చలికాలంలో చర్మం పొడిబారడం, దురద, మొటిమలు మొదలైన సమస్యలు సాధారణం. ఉష్ణోగ్రతలు పడిపోయినప్పుడు చర్మ కణాల్లోని తేమ తగ్గుతూ ఉండటమే దీనికి కారణం. అయితే మార్కెట్లో దొరికే వివిధ మాయిశ్చరైజర్లు, క్రీములు, లోషన్లు తాత్కాలికంగా ఊరటనిచ్చినా, వాటిలోని రసాయనాలు చర్మంపై దుష్ప్రభావం చూపుతాయి. అందుకే వంటింట్లో ఉండే సహజసిద్ధమైన పదార్థాలతోనే చర్మాన్ని కాపాడుకోవచ్చని చెబుతున్నారు డెర్మటాలజిస్ట్‌లు.
పసుపును వంటల్లో వాడితే, అందులోని ఔషధ గుణాలు పొడిబారిన చర్మాన్ని మామూలు స్థితికి తీసుకొస్తాయి.
వారానికోసారి పసుపు, పాలు, తేనె కలిపి ముఖానికి ప్యాక్ వేసుకున్నా, చర్మం మృదువుగా మారి మచ్చలు దూరమవుతాయి.
అలాగే ఇంట్లోనే షియా బట్టర్, కొబ్బరి నూనె, బాదం నూనె, కలబంద గుజ్జు, బీస్ వ్యాక్స్ సమపాళ్లలో కలిపి సహజసిద్ధమైన బాడీ లోషన్ తయారు చేసుకోవచ్చు.
ఈ సీజన్‌లో రోజూ చర్మానికి కొబ్బరి నూనె, ఆలివ్ నూనె, ఆముదం రాసుకుని, కొద్దిసేపు మర్దనా చేయాలి. పావుగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో స్నానం చేస్తే చర్మం పొడిబారకుండా ఉంటుంది.
వీటితోపాటు చలికాలంలో పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, బెల్లం, గింజ ధాన్యాలను ఆహారంలో చేర్చుకోవాలి.
మైదాపిండి వంటకాలు, వేపుళ్లు, కేకులు, కుకీలు వంటి బేకరీ పదార్థాలు, శీతల పానీయాలకు దూరంగా ఉండాలి.
ఇలా చేస్తూనే రోజుకు కనీసం 7-8 గ్లాసుల గోరువెచ్చని నీళ్లు తాగాలి. దీనివల్ల రక్త ప్రసరణ బాగా జరగడంతోపాటు, చర్మం నిగనిగలాడుతుంది.