పిన్నీసు కథ ???…
ప్రతిభ కనపర్చిన ఆటగాడి మెడలో వేలాడే మెడల్స్ ఎంత పవర్ ఫుల్లో…
*ముప్పైఏళ్ళ క్రితం
మొలతాడుకూ,
స్త్రీల పసుపుతాడుకూ
వేలాడే సూదిపిన్నీసులు* అంతే!!!
ఆ రోజుల్లో హవాయి చెప్పు తెగిపోతే కాపాడేది పిన్నీసే
మూడు నాలుగు సంవత్సరాలకోసారి కుట్టించే నిక్కరు ఎనకాల కుట్లూడిపోతే కాపాడింది ఆ పిన్నీసే.
ఆ రోజుల్లో ఎప్పుడుపడితే అప్పుడు బట్టలు కొనేవారు కాదు… సంవత్సరానికోసారి, అదైనా పండక్కే.
కాల్లో ముల్లుగుచ్చుకుంటే పిన్నీసుతోనే ఆపరేషన్.
చెవిలో గులిమి (గుబిలి) తీసుకోవాలంటే పిన్నీసే…
ఏదైనా పీచున్న కూర తిన్నరోజున, ఇంకేదైనా నారవంటిది పంట్లో ఇరుక్కున్నా పిన్నీసే దిక్కూ…
చిన్నప్పుడు పెన్ను పత్తి సరిగ్గా రాయకపోతే పాళీని తీసేసి, దానికున్న గాడిలోంచి గడ్డకట్టిన ఇంకును పిన్నీసుతోటే శుభ్రం చేసేవాళ్ళం .
బాల్ పెన్నులో వుండే బాల్ సరిగ్గా తిరగకపోయినా ఆ పిన్నీసుతోటే రిపేరు .
జెండా వందనం రోజున పిల్లలజేబులకి జెండా బొమ్మని పిన్నీసుతోనే పెట్టుకున్న గుర్తు.
అటువంటి పిన్నీసుకు కాలం చెల్లింది అనుకునే టైంలో….
ఇవాళ ఒకబ్బాయి
“అంకుల్,
పిన్నీసుంటే ఓసారివ్వరా?
సెల్లో సిమ్ము తీసుకోవాలి” అన్నప్పుడు నాకు చాలా గర్వంగా అనిపించింది.
మన చిన్నప్పటి పిన్నీసుకు
మళ్ళీ మంచిరోజులు
వచ్చాయా అని?
తప్పకుండా వచ్చినయ్!
*పిన్నీసమ్మ తల్లీ నీక్కూడా ఓరోజుందని తెలిసింది.