Devotional

ఇరుముడి లేకుండా అయ్యప్ప 18 మెట్లు ఎక్కవచ్చా?

ఇరుముడి లేకుండా అయ్యప్ప 18 మెట్లు ఎక్కవచ్చా?

మండల దీక్ష పూర్తయిన తర్వాత శబరిమలలో కొలువైన అయ్యప్ప దర్శనానికి ఇరుముడి కట్టుకొని బయల్దేరుతారు స్వాములు. ఇరుముడి అంటే రెండు ముడులు కలది. ఆ రెండూ భక్తి, శ్రద్ధ. ఇరుముడికి కట్టే తాడు ప్రణవం. భక్తి, శ్రద్ధలను సాధనతో పొందగలిగితే.. స్వామి అనుగ్రహం లభిస్తుంది. ఇరుముడి ఒక భాగంలో గురుస్వామి దేవుడికి సంబంధించిన సామగ్రి ఉంచుతారు. రెండో భాగంలో నీళ్లు తొలగించిన కొబ్బరికాయలో ఆవునెయ్యిని నింపి ఉంచుతారు. జీవాత్మ, పరమాత్మలను అనుసంధానం చేయడం ఇందులోని ఆంతర్యం. ఈ నేతితో స్వామివారికి అభిషేకం చేస్తారు. ఇరుముడితో శబరిమల ఆలయంలోని పద్దెనిమిది మెట్లు ఎక్కి అయ్యప్పస్వామిని దర్శించుకుంటారు. ఇరుముడి లేకుండా మెట్లు ఎక్కడానికి అర్హత ఉండదు. అయ్యప్పను దర్శించుకొని అలౌకికమైన ఆనందాన్ని పొందుతారు భక్తులు. తర్వాత దీక్షాపరులు పుణ్యక్షేత్రాల మీదుగా ఇంటికి చేరుకుంటారు. ఇంటికి వచ్చిన తర్వాత తల్లితో అయ్యప్ప మాల తీయించుకుంటారు. ఏదైనా ఆలయంలో పూజారి చేతుల మీదుగా కూడా దీక్ష విరమణ చేస్తారు. దీక్షనిచ్చిన గురుస్వామితో దీక్ష విరమణ చేయించవచ్చు. దీక్ష విరమణతో మళ్లీ పాత అలవాట్లకు లోబడితే అయ్యప్ప దీక్ష ధారణ సార్థకం కాదు. మాల విరమించినా.. నియమాలు లేకున్నా.. వ్యక్తిత్వంలో వచ్చిన మార్పును కొనసాగించాలి. జీవితాన్ని మహోన్నతంగా తీర్చిదిద్దుకోవాలి. శబరిమలలో స్వామి దర్శనానికి ముందు 18 మెట్లు ఎక్కాలి. దీన్నే పదునెట్టాంబడి అంటారు. అఖండ సాలగ్రామ శిలతో వీటిని పరశురాముడు నిర్మించాడని పురాణ కథనం. అందుకే ఈ క్షేతాన్ని పరశురామ క్షేత్రం అంటారు. ఈ మెట్లను మానవుని స్థూల, సూక్ష్మ శరీరాలకు ప్రతీకగాచెబుతారు. అయ్యప్పస్వామి మణికంఠునిగా 12 ఏండ్లు పందలం రాజు దగ్గర పెరిగాడు. మహిషిని వధించిన తర్వాత అవతార పరిసమాప్తి చేశాడు. ఆయన శబరిగిరిలో చాలా ఉన్నతమైన స్థానంలో కొలువుదీరడానికి వీలుగా నాలుగు వేదాలు, రెండు శాస్ర్తాలు, అష్టదిక్పాలకులు, విద్య, అవిద్య, జ్ఞానం, అజ్ఞానం దేవతా రూపాలు దాల్చి పద్దెనిమిది మెట్లు కాగా అయ్యప్ప వాటిమీద పాదాలు మోపుతూ ఉన్నత స్థానాన్ని చేరుకున్నాడని పురాణ కథనం.