దక్షిణాఫ్రికా నుంచి వచ్చే విమానాల్లో డజన్ల కొద్దీ కరోనా కేసులు..!
ఆమ్‌స్టర్‌డామ్: దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. దీంతో అప్రమత్తమైన దేశాలు.. మళ్లీ ప్రయాణ ఆంక్షల బాటపట్టాయి. దక్షిణాఫ్రికా నుంచి వచ్చే విమానాల్లో ప్రయాణికులకు విస్తృతంగా పరీక్షలు నిర్వహిస్తున్నాయి. అయితే ఈ విమానాల్లో డజన్ల కొద్దీ కరోనా కేసులు బయటపడుతుండటం మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్ బయటపడగానే నెదర్లాండ్స్ ప్రభుత్వం ఆ దేశం నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించింది. అయితే అప్పటికే దక్షిణాఫ్రికా నుంచి బయల్దేరిన విమానాలను మాత్రం అనుమతిస్తున్నట్లు తెలిపింది. అయితే ఆ ప్రయాణికులకు ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షలు, క్వారంటైన్ తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం దక్షిణాఫ్రికా నుంచి రెండు విమనాలు ఆమ్‌స్టర్‌డామ్‌కు చేరుకోగా.. అందులోని ప్రయాణికులకు వైరస్ పరీక్షలు నిర్వహించారు. అందులో 61 మందికి కొవిడ్ సోకింది.