* ఏయూకి ఎంత దుస్థితి!
‘తేజస్వినావధీతమస్తు’ అంటే మమ్మల్ని తేజోవంతులుగా చేయుము. దీన్ని విశ్వకళాపరిషత్ వారు తమ చిహ్నంలో తీసుకున్నారు. కేతు రామమోహన శాస్త్రి తయారుచేశారు. సముద్రం, తామరపువ్వు, దానిపై ఉదయించే సూర్యుడు, ఆ కిరణాలు తామర పుష్పంపై పడుతూ ఉన్నట్టు రూపొందించిన ఈ చిహ్నం చాలా అర్ధవంతమైనది. దానికి రెండు పక్కల నాగుపాములుంటాయి. సముద్రం జ్ఞానానికి ప్రతీక. కలువ చదువుల తల్లి కూర్చుండే ప్రదేశం, కిరణాలు అక్కడ బోధించే వివిధ బోధనాంశాలు, నాగులు జ్ఞాన పరిరక్షణకు రక్షణగా ఉన్నాయి. ఈ విద్యాప్రాంగణానికి ప్రపంచ వ్యాప్తంగా కీర్తిప్రతిష్టలు ఉండేవి. ఎందరో మహానుభావులను దేశానికి ఇచ్చింది. కానీ ఇవాళ విశ్వవిద్యాలయం పెద్దలు తీసుకున్న నిర్ణయం బాధింప చేసేదే.
ఆంధ్ర విశ్వకళాపరిషత్‌లో సుమారు 17 కోర్సులకు మంగళం పాడుతున్నట్టు ఆంధ్ర విశ్వకళా పరిషత్ ఇటీవలనే ప్రకటించింది. ప్రముఖ వార్తా పత్రికలన్నీ దీనిని ప్రచురించాయి. పెద్దలు చెప్పిన కారణం` ఆర్ధిక పరిస్థితి. మంగళం పాడుతున్నామని చెప్పిన వాటిలో చరిత్ర-పురావస్తు శాస్త్రం, సంస్కృతం, వృక్ష శాస్త్రం, భూగర్భశాస్త్రం, ఉమెన్ స్టడీస్, హ్యూమన్ రైట్స్ వంటివి ఉన్నాయి. వీటిలో చాలావరకు ఆంధ్ర విశ్వకళాపరిషత్‌కు అజరామరమైన కీర్తిని తెచ్చాయి. దేశానికి ఉపయోగపడే మేధావులను అందించాయి. ఖాళీ అయ్యే ఉద్యోగాలను భర్తీ చేయడం దగ్గర ప్రదర్శించిన అసాధారణమైన జాప్యం, నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందన్న అభిప్రాయం ఉంది.
విశ్వవిద్యాలయానికి మంజూరైన మొత్తం పోస్టులు 953. ప్రస్తుతం ఉన్న ఆచార్యులు 234. ఖాళీలు 719. ఎంత విచిత్రం?
విద్య వ్యాపారం కాదు, అన్నింటికీ మూల్యం కట్టలేం. తల్లి ప్రేమ, గురువు ఇచ్చే విజ్ఞానం` వీటికి మూల్యం చెల్లించలేం. జగద్గురువు శంకరాచార్యులకు ఏ మూల్యం చెల్లించగలం? రామాయణం రాసిన వాల్మీకి మహర్షికి, మహా భారత కర్త వ్యాసభగవాను డికి ఏ మూల్యం చెల్లించగలం? వీరందరూ ఎవరో ఒక గురువు దగ్గర శిష్యులే. ఈ గురువులు ఏదో ఒక సంస్థలో శిక్షణ తీసుకొన్నవారే. భారత్‌లో నలందా, తక్షశిల, విక్రమశిల, అమరావతి, నాగార్జునకొండ ఇవన్నీ విద్యాకేంద్రాలే. కాలగర్భంలో కలిసిపోయాయి. లేదా కలిపారని కూడా అనుకోవచ్చు. అది చరిత్ర, అది తెలియాలంటే దానికో విభాగం విశ్వవిద్యాలయాల్లో ఉండాలి.
ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో సుబ్బరాయన్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న కాలంలో తెలుగు ప్రజలకు చదువు ఖర్చుతో కూడుకొని ఉండేది. ఉన్నత విద్య కోసం మద్రాసు వెళ్లవలసి వచ్చేది. అందుకే ఆంధ్రులకు ఒక ప్రత్యేకమైన విశ్వవిద్యాలయం కావాలని నాడు తీర్మానం చేశారు. కానీ 1914లో మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఆగిపోయాయి. మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడు వెంకటపతిరాజు ఫిబ్రవరి, 1917లో తెలుగు భాషకు ఒక ప్రత్యేక విశ్వ విద్యాలయం కావాలనే వాదనను బలపరిచారు. జస్టిస్ పార్టీ మంత్రివర్గంలో విశాఖపట్నానికి చెందిన ఎం. సూర్యనారాయణ తెలుగు వారికి ప్రత్యేక యూనివర్సిటీ అవసరం గురించి మాట్లాడుతూ తీర్మానాన్ని ప్రతిపాదించారు. కానీ సి. నటేశ్ మొదలియార్ దానిని వ్యతిరేకించారు.
ప్రతి భాషకూ ఓ యూనివర్సిటీ కావాలంటే తమిళ భాషకు మరో యూనివర్సిటీ ఏర్పాటు చేయాల్సివుంటుందని వాదించారు. చివరకు ఉమ్మడి మద్రాసు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పాత్రో సెప్టెంబర్ 2, 1921న తన అంగీకారాన్ని తెలియ జేస్తూ తీర్మానాన్ని ప్రతిపాదించారు. అది ఆగస్టు 20, 1925న సెలెక్ట్ కమిటీకి వెళ్లింది. ఆ సంస్థకు ఆంధ్ర విశ్వ కళాపరిషత్ అనే పేరు పెడదామని ప్రతిపా దించారు. చివరకు ఏప్రిల్ 26, 1926 న విజయ వాడలో కట్టమంచి రామలింగారెడ్డి వైస్ ఛాన్సలర్‌గా ఆంధ్ర విశ్వకళాపరిషత్ పురుడు పోసుకొంది. డిసెంబర్ 1928 నుండి విశాఖ పట్నంలో తరగతుల నిర్వహణ, పరిపాలనా విభాగాలను ఏర్పాటు చేయటానికి నిర్ణయమైంది.
భారత రాష్ట్రపతిగా పని చేసిన డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ 1931లో ఆంధ్ర విశ్వకళాపరిషత్ వైస్ చాన్సలర్‌గా నియమితులైనారు. జులై 1,1931న ఆర్ట్స్ కళాశాలను ప్రారంభించి దానిలో తెలుగు భాషా విభాగం, ‘‘చరిత్ర – ఆర్ధిక శాస్త్రము రాజనీతి శాస్త్రము’’ అనే రెండు విభాగాలను ఆయనే ప్రారంభించారు. ఆ మరుసటి సంవత్సరం కాలేజ్ అఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీని ప్రారంభించారు. ఈ విధంగా 9 దశాబ్దాలు నిరాటం కంగా విశ్వవిద్యాలయం కొనసాగింది. డా.రాధా కృష్ణన్ ఆహ్వానం మేరకు ప్రఖ్యాత చరిత్రకారుడు ఆచార్య హీరేన్ ముఖర్జీ చరిత్ర శాఖాధిపతిగా కలకత్తా నుండి వచ్చారు.
తరువాత ఎందరో చరిత్రకారులు తమ జీవితాలను ఫణంగా పెట్టి చరిత్ర విభాగాన్ని అభివృద్ధి చేశారు. వారిలో మల్లంపల్లి సోమశేఖరశర్మ, మామిడిపూడి వెంకట రంగయ్య, ఓరుగంటి రామ చంద్రయ్య తదితరులు ఉన్నారు. ‘చరిత్ర అంటే మనుష్యుడు చేసిన కృషి-అనుభవ జ్ఞానం’ అన్న మల్లంపల్లి వారు చూపిన త్రోవ ఎందరో నవ చరిత్రకారులు అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ మార్గదర్శకంగా ఉంది. ‘పూను స్పర్థను విద్యలందే – వైరము వాణిజ్యమందే’ అన్న గురజాడ మాటలు విద్యలోనే పోటీ తద్వారా విద్వత్తు బయటకు వస్తుంది. అదే దేశానికి శ్రీ రామరక్ష.
ఆంధ్ర విశ్వకళాపరిషత్ తొమ్మిది దశాబ్దాల కాలంలో ఎందరో విద్యావంతులను తయారుచేసింది. లోక్‌సభ స్పీకర్‌గా పని చేసిన జీఎంసీ బాలయోగి, ప్రముఖ పార్లమెంటేరియన్ యర్రంనాయుడు, నేటి ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, ప్రస్తుత మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు మరెందరో రాజకీయ ప్రముఖులు ఇక్కడ నుంచే వెళ్లారు. విద్యా, వైద్యరంగాలు, పరిశోధన, ప్రచురణ లలో ఈ విశ్వవిద్యాలయానికి చరిత్రలో చెరగని ముద్ర. డా. సర్వేపల్లి ఆరంభించిన ఫిలాసఫీ విభాగా నికి ఎంతో చరిత్ర ఉంది. డాక్టర్ కొత్త సచ్చిదానంద మూర్తి వంటివారు ఇక్కడ పనిచేశారు.
అంతటి మహోన్నతమైన కోర్సులను తొలగించటం చాలా దురదృష్టకరం. విశ్వవిద్యాలయం పెద్ద నిర్ణయం భవిష్యత్తు తరాలకు చేటు చేస్తుంది. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇలాంటి దుస్థితి నుంచి విశ్వవిద్యాలయాన్ని కాపాడడంలో తమ వంతు పాత్ర నిర్వహించాలి. పెద్ద మనసుతో రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకుని ఆంధ్ర విశ్వకళాపరిషత్ ద్వారా భవిష్యత్ తరాలను కూడా ‘తేజోవంతులుగా చేయమని’ సవినయంగా అందరినీ కోరుతున్నాం.