* అమెరికాలో భారతీయులదే డామినేషన్.. ఎందుకో తెలుసా..
ట్విటర్ సీఈఓగా భారతీయుడి ఎంపిక.. ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వార్త ఇది. అమెరికాలో భారతీయ అమెరికన్ల ప్రాబల్యం గురించి ప్రపంచానికి చాటి చెప్పిన ఉదంతం ఇది. ప్రస్తుతం అమెరికాలోని ప్రముఖ టెక్ కంపెనీల్లో ముఖ్యమైనవి భారత్ నుంచి వలసవెళ్లిన వారి చేతుల్లోనే ఉన్నాయి. దీంతో.. అమెరికా టెక్ రంగంలో భారతీయ సంతతి వారికి ఇంతటి డామినేషన్ ఎందుకుందనే చర్చ ప్రారంభమైంది. అయితే.. వారి విజయాల వెనుక కూడా భారతీయ సంస్కృతే ఉందన్న విషయం ఆశ్చర్యం కలిగించక మానదు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదేళ్ల, గూగుల్(ఆల్ఫబెట్) సీఈఓ సుందర్ పిచాయ్ తమ సంస్థలను ముందుండి నడిపించిన తీరు చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతోంది.
* మైక్రోసాఫ్ట్ పగ్గాలు చేపట్టిన సత్య నాదేళ్ల.. సంస్థలోని పనివాతావరణంలో కీలక మార్పులు తీసుకొచ్చారు. ముఖ్యంగా బిల్ గేట్స్, స్టీవ్ బామర్ మేనేజ్‌మెంట్ స్టైల్‌కు భిన్నంగా భారతీయ విలువలతో కూడిన ఓ కొత్త పంథాను సంస్థను . బౌద్ధమత విలువలను నమ్మే ఆయన అదే విధంగా సంస్థను ముందుండి నడిపించారు. ఫలితంగా మైక్రోసాఫ్ట్ పని సంస్కృతిలో సమూల మార్పులు వచ్చాయి. స్మార్ట్‌ఫోన్ రంగంలో ఎదుర్కొన్న వైఫల్యాలను మైక్రోసాఫ్ట్ పక్కకు నెట్టి ప్రస్తుతం క్లౌడ్ కంప్యూటింగ్ విభాగంలో దూసుకుపోతోంది. సుందర్ పిచాయ్ కూడా గూగుల్‌లో ఇంచుమించు ఇటువంటి అద్భుతాన్నే సృష్టించారు. సంస్థలోని ఉన్నతోద్యోగులు, కిందిస్థాయి ఉద్యోగుల మధ్య లైంగిక సంబంధాలు సంస్థను కుదిపేస్తున్న తరుణంలో పగ్గాలు చేతుల్లోకి తీసుకున్న పిచాయ్.. గూగుల్‌ను కొత్త దిశ వైపు మళ్లించారు.
సత్య నాదేళ్ల, సుందర్ పిచాయ్ ఇద్దరు హుందాగా, శాంతంగా వ్యవహరిస్తూనే తమ సంస్థల్లో సమూల మార్పులు తీసుకొచ్చి విజయాలను అందుకున్నారు. అయితే.. మాతృభూమిలో వారు అందుకున్న సంస్కృతి విలువలే ఈ విజయాలకు కారణమని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. భారత్‌లోని పోటీని తట్టుకుని పైకెదిగే క్రమంలో వారు నేర్చుకున్న పాఠాలే అమెరికా కార్పొరేట్ నిచ్చెన ఎక్కేందుకు వారికి ఉపయోగపడ్డాయి. భారత్‌లో జీవితం నిత్యం సవాళ్లతో కూడుకున్న విషయం తెలిసిందే. సమస్యల్లో ఉన్న వారెవరినైనా ముందుగా అదుకునేది వారి కుటుంబసభ్యులు, స్నేహితులే. ప్రభుత్వం సాయం అంతంతమాత్రంగా ఉన్న భారత్‌లో వ్యక్తులకు తమ కుటుంబమే సర్వస్వం. చదువు, ఉద్యోగాల్లో తీవ్ర పోటీ నెలకొన్న భారత్‌లో ఎదిగిన వారికి ఎటువంటి విపత్కర పరిస్థితి అయినా సహనంతో ఎదుర్కోవడం, ఎంత ఎదిగినా ఇసుమంతైనా గర్వం ప్రదర్శించకుండా ఉండటం సహజంగా అలవడే లక్షణాలు. ఇటువంటి వాతావరణంలో ఎదిగిన అనేక మంది ఎన్నారైలు విదేశాల్లోని సవాళ్లను చాకచక్యంగా ఎదుర్కొంటూ భారత కీర్తి ప్రతిష్టలను ప్రపంచవ్యాప్తం చేస్తున్నారు.