Food

బరువు తగ్గేందుకు ఇవి తినండి

బరువు తగ్గేందుకు ఇవి తినండి

నిద్రలేమి వల్ల లెప్టిన్, ఘెర్లిన్‌ హార్మోన్లపై ప్రభావం పడుతుంది. ఒత్తిడి వల్ల కార్టిసాల్‌ అనే హార్మోన్‌ విడుదలై ఆకలి పెరుగుతుంది. ఆకలి పెరగడం వల్ల అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటారు. దానివల్ల శరీరంలోకి ఎక్కువ క్యాలరీలు చేరతాయి. నిద్రలేమి, ఒత్తిడి వల్ల మధుమేహం, ఊబకాయం వంటి అనేక వ్యాధులు వస్తాయి. చక్కెర శాతం ఎక్కువగా ఉండే పానీయాల వల్ల శరీరంలోకి ఎక్కువ క్యాలరీలు చేరతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

టీవీ లేదా ల్యాప్‌టాప్‌లో సినిమాలు, వీడియోలు చూస్తూ తినడం వల్ల కూడా బరువు పెరుగుతారు. ఎందుకంటే.. వాటి ధ్యాసలో పడి అతిగా తినేస్తారు.

బరువు తగ్గడానికి ఉపకరించే ఆహారాలు

పసుపు: రోజూ తినే తిండిలో వీలైనంత వరకు పసుపు వాడితే గుండెకు మంచిది. ఎల్‌.డి.ఎల్‌ అంటే చెడు కొలెస్ట్రాల్‌నుతగ్గించి, రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది పసుపు. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే సమస్యను తొలగించి, గుండెపోటు రాకుండా కాపాడుతుంది.

యాలకులు: తిన్న ఆహారం సాఫీగా జీర్ణమైతేనే శరీరానికి తగినంత జీవశక్తి లభిస్తుంది. యాలకులతో జీర్ణప్రక్రియ మెరుగుపడుతుంది. ఇదివరకే శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును సైతం తొలగించే శక్తి యాలకులలో ఉంది.

మిరప: మిరపలోని క్యాప్‌సైసిన్‌ క్యాలరీలను వేగంగా ఖర్చుచేస్తుంది. క్యాలరీలు తొందరగా ఖర్చయ్యేకొద్దీ కొలెస్ట్రాల్‌ పెరగదు.

కరివేపాకు: శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్లు, చెడుకొవ్వును కరివేప చకచకా ఊడ్చేస్తుంది. దీనిని కూరల్లో కలిపి తిన్నా సరే, లేకపోతే రోజూ పది కరివేపాకులతో జ్యూస్‌ చేసుకొని తాగినా మంచిదే.

వెల్లుల్లి: ఇందులోని యాంటీ బాక్టీరియల్‌ యాసిడ్స్‌ కొవ్వును బాగా తగ్గిస్తాయి. అందుకే వెల్లుల్లిని ‘ఫ్యాట్‌ బర్నింగ్‌ ఫుడ్‌’ అని పిలుస్తారు. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, అధిక రక్తపోటు సమస్యను నివారించడంలో వెల్లుల్లి పాత్ర ఎనలేనిది.