Politics

ముగ్గురు ప్రముఖులు నేల మీద కూర్చొని భోజనం చేస్తున్న చిత్రం ఇది

ముగ్గురు ప్రముఖులు నేల మీద కూర్చొని భోజనం చేస్తున్న చిత్రం ఇది

మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు తో నటులు,మాజీ ముఖ్యమంత్రులు శ్రీ యన్టీఆర్ గారు,ఎమ్జీఆర్ కలసి కింద కూర్చుని భోంచేస్తున్న ఫోటో..!

ఈ ఫోటో 1972 సంవత్సరంలో తీసినది.అప్పట్లో పి.వి.నరసింహారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా ఉండేవారు.అదే సమయంలో తెలుగునేలపై జై ఆంధ్రా ఉద్యమం తీవ్రంగా సాగుతోంది. అంతకుముందు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కూడా తీవ్రస్థాయిలోనే సాగింది. అప్పట్లో యన్టీఆర్ గారు పాలుపొంగు మన తెలుగు గడ్డనూ పగలగొట్టవద్దూ…అంటూ తెలుగుజాతి మనది…నిండుగ వెలుగుజాతి మనది…అని తన తల్లా? పెళ్ళామా? చిత్రంలో నినదించారు.

తెలంగాణ ఉద్యమాన్ని సద్దుమణిగేలా చేయడానికి అప్పటి కేంద్రప్రభుత్వం కొన్ని తాయిలాలు ప్రకటించింది. అవి ఆంధ్రప్రాంతం వారికి తీవ్రనిరాశను కలిగించాయి. దాంతో జై ఆంధ్రా ఉద్యమం లేచింది.ఆంధ్రప్రదేశ్ లో ఈ ఉద్యమం మాంచి కాకమీద ఉన్నప్పుడే పి.వి.నరసింహారావు మద్రాసు సందర్శించారు. ఆ సమయంలో మద్రాసులో ఉన్న రామారావు గారు,ఆయనను భోజనానికి పిలిచారు. అప్పటికే తమిళనాడులో సూపర్ స్టార్ గా వెలుగొందుతూ,తమిళ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు ఎమ్జీఆర్. ఆ సమయంలో ఎమ్జీఆర్ తమిళనాడు అసెంబ్లీలో శాసనసభ్యుడుగా ఉన్నారు.దాంతో రామారావు గారు,తాను అన్న అంటూ ఎంతగానో అభిమానించే ఎమ్జీఆర్ ను కూడా విందుకు పిలిచారు.

అలా యన్టీఆర్ గారి ఇంట్లో పి.వి.నరసింహారావు,ఎమ్జీఆర్ కలుసుకున్నారు. కానీ,ముగ్గురూ సంప్రదాయానికి విలువనిచ్చేవారు. అందువల్ల కిందనే కూర్చుని భోజనం చేశారు.ఈ ముగ్గురూ ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారే కావడం విశేషం!