DailyDose

చిన్నారిపై హిజ్రాల దారుణం-నేరవార్తలు

చిన్నారిపై హిజ్రాల దారుణం-నేరవార్తలు

* చంటి బిడ్డను తల్లి దగ్గర్నుంచి లాక్కున్న ఓ హిజ్రా.. డబ్బులిస్తేనే విడిచిపెడతానని డిమాండ్‌ చేశారు. చివరకు, ఆ హిజ్రా ఒడిలోనే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో ఈ విషాదం జరిగింది. బంగ్లా గ్రామంలో నివసించే మంపి సర్కార్‌ దంపతులకు అక్టోబర్‌ 29న ముగ్గురు పిల్లలు పుట్టారు. గత బుధవారం (నవంబర్‌ 17న) మధ్యాహ్నం కొంతమంది హిజ్రాలు సర్కార్‌ ఇంటికి వెళ్లారు. పిల్లలకు దీవెనలు అందిస్తామంటూ రూ.5 వేలు డిమాండ్‌ చేశారు. అంత మొత్తం ఇవ్వలేమనడంతో కుటుంబసభ్యులతో వాదనకు దిగారు. అంతలోనే ఔలద్‌ అలీ అనే హిజ్రా.. ఓ శిశువును తన ఒడిలోకి తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. తమ వద్ద ఉన్న రూ.500 ఇస్తానన్నా వినిపించుకోలేదు. శిశువుకు నలతగా ఉందని, పాలు పట్టాలని చెప్పినా వినిపించుకోలేదు. చివరికి హిజ్రా చేతిలోనే బిడ్డ ప్రాణం విడిచిందని శిశువు తల్లి బోరుమంది. ఈ వ్యవహారంపై కేసు నమోదుచేసిన పోలీసులు అలీని అరెస్టు చేశారు.

* అనంతపురం జిల్లా కదిరిలో విషాదం చోటు చేసుకుంది. పాత ఛైర్మన్‌ వీధిలో నిర్మాణంలో ఉన్న భవనం కూలి పక్కనే ఉన్న రెండు భవనాలపై దాని శిథిలాలు పడ్డాయి. ఈ ఘటనలో ఒక ఇంట్లో ఉన్న 8 మంది, మరో ఇంట్లోని ఏడుగురు శిథిలాల కింద చిక్కుకున్నారు. మొత్తం 15 మందిలో ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ మృతిచెందారు. 10 మంది క్షేమంగా బయటపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్న ఇద్దరిని కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టారు. భవనం కూలే సమయంలోనే గ్యాస్‌ సిలిండర్‌ పేలిందని బాధితులు తెలిపారు. ఘటనాస్థలిని అదనపు ఎస్పీ రామకృష్ణప్రసాద్‌, ఆర్డీవో వెంకటరెడ్డి పరిశీలించారు. శిథిలాల్లో ఉన్న కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెవెన్యూ, పోలీసు అధికారుల సమక్షంలో శిథిలాలను తొలగిస్తున్నారు.

* కుటుంబ కలహాల కారణంగా కోడలితో వాదనకు దిగిన మామ.. కోపంతో ఆమె చెయ్యి నరికేశాడు. మధ్యప్రదేశ్‌లోని విదిశలో ఈనెల 11న జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించగా వైద్యులు 9 గంటల పాటు శస్త్రచికిత్స చేసి చేతిని తిరిగి అతికించారు. అనంతరం ఆమెను ఐసీయూకి తరలించారు. బాధితురాలిని ఆసుపత్రికి తీసుకురావడం మరింత ఆలస్యమై ఉంటే చేతిని అతికించడం సాధ్యమయ్యేది కాదని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్యం నిలకడగా ఉంది. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

* మీరేం చేయొద్ధు వస్తువులు కొనాలి. అది ఎలా ఉందో ‘రివ్యూ’ రాయాలంతే. మీ కమిషన్‌ మీకు వచ్చేస్తుంది. ఇంట్లో ఉంటూనే రూ.లక్షల్లో సంపాదించవచ్ఛు.. అంటూ ఓ మహిళను ముంచేశారు. మియాపూర్‌లో నివసించే బాధితురాలి(29)కి ఇటీవల ఓ ఎస్‌ఎంఎస్‌ వచ్చింది. ‘మెర్రీ జాబ్స్‌.కామ్‌’ వెబ్‌సైట్‌కు సంబంధించిన లింక్‌ ఉంది. క్లిక్‌ చేసి సభ్యత్వం తీసుకున్నారు. దినేష్‌ కంపెనీ తరఫున వాట్సాప్‌లో ఛాటింగ్‌ చేశారు. రివ్యూ రాస్తే కొనుగోలు చేసిన వస్తువు విలువలో 15 శాతం కమీషన్‌గా ఇస్తామని చెప్పాడు. తొలుత ప్రెషర్‌ కుక్కర్‌ కొనుగోలు చేసి రివ్యూ రాయగా 15 శాతం కమీషన్‌ వచ్చింది. స్మార్ట్‌ టీవీ తీసుకొని, రివ్యూ పూర్తి చేసి అప్‌లోడ్‌ చేయగా రూ.50వేలు జమయ్యింది. విత్‌డ్రాకు అవకాశం ఇవ్వలేదు. ఎందుకిలా అని అడిగితే రూ.50వేలు వెచ్చించి మరో వస్తువును కొనాలన్నారు. అలా రూ.1.79 లక్షల విలువైన వస్తువుల్ని కొనుగోలు చేయించారు. వస్తువులు, కమీషన్‌ రాకపోవడంతో ఆమె సైబరాబాద్‌ సైబర్‌ పోలీసుల్ని ఆశ్రయించారు.

* పెద్ద అంబర్‌పేట్‌ ఔటర్‌ రింగ్‌రోడ్(ఓఆర్‌ఆర్‌) వద్ద ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిపై ఎనిమిది కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఘటనలో వాహనాలు ధ్వంసమయ్యాయి. వాహనాల ముందు వెళ్తున్న లారీ ఒక్కసారిగా బ్రేక్‌ వేయడంతో వెనకున్న కార్లు ఢీకొన్నాయి. ఘటనలో ప్రాణనష్టం తప్పినట్లు స్థానికులు తెలిపారు.