WorldWonders

ఆస్ట్రేలియాలో కాకి గోల

ఆస్ట్రేలియాలో కాకి గోల

మన ఊళ్లలో కాకులు గుడ్లుపెట్టినప్పుడు ఆ చుట్టుపక్కలకు మనుషులెవర్నీ రానివ్వవన్న విషయం తెలిసిందే. పొరపాటున వెళ్తే కొన్నిసార్లు అవి మనపైన దాడి చేస్తుంటాయి కూడా. కానీ… ఆ దాడులతో ఎప్పుడైనా మరణాలు సంభవించిన దాఖలాలు మాత్రం లేవు. కనీసం తీవ్రగాయాలైన సంఘటనలూ కనిపించవు. కానీ ఆస్ట్రేలియాలో ఇదో పెద్ద సమస్య ఇప్పుడు! కాకుల జాతికి చెందిన ఓ పక్షి నుంచి కాచుకోవడానికి అక్కడ ప్రతి ఒక్కరూ హెల్మెట్‌ పెట్టుకునే నడుస్తున్నారు. ఈ ఏడాది జులై నుంచి ఇప్పటిదాకా సుమారు ఐదువేల మంది వీటి దాడికి గురయ్యారట. ఆ మధ్య ఆగస్టులో ఐదునెలల పాపతో ఉన్న మహిళపైన ఈ పక్షి దాడికి దిగడంతో… ఆమె చంకనున్న పాప కిందపడి చనిపోయింది. అంతకుముందోసారి వీటిదాడితో పట్టుతప్పిన ఓ సైక్లిస్టు గాయపడి మృతిచెందాడు. ఇక చిన్నచిన్న గాయాలకి గురైనవాళ్లకైతే లెక్కేలేదు. ఇంతగా వాళ్లని భయభ్రాంతులకి గురిచేస్తున్న ఈ పక్షి పేరు ‘ఆస్ట్రేలియన్‌ మ్యాగ్‌పై’. ఇవి చాలా తెలివైన పక్షులని ప్రతీతి. వందమంది మనుషుల ముఖాల్ని గుర్తుపెట్టుకుంటాయనీ చెబుతారు. జులై-డిసెంబర్‌ మధ్య అవి జతకట్టి గుడ్లుపొదిగే కాలం. ఆ సమయంలో ఆడ పక్షులకి రక్షణగా… మగవి కాపలాకాస్తుంటాయి. వాటి గూడు పరిధిలో అనుమానాస్పదంగా ఎవరు కనిపించినా వెంటపడి దాడికి దిగుతాయి. ఇది ఎప్పుడూ ఉండేదికానీ ఈసారి మనుషులు వాడుతున్న మాస్కులు వాటిని గందరగోళపరిచి, కోపానికి గురయ్యేలా చేస్తున్నాయనీ… ఈసారి దాడులు పెరగడానికి అదే కారణమనీ అంటున్నారు. ‘ఈ పక్షుల దాడి ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది? రోజుకి ఎంతమంది గాయాలకి గురవుతున్నారు? దాడి నుంచి ఎలా తప్పించుకుంటున్నారు?’… వంటివాటిని ‘లైవ్‌’గా చెబుతూ ఇప్పటికే ఆస్ట్రేలియాలో ప్రత్యేక వెబ్‌సైట్‌లూ, ఆప్‌లూ ఎన్నో వచ్చేశాయి!