Health

అంతర్జాతీయ ప్రయాణీకులపై ఆంక్షలను సమీక్షించాలని మోడీ ఆదేశం

అంతర్జాతీయ ప్రయాణీకులపై ఆంక్షలను సమీక్షించాలని మోడీ ఆదేశం

దేశంలో కోవిడ్-19 పరిస్థితి, వ్యాక్సినేషన్‌ కార్యక్రమంపై శనివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలను సడలించే ప్రణాళికలను సమీక్షించాలని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం అధికారులను కోరారు.

కొత్త వేరియంట్‌కు సంబంధించిన పరిణామాలపై క్లుప్తంగా, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ద్వారా ‘ప్రమాదంలో’ ఉన్న దేశాల నుంచి వచ్చే వారిపై ప్రత్యేక దృష్టి సారించి, అంతర్జాతీయంగా వచ్చిన వారందరినీ పర్యవేక్షించాల్సిన అవసరాన్ని ప్రధాని నొక్కి చెప్పారు. వీటితో పాటు ముఖానికి మాస్క్‌ ధరించడం, క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం, సామాజిక దూరాన్ని కొనసాగించడం వంటి కోవిడ్ ప్రోటోకాల్స్‌ను తప్పకుండా పాటించాలని ప్రధాని మోదీ సూచించారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని.. ప్రతి ఒక్కరు విధిగా వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకోవాలని సూచించారు.

ఈ సమావేశానికి కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా, ప్రధాని ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రా, కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్, నీతి ఆయోగ్ సభ్యులు (ఆరోగ్యం) డా. వీకే పాల్ హాజరుకానున్నారు. దక్షిణాఫ్రికాలో వైరస్ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణికులను క్షుణ్ణంగా పరీక్షడంతో పాటు దేశంలో వైరస్‌ వ్యాప్తిని అడ్డుకనేందుకు తగిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు.

కొత్త వేరియంట్లపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా వేరియంట్‌ అత్యంత ప్రమాదకరమైందని డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరించిన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పటికే కొన్ని దేశాలు వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు విమానాల రాకపోకను నిషేధించాయి. ముందస్తు చర్యల్లో భాగంగా దక్షిణాఫ్రికా, జింబాబ్వే సహా 7 దేశాలపై అమెరికా ప్రయాణ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.