కరోనా వ్యాక్సిన్ ఇప్పుడు అందరికీ అత్యవసరం. ఆ టీకా తీసుకునేవాళ్లకే ఎక్కడైనా ఎంట్రీ ఉంటోంది. ఇక క్రీడా టోర్నీల్లో పోటీపడేవాళ్లకు కూడా వ్యాక్సిన్ తప్పనిసరి చేశారు. కానీ కొందరు ఆటగాళ్లు ఇంత వరకు కోవిడ్ టీకా తీసుకోలేదు. అయితే వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ ఇప్పుడు స్టార్ టెన్నిస్ ప్లేయర్లకు ఓ పరీక్షగా మారనున్నది. వ్యాక్సిన్ వేసుకోని ఆటగాళ్లను టోర్నీలో ఆడనివ్వమని ఆస్ట్రేలియన్ ఓపెన్ డైరక్టర్ క్రెయిగ్ టిలే తెలిపారు. ఆస్ట్రేలియా రాజకీయవేత్తల నుంచి వస్తున్న రకరకాల ప్రకటనలతోనూ కొంత ఆందోళన నెలకొన్నది. కానీ ఆస్ట్రేలియన్ ఓపెన్ నిర్వాహకులు మాత్రం వ్యాక్సిన్ వేసుకోవాల్సిందే అని తేల్చిచెబుతున్నారు.
వ్యాక్సిన్ షరతు ఇప్పుడు పెద్ద పెద్ద టెన్నిస్ ప్లేయర్లకు గండంగా మారింది. డిఫెండింగ్ చాంపియన్ నోవక్ జోకోవిచ్ వ్యాక్సిన్ గురించి ఇటీవల ఓ కామెంట్ చేశాడు. తన వ్యాక్సిన్ స్టేటస్‌ను వెల్లడించేది లేదన్నారు. కానీ వ్యాక్సిన్ వేసుకుంటేనే ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు ఎంట్రీ ఉంటుంది. అయితే జోకోవిచ్ వ్యాక్సిన్ తీసుకునే టోర్నీకి వస్తారని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు. జనవరి 17 నుంచి ప్రారంభం అయ్యే ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు ఈసారి ప్రేక్షకులను కూడా అనుమతించనున్నారు.
ఏటీపీ టూర్, వుమెన్స్ టెన్నిస్ సంఘం ప్రకారం.. దాదాపు 35 శాతం మంది ఆటగాళ్లు ఇంకా వ్యాక్సిన్ తీసుకోలేదు. వ్యాక్సిన్ వేసుకోకున్నా.. నెగటివ్ రిపోర్ట్ ఉంటే సరిపోతుందని డబ్ల్యూటీఏ అంటోంది. కానీ వ్యాక్సిన్ వేసుకోని ప్లేయర్లకు ఆస్ట్రేలియా వీసా ఇవ్వదని విక్టోరియా మంత్రి తెలిపారు. కరోనా తర్వాత ఆస్ట్రేలియా కఠిన ట్రావెల్ ఆంక్షలు విధిస్తున్న విషయం తెలిసిందే.