ఆటో మొబైల్ మార్కెట్‌లో ఎన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చినా. పెట్రో వెహికల్స్ డిమాండ్ తగ్గడం లేదు. వినియోగదారులకు అనుగుణంగా ఆటోమొబైల్ సంస్థలు కొత్త మోడళ్లతో సరికొత్త హంగులతో మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నాయి. దీంతో పెట్రో వెహికల్స్ హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్నాయి. తాజాగా జపాన్ ఆటో మొబైల్ దిగ్గజం నిన్సాన్‌కు చెందిన ‘నిస్సాన్ మాగ్నైట్’ వెహికల్స్ అమ్మకాలు మనదేశంలో జోరుగా కొనసాగుతున్నాయి.
మైల్‌స్టోన్స్
జపనీస్ కార్ మేకర్ నిస్సాన్ గతేడాది డిసెంబర్ నెలలో నిస్సాన్ మాగ్నైట్ సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీ మోడల్‌ని మార్కెట్‌కి పరిచయం చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రికార్డ్ స్థాయిలో 30వేల కార్లకు పైగా డెలివరీ చేసినట్లు నిస్సాన్ ప్రతినిధులు తెలిపారు. నిస్సాన్ ఇండియా ఎస్‌యూవీ కోసం 72వేల బుకింగ్‌లు అయినట్లు చెప్పారు. అయితే భారీ స్థాయిలో కార్లను డెలివరీ చేయడం సాధారణ విషయం కాదని ఆటోమొబైల్ మార్కెట్ నిపుణులు చెబుతుండగా.. కోవిడ్, చిప్ కొరత ఉన్నా కార్లను డెలివరీ చేయడంపై మన దేశంలో నిస్సాన్ డీలర్‌లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
నిస్సాన్ మాగ్నైట్ ధర
నిస్సాన్ మాగ్నైట్ భారతీయ మార్కెట్లో బ్రాండ్ మొట్టమొదటి సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీ. సీఎంఎఫ్-ఏ ప్లస్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా పనిచేస్తుంది. ఎస్‌యూవీ ఎక్స్‌ఈ, ఎక్స్‌ఎల్, ఎక్స్‌వీ నాలుగు వేరింట్లలో అందుబాటులో ఉండగా.. ఎస్‌యూవీ ధరలు రూ. 5.71 లక్షల నుండి ప్రారంభం అవుతుంది. ఢిల్లీలో రూ. 9.89 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉంది.