తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని ఉద్దేశించి వైకాపా నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలపై ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. శుక్రవారం ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటన.. తన మనసును కలిచివేసిందన్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమే కానీ.. అవి ప్రజా సమస్యలపై జరగాలని వ్యాఖ్యానించారు.అది మన సంస్కృతి. వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత విమర్శలు ఉండకూడదని జూనియర్ ఎన్టీఆర్ అభిప్రాయపడ్డారు. ఆడపడుచులపై పరుష వ్యాఖ్యలు.. అరాచక పాలనకు నాంది అని వ్యాఖ్యానించారు. ఆడవాళ్లను గౌరవించడం మన సంస్కృతి అని.. వాటిని భావితరాలకు జాగ్రత్తగా అప్పగించాలన్నారు. కుమారుడు, భర్త, తండ్రిగా.. ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని ట్విట్టర్ వేదికగా వీడియో సందేశంలో తెలిపారు. ‘నిన్న అసెంబ్లీలో జరిగిన ఘటన.. నా మనసును కలిచివేసింది. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. విమర్శలు, ప్రతి విమర్శలు ప్రజా సమస్యలపై జరగాలి. వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత విమర్శలు ఉండకూడదు. ఆడపడుచులపై పరుష వ్యాఖ్యలు.. అరాచక పాలనకు నాంది. ఆడవాళ్లను గౌరవించడం మన సంస్కృతి. మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు జాగ్రత్తగా అప్పగించాలి’ అని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై పలువురు నేతలు వ్యక్తిగతంగా అవమానకరరీతిలో వ్యాఖ్యలు చేయడంపై సినీ నటులు నందమూరి కల్యాణ్‌రామ్, నారా రోహిత్ కూడా స్పందించారు. వాక్ స్వాతంత్య్ర హక్కును ఉపయోగించుకుని నోటికొచ్చినట్లు మాట్లాడటం తగదని అన్నారు. ‘‘అసెంబ్లీ అనేది ప్రజా సమస్యలను చర్చించి వాటి పరిష్కారం కోసం పాటు పడే దేవాలయం వంటిది. అక్కడ చాలా మంది మేధావులు, చదువుకున్న వారు ఉంటారు. అలాంటి ఓ గొప్ప ప్రదేశంలో రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి గురించి, అదీ వ్యక్తిగతంగా మాట్లాడటం అనేది బాధాకరం. ఇది సరైన విధానం కాదు. సాటి వ్యక్తిని, ముఖ్యంగా మహిళలను గౌరవించే మన సంప్రదాయంలో మహిళలను అసెంబ్లీలో అకారణంగా దూషించే పరిస్థితి ఎదురుకావటం దురదృష్టకరం. అందరూ హుందాగా నడుచుకోవాలని మనవి చేసుకుంటున్నా’’ అని నందమూరి కల్యాణ్ రామ్ పేర్కొన్నారు.
వైకాపా నేతల వ్యాఖ్యలపై జూనియర్ ఎన్.టీ.ఆర్ స్పందన
Related tags :