Devotional

అష్ట ఐశ్వర్యాలు అష్ట దరిద్రాలు అంటే ఇవే

TNILIVE Default Featured Image

అష్టైశ్వర్యాలు అష్టదరిద్రాలు.
………………………………………………….

అష్టైశ్వర్యములు అనగా

(1)దాసీ జనం. అనగా వ్యక్తిగత కుటుంబగత సేవకులు వుండడం.

(2) భృత్యులు. అనగా తన కొలువులో పనిచేయు ఉద్యోగులు.

(3) సంతానం.యశస్సును వంశగౌరవాన్ని తెచ్చే సంతానాన్ని కలిగివుండటం.

(4) బంధువులు. అనగా ఆపద సమయంలో ఆదుకొనే బంధువులు వుండటం.

(5) వస్తువులు. అనగా తాను తన కుటుంబం, ఆశ్రితులు మొదలైనవారు సుఖజీవనం గడపటానికి, శత్రువులనుండి రక్షణ పొందటానికి అనువైన సామాగ్రి వుండడం.

(6) వాహనములు. అనగా రాజ్యానికి గ్రామానికి కుంటుంబానికి మరియు వ్యక్తిదైనందిన జీవితంలో అవసరానికి రవాణాకు బండ్లు రథములు పల్లకీలు మొదలైనవి కలిగివుండడం.

(7) ధనము.

కులము గలుగు వాడు గోత్రంబు గలవాఁడు
విద్య చేత విర్ర వీగువాఁడు
పసిడి గలుగు వాని బానిస కొడుకులు
విశ్వరాభిరామ వినుర వేమ.

(8) ధాన్యము. ఎంత ధనముంటేనేమి ప్రయోజనం, తిండి గింజలు కరువైనపుడు, ఆ ధనాన్ని మింగలేరు కదా!

సీ. తల్లిగర్భమునుండి ధనము తే డెవ్వడు
వెళ్లిపోయెడినాడు వెంటరాదు
లక్షాధికారైన లవణ మన్నమె కాని
మెఱుగు బంగారంబు మ్రింగబోడు
విత్త మార్జనజేసి విఱ్ఱవీగుటె కాని
కూడబెట్టిన సొమ్ము తోడరాదు
పొందుగా మఱుగైన భూమిలోపల బెట్టి
దానధర్మము లేక దాచి దాచి

తే. తుదకు దొంగల కిత్తురో దొరల కవునొ
తేనె జుంటీగ లియ్యవా తెరువరులకు
భూషణవికాస శ్రీధర్మ పురనివాస
దుష్టసంహార నరసింహ.

ఇక మానవుడు పడే అష్టకష్టాలేమిటో చూద్దాం. అష్టకష్ణాలకే అష్టదరిద్రాలని పేరు.

(1) దాస్యం.సంపదలు కోల్పోయి ఇతరుల వద్ద దాసీగా / దాసుడుగా చేరి బ్రతకడం.
(2) దరిద్ర్యం. దరిద్ర్యమంటే డబ్బులేకపోవడమే కాదు. ఆదుకొనే సంతానం, బంధువులు, మిత్రులు, పాలకులు, భృత్యులు లేకపోవడం కూడా.
(3) భార్యావియోగం. భర్తవియోగం కూడా. భార్య పైన ఆధారపడిన భర్త, ఆ భార్య గతిస్తే ఎక్కువరోజులు బ్రతికిన దాఖలాలు బహుతక్కువ.
(4) తప్పు చేయడం.అంటే దొంగతనం, జూదం, వ్యభిచారం, అబద్ధాలు చెప్పడం, మత్తుపదార్థాల వినియోగం మొదలైనవి.వ్యసనపరుడిగా మారడం.
(5) బిక్షాటన. సప్తవ్యసనాలకులోనై సర్వం పోగొట్టుకొని విధిలేక పూలమ్మినచోటే కట్టెలమ్మడమన్నమాట. అడుక్కుతినడం.
(6) ఏ ప్రయత్నం చేయకపోవడం.అంటే కార్యం ప్రారంభించకుండా సోమరిగా తిరగడం.
(7) అప్పు. వ్యసనాలకు బానిసై విపరీతంగా బుుణాలు పొంది ఆస్తులను,గౌరవాలను పోగొట్టుకోవడం.

సామెతలు
(1) అప్పుచేసి పప్పుకూడు తినకూడదు.
(2) అప్పులవాడిని నమ్ముకొని అంగడికి, మిండమగడిని నమ్ముకొని జాతరకు పోకూడదు.

(8) వ్యాధి. ఏ రోగాన్ని కూడా శరీరం భరించలేదు. రోగాన్ని నిర్లక్ష్యం చేస్తే అది ధీర్ఘరోగమై కృంగికృశింపచేస్తుంది. సంపదలు హరించుకుపోతాయి.

అష్టభోగములంటే (1) గృహము (ఇల్లు) (2) శయ్య ( పడక) (3) వస్త్రము (దుస్తులు (4) స్త్రీ (వెలయాలు ) (5) పుష్పము ( పూలు)(6) తాంబూలము (7) గంధము (చందనగంధాలు ) (8) గానము.(సంగీత నృత్యాలు )

అష్టమదములు.మనిషికి కొవ్వెక్కువ. వాడికి మదమెక్కువ. ఆ మదములంటే (1) నిండైనభోజనము (2) కలిమి (3) స్త్రీ (వ్యభిచారం) (4) విద్య (పాండిత్యం) (5) కులము (6) రూపము (అందం )(7) కొలువు (ఉద్యోగము) (8) యవ్వనము.

మనిషిని కట్టిపడేసేవి అష్టపాశములు. అవేమిటంటే (1) దయ (2) జుగుప్స (3) మోహము (4) భయము (5) సంశయము (6) కులము (7) శీలము (8) బలము.

అష్టగంధములంటే (1) కర్పూరము (2) కస్తూరి (3) పునుగు (4) జవ్వాజి (5) అగరు (6) పన్నీరు (7) అత్తరు (8) గంధం.

అష్టధాతువులంటే లేదా అష్టధాతువులంటే (1) బంగారం, (2) వెండి(3) రాగి (4) ఇనుము (5) తగరము (6) తుత్తునాగము (7) సీసము (8) పాదరసము.