తెలుగువాడు గొప్పపని చేసినా, ఏదైనా ఘనత సాధించినా దానిని ప్రశంసించడానికి, గుర్తించడానికి వెనుకాడే బానిసత్వ ఆలోచన నుండి బయటకి రావాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ కోరారు. 2021 రామినేని ఫౌండేషన్ పురస్కారాలను గురువారం నాడు హైదరాబాద్‌లోని అన్వయ కన్వెన్షన్ సెంటరులో అందజేసిన అనంతరం ఆయన ప్రసంగించారు. తెలుగువారిని, వారి సేవలను గత 22ఏళ్లుగా గుర్తిస్తూ తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్తున్న రామినేని ఫౌండేషన్ నిర్వాహకులను ఆయన అభినందించారు. పురస్కారల గ్రహీతలలో మెజార్టీ వారితో తనకు 20ఏళ్లకు పైగా అనుబంధం ఉందని ఆయన గుర్తు చేసుకున్నారు. వారు జీవితంలో పడిన కష్టాలు, ఎదుర్కొన్న సవాళ్లు, సమస్యలను గుర్తిస్తూ వారి ప్రస్తుత స్థితిని గౌరవించడం ముదావహం అని CJI అన్నారు. సుమ మళయాళీ కాదని, డా.ఎల్ల కృష్ణా తమిళవాడు కాదని ఆయన అన్నారు. తెలుగువారికి, తెలుగు భాషకు సేవ చేసే వారందరూ తెలుగువారేనని జస్టిస్ రమణ వ్యాఖ్యానించారు. హాస్యనటులు బ్రహ్మానందం సరదాగా నవ్విస్తారని అందరికీ తెలిసిందేనని, ఆయనలోని మరో ప్రతిభా కోణం తనకు బాగా తెలుసని CJI అన్నారు. నాబర్డు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధికి, గ్రామీణ మహిళల సాధికారతకు కృషి చేస్తున్న చింతల గోవిందరాజును ఆయన అభినందించారు. తెలుగువారు రూపొందించిన కోవాగ్జిన్‌ను అందరం అభినందించాలని, దాని సామర్థ్యం, నాణ్యతలపై తనకు పూర్తి నమ్మకం ఉందని అన్నారు. డా.అయ్యన్నచౌదరి 1950ల్లో అమెరికాకు వెళ్లినప్పటికీ తన మూలాలను మరిచిపోకుండా పిల్లలను పెంచిన రీతి అందరికీ అనుసరణీయమన్న్నారు. మహావృక్షాలుగా ఎదిగిన రామినేని సోదరులను ఆయన కొనియాడారు. మాతృభాష, మాతృదేశం, మాతృమూర్తిని మరిచిపోకుండా, భాషా-సంస్కృతులకు పట్టం కట్టాలని జస్టిస్ ఎన్.వి.రమణ సందేశం ఇచ్చారు. కార్యక్రమంలో రామినేని ఫౌండేషన్ నిర్వాహకులు, ధర్మప్రచార, వేదాచార్య, సత్యవాది, కన్వీనర్ పాతూరి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.
* మా సంస్థ ఉద్యోగులకు ఈ పురస్కారం అంకితం-ఎల్లా దంపతులు
రామినేని ఫౌండేషన్ 2021 విశిష్ట పురస్కారాన్ని అందుకున్న డా.కృష్ణా ఎల్లా-సుచిత్ర ఎల్లా దంపతులు రామినేని ఫౌండేషన్‌కు ధన్యవాదాలు తెలిపారు. సుచిత్ర మాట్లాడుతూ కరోనా సమయంలో దేశీయ టీకా తయారీ కోసం ప్రాణాలు సైతం పణంగా పెట్టి పనిచేసిన తమ సంస్థ ఉద్యోగులకు ఈ పురస్కారాన్ని అంకితం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. డా.కృష్ణ మాట్లాడుతూ తానా సభల్లో రామినేని సోదరులను కలిశానని, వారి పేర్లు విని తనకు అసూయ కలిగిందన్న్నారు. 10శాతం మంది తల్లిదండ్రులు అయ్యన్నచౌదరి-సుగుణమ్మ దంపతుల మాదిరి ఆలోచిస్తే సమాజం మరింత బాగుపడుతుందన్నారు. భారతదేశ టీకా తయారీ సంస్థలను ఆయన అభినందించారు.
* అదృష్టంగా భావిస్తున్నాను – సుమ
విశేష పురస్కారం అందుకున్న ప్రముఖ యాంకర్ సుమ మాట్లాడుతూ జస్టిస్ ఎన్.వి.రమణ చేతుల మీదుగా రామినేని ఫౌండేషన్ పురస్కారం అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. మహిళా సాధికారత కోసం న్యాయవ్యవస్థలో మహిళలకు 50శాతం రిజర్వేషన్ ఉండాలన్న ఆయన స్ఫూర్తికి ధన్యవాదాలు తెలిపారు. తన నాల్గవ తరగతి నుండి తెలుగు నేర్చుకోమని ప్రోత్సహించిన తల్లిదండ్రులకు, జస్టిస్ ఎన్.వి.రమణ లాంటి స్త్రీ పక్షపాత పిల్లలను దేశానికి అందిస్తున్న మాతృమూర్తులకు తన పురస్కారాన్ని అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు.
* సభ చాలా ఆనందంగా ఉంది-బ్రహ్మానందం
విశేష పురస్కారం అందుకున్న మరో ప్రముఖ నటుడు బ్రహ్మానందం తనదైన శైలిలో ప్రసంగిస్తూ ఉపన్యాసకుల హుందాతనం కారణంగా సభ చాలా సజావుగా సాగడం ఆనందంగా ఉందన్నారు. ఓ సామాన్య ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించిన డా.రామినేని అయ్యన్నచౌదరి హిందూ సాంప్రదాయం పట్ల మమకారంతో తన పిల్లలకు అద్భుతమైన పేర్లు పెట్టడం మన సాంప్రదాయాన్ని ఆచరించి చూపడమేనన్నారు. తల్లిదండ్రుల పట్ల ప్రేమను దాచుకోకుండా సేవా కార్యక్రమాల ద్వారా తండ్రి పట్ల భక్తితత్పరతను గత 22ఏళ్లుగా చాటుకుంటున్న రామినేని సోదరులను ఆయన కొనియాడారు. తల్లిదండ్రులకు సేవ చేయడం ఒక రకమైన భక్తి అయితే, సమాజానికి వారి పేరున సేవ చేయడం భక్తిలో పతాకస్థాయిగా ఆయన అభివర్ణించారు. రామినేని ఫౌండేషన్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. బ్రహ్మానందం ప్రత్యేకంగా స్వహస్తాలతో చిత్రించిన ఆంజనేయుని హత్తుకున్న శ్రీరాముడి చిత్రపటాన్ని జస్టిస్ ఎన్.వి.రమణకు బహుకరించారు.
పురస్కారాలు అందుకున్న వారిలో నాబార్డు చైర్మన్ చింతల గోవిందరాజు, నిమ్స్ వైద్యురాలు దుర్గా పద్మజ, సినీ జర్నలిస్టు ఎస్.వి.రామారావు, డా.బీ.మస్తాన్‌యాదవ్, బండ్లమూడి శ్రీనివాస్‌లు ఉన్నారు. అరుణ సాయిరాం సంగీత కచేరీ అలరించింది.
తెలుగువారిని గౌరవిస్తున్న రామినేని ఫౌండేషన్ సేవలు అభినందనీయం
