ఫొటోషూట్స్ సందర్భంగా వస్త్రధారణ విషయంలో జరిగే అనుకోని పొరపాట్లను భూతద్దంలో పెట్టి చూడొద్దని.. విలువలు మరచి ట్రోల్ చేయడం ఏమాత్రం క్షమార్హం కాదని ఆగ్రహం వ్యక్తం చేసింది కథానాయిక పాయల్‌రాజ్‌పుత్. ఇటీవలే ఆమె ఫోటోషూట్ తాలూకు వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్ అయింది. శృతిమించిన అందాల ప్రదర్శన అంటూ సోషల్‌మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. ఈ సంఘటన తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను తెరవడానికి కూడా భయపడ్డానని పాయల్‌రాజ్‌పుత్ చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ ‘ఆ వీడియోపై సంస్కారం మరచి చాలా జుగుప్సాకరంగా కామెంట్స్ చేశారు. నాది సున్నిత మనస్తత్వం. ఇలాంటి వ్యతిరేక ప్రచారం నా కుటుంబంపై ప్రభావం చూపిస్తుంది. సోషల్‌మీడియాలో ట్రోల్స్ చూసిన నా పేరెంట్స్ అన్నీ వదిలేసి ఇంటికి తిరిగొచ్చేయ్ అని చెప్పారు. ఈ దుష్ప్రచారం నా కెరీర్‌ను ఏమీ చేయలేదని వాళ్లకు భరోసా కల్పించా’ అని పాయల్‌రాజ్‌ఫుత్ చెప్పింది. వినోదరంగంలో ఫొటోషూట్స్ సందర్భంగా వస్త్రధారణ పరమైన పొరపాట్లు సహజమని..వాటి గురించి అసహ్యంగా ప్రచారం చేయవొద్దని హితవు పలికింది. ‘నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఒరిజినల్ వీడియోలో ఎలాంటి అసభ్యత కనిపించలేదు. ఎవరో ఎడిట్ చేయని వీడియోను సోషల్‌మీడియాలో వైరల్ చేశాడు. దీని ఆధారంగా చాలా మంది మార్ఫింగ్ వీడియోల్ని షేర్ చేశారు. వ్యక్తులు ఇంతలా దిగజారి పోతారని ఊహించలేదు’ అని పాయల్‌రాజ్‌పుత్ ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఇలాంటి చౌకబారు పనులు తన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేవని, ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా కెరీర్‌లో రాణించడంపైనే దృష్టిపెడుతున్నానని ఆమె పేర్కొంది.
ఇన్‌స్టాగ్రామ్‌ను చూసి వణుకుతున్న పాయల్
Related tags :