పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా రికార్డు పేలవంగా ఏమీ లేకపోయినా ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా అందించకపోవడంతో తన సారథ్య సమర్థతపై ఎదురవుతున్న ప్రశ్నలు.. అదే సమయంలో రోహిత్ నాయకత్వ పటిమపై కురుస్తున్న ప్రశంసల జల్లు..! ముప్పును ముందే గ్రహించాడేమో.. రోహిత్‌కు మార్గం సుగమం చేస్తూ కోహ్లి కొన్ని రోజుల కింద తనంతట తానే టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. తద్వారా వన్డే కెప్టెన్సీనైనా కాపాడుకుందామని భావించి ఉంటాడు. కానీ అతడి ప్రయత్నం ఫలించలేదు. సెలక్షన్ కమిటీ కోహ్లీకి షాకిచ్చింది. వన్డే జట్టు నాయకుడిగా అతణ్ని తప్పించి.. ఆ బాధ్యతలనూ రోహిత్‌కే అప్పగించింది. 2023 వన్డే ప్రపంచకప్ వరకు అతణ్ని కెప్టెన్‌గా నియమించింది. విరాట్ ఇక టెస్టు కెప్టెన్ మాత్రమే.