Movies

విషమంగా కైకాల ఆరోగ్య పరిస్థితి

విషమంగా కైకాల ఆరోగ్య పరిస్థితి

సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ (88) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన జూబ్లీ హిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.దీంతో టాలీవుడ్ లో ఆందోళన నెలకొంది. సత్యనారాయణ కోలుకోవాలని పలువురు నటీనటులు, అభిమానులు కోరుకుంటున్నారు. అయితే గత కొన్ని రోజుల క్రితం కైకాల సత్యనారాయణ ఇంట్లో కాలు జారిపడగా… సికింద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే.

1959 లో సిపాయి కూతురు సినిమాతో వెండి తెరపై అడుగు పెట్టారు కైకాల సత్యనారాయణ. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టు ఇలా ఏ పాత్రలో నటించినా ఆ పాత్రకు జీవం పోసి.. నవరస నట సార్వభౌమగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఖ్యాతిగాంచారు. తనదైన నటనలో అభిమానులను అలరించడమే కాదు.. తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నారు. గత 60 ఏళ్లుగా సినీ రంగంలో ఉన్న కైకాల గత కొంతకాలం క్రితం వరకూ తండ్రి, తాత పాత్రలను పోషించారు. సుదీర్ఘ సినీ కెరీర్ లో సుమారు 777 సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించారు.

ఇంకా చెప్పాలంటే తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎస్వీఆర్ తర్వాత ఆ రేంజ్ లో వైవిధ్య పాత్రల్లో నటించింది ఒక్క కైకాల మాత్రమే.. పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద చిత్రాల్లో హాస్య, విలన్, హీరో గా నటించిన కైకాల సత్యనారాయణ కాలక్రమంలో నేటి తరానికి తండ్రి, తాత పాత్రల్లో కూడా నటించారు. అప్పట్లో ఎన్టీఆర్ హీరోగా ద్విపాత్రాభినయం చేస్తే.. అందులో ఒక పాత్రలో సత్యనారాయణ నటించేవారు. ఎన్టీఆర్ కు కైకాల సత్యానారాయణ కు మంచి అనుబంధం ఉండేదని పలు మార్లు సత్యనారాయణ గుర్తు చేసుకున్నారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో 1935 జూలై 25న కైకాల జన్మించారు. 1960లో సత్యనారాయణ నాగేశ్వరమ్మని పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్ళు, ఇద్దరు కొడుకులు.