబు నాయుడు కళ్లవెంట నీళ్లు పెట్టడం తెలుగుదేశం పార్టీలోనే కాకుండా రాష్ట్ర ప్రజల్లో ను సంచలనం కలిగించింది. చంద్రబాబు ప్రతిజ్ఞ నెరవేరుతుందా? ఆయన తిరిగి ముఖ్యమంత్రిగానే సభలో అడుగు పెడతారా? అనే చర్చలు ప్రజల్లో మొదలయ్యాయి. ఈ సందర్భంగా గతంలో జరిగిన శాసనసభ బహిష్కరణ సంఘటనలను ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటున్నారు.
*** నాడు ఎన్టీఆర్…జయలలిత ఇవే ప్రతిజ్ఞలు
1993 ఆగస్టు 7వ తేదీన అప్పటి తెలుగుదేశం జమ్ములమడుగు శాసనసభ్యుడు పి.శివారెడ్డి హైదరాబాదులో పట్టపగలు దారుణ హత్యకు గురయ్యారు. అప్పుడు శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న ఎన్టీరామారావు దీనిపై తీవ్ర నిరసన వ్యక్తపరిచి విచారణ కోసం కమిషన్ వేయాలని డిమాండ్ చేశారు. అప్పటి ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి డిమాండ్ ను తిరస్కరించారు. దీంతో కలత చెందిన ఎన్టీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న శాసనసభలో తాను అడుగుపెట్టనని తిరిగి ముఖ్యమంత్రిగానే శాసనసభకు వస్తానని భీకర ప్రతిజ్ఞ చేసి బహిష్కరించారు. అన్న మాట ప్రకారం ఎన్టీఆర్ 1994లో ముఖ్యమంత్రిగా ఎన్నికై తిరిగి అసెంబ్లీలో ప్రవేశించారు.
*** జయలలిత, జగన్ లవి ఇవే ప్రతిజ్ఞలు
అది 1989 వ సంవత్సరం తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న జయలలిత బడ్జెట్‌పై చర్చలో పాల్గొంటూ కరుణానిధి ప్రభుత్వాన్ని ఎండగట్టడం మొదలుపెట్టారు. ఇది సహించని డిఎంకె ఎమ్మెల్యేలు కౌరవసభలో ద్రౌపదిని అవమానించినట్లు జయలలిత చీర లాగి చించివేశారు. దీనితో కలత చెందిన జయలలిత తాను ముఖ్యమంత్రిగానే సభలో అడుగు పెడతానని ప్రతిజ్ఞ చేశారు. అన్న మాట ప్రకారం 1991లో జయలలిత ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2015 మార్చి 19వ తేదీన అప్పటి అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ తెలుగుదేశం ప్రభుత్వంపై అలిగి తాను ముఖ్యమంత్రి కాగానే తిరిగి అసెంబ్లీలో అడుగుపెడతానని ప్రతిజ్ఞ చేసి 2019లో తన కోరికను నెరవేర్చుకున్నారు.
*** చంద్రబాబు ప్రతిజ్ఞ నెరవేరుతుందా??
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ వర్గాలతో పాటు రాష్ట్ర ప్రజల్లోనూ జరుగుతున్న చర్చ ఇదే. చంద్రబాబు తన ప్రతిజ్ఞను నెరవేర్చుకుంటారా?? తిరిగి ఆయన ముఖ్యమంత్రిగానే శాసనసభలో అడుగు పెడతారా? గతంలో ప్రతిజ్ఞలు చేసి ముఖ్యమంత్రులు అయిన ఎన్టీఆర్ జయలలిత జగన్ బాటలోనే చంద్రబాబు విజయం సాధిస్తారా? అనే విషయాలపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండు సంవత్సరాలకు పైగానే సమయం ఉంది. చంద్రబాబు తన ప్రతిజ్ఞ నెరవేర్చుకోవాలనుకుంటే రాష్ట్రంలో ఉన్న వైకాపా ప్రభుత్వంతో తీవ్ర పోరాటం చేయక తప్పదు.—కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్.