Health

కొత్తరకం జబ్బు…”రింగ్జైటీ”

కొత్తరకం జబ్బు…”రింగ్జైటీ”

ఫోన్‌ రింగ్‌ అవుతుందేమోనని పదే పదే చూడడం….ఏ చిన్న శబ్దం వచ్చినా.. వాట్సాప్‌కు మెసేజ్‌ వచ్చి ఉంటుందేమోనని ఆత్రుతగా చెక్‌ చేసుకోవడం..మొబైల్‌కు ఏమైనా అప్‌డేట్స్‌ వస్తాయేమోనని భ్రాంతిలో తరచూ వెతకడం..అసలు ఏదీ రాకపోతే.. నిరాశకు గురికావడం..ప్రస్తుతం చాలామందిలో కనిపిస్తున్న ‘రోగ’ లక్షణాలివి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెనుమార్పులు తెచ్చింది. ముఖ్యంగా మొబైల్‌ ఫోన్‌ మన జీవితంలో ప్రధానభాగంగా మారిపోయింది. యువతలో ఈ ధోరణి ఎక్కువగా ఉంది. అవసరానికి మించి వాడకంతో వీరికి అనేక సమస్యలు తెచ్చి పెడుతోంది. కాల్స్‌, మెసేజ్‌లు, సామాజిక మాధ్యమాలు.. తదితర అవసరాల కోసం ఫోన్‌ పైనే అధిక సమయం కేటాయిస్తున్నారు. ఓ వైపు ముఖ్యమైన పని ఉన్నా.. మొబైల్‌ చూడకపోతే ఏదో కోల్పోతున్నామనే భావనలో ఉంటున్నారు. ఇటీవల పలువురిలో ‘రింగ్జైటీ’ అనే సమస్య కనిపిస్తోంది. దీనిని ఫాంటమ్‌ రింగింగ్‌ సిండ్రోమ్‌ అని కూడా పిలుస్తున్నారు. ఈ కారణంతో సైకాలజిస్టుల వద్దకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది. ఇది పలు మానసిక సమస్యలకు దారితీస్తోందని చెబుతున్నారు.

ఫోన్‌ను మితిమీరి వినియోగిస్తూ దానికి బానిసలవుతున్నారు. ఈ సమస్యతో ఇబ్బంది పడే వారు నిద్రపోతున్న సమయంలోనూ మొబైల్‌ను అందుబాటులో పెట్టుకుంటారు. రోడ్డుపై నడిచి వెళ్తున్నప్పుడు, వాహనం నడుపుతూ కూడా ఫోన్‌పై ఓ కన్నేసి ఉంచుతారు. కలత నిద్రతో మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఫోన్‌ను ఎక్కువ వాడే వారిలో దాదాపు 25 శాతం మందికి పైగా ఇటువంటి లక్షణాలతో సతమతమవుతుంటారని మానసిక నిపుణులు అంటున్నారు.

* నగరంలోని ఓ ఇంటర్‌ విద్యార్థి.. చదువులో బాగా వెనుకబడడం, ఏకాగ్రత లేకపోవడంతో యువకుడి తండ్రి సైకాలజిస్టు వద్దకు తీసుకొచ్చారు. అతడిని విచారిస్తే తరగతి గదిలో అధ్యాపకుడు పాఠాలు చెబుతున్న సమయంలోనూ ఎక్కువ సార్లు ఫోన్‌ చూస్తున్నానని చెప్పాడు. స్నేహితులు, ఇతరుల నుంచి వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లో సందేశాలు వస్తాయని, వాటిని ఎప్పటికప్పుడు చూడాలన్న భావనతో మొబైల్‌పై దృష్టి పెడుతున్నట్లు పేర్కొన్నాడు.
* ఓ బహుళ జాతి సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేసే ఓ ఉద్యోగికి అమెరికా, ఇంగ్లాండ్‌లో తన రంగంలోనే పనిచేసే మిత్రులు ఉన్నారు. వారితో నిరంతరం ఛాటింగ్‌లో అనుసంధానమై ఉంటాడు. విధులు ముగిసిన తర్వాత కూడా నిద్ర పోకుండా మిత్రులతో సంభాషించేందుకు ఎక్కువ సమయం వెచ్చించే వాడు. ఫోన్‌ను దిండు కిందే పెట్టుకుని పడుకునే వాడు. ఏమాత్రం అలికిడి అయినా ఏదైనా ముఖ్యమైన సందేశం వచ్చి ఉండొచ్చన్న గాభరాతో నిద్ర పట్టేది కాదు. ఇది అంతిమంగా పనిపై పడి, మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. 2 విధి నిర్వహణలో ఉన్నప్పుడు చేసే పనిపైనే లగ్నం చేయాలని, ఫోన్‌ చూసుకోవడానికి ప్రత్యేకంగా సమయం నిర్దేశించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రింగ్జైటీ సమస్యతో ఇబ్బంది పడేవారు.. మానసికంగా దృఢంగా ఉండేందుకు యోగా, ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలని, దీని వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందని వారు చెబుతున్నారు.