ఒమిక్రాన్ వేరియంట్‌తో కరోనా మహమ్మారి ఉద్ధృతి మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో వీసాల జారీపై అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. 2022 సంవత్సరానికి గానూ.. హెచ్-1బీ సహా పలు రకాల వీసాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు తాత్కాలికంగా వ్యక్తిగత ఇంటర్వ్యూలను రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది.
నాన్ ఇమ్మిగ్రేంట్ వర్క్ వీసా హెచ్-1బీతో పాటు, హెచ్-3, హెచ్-4, ఎల్, ఓ, పీ, క్యూ వీసాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఈ అవకాశం ఇస్తున్నట్లు తెలిపింది. 2022, డిసెంబరు 31 వరకు తాత్కాలికంగా వ్యక్తిగత ఇంటర్వ్యూలను రద్దు చేస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే దీనిపై తుది నిర్ణయం కాన్సులర్ అధికారులదే అని వెల్లడించింది. స్థానిక పరిస్థితులను బట్టి ఎంబసీ, కాన్సులేట్లకు అవసరమైతే వ్యక్తిగత ఇంటర్వ్యూలు పెట్టే అధికారాలు కల్పిస్తున్నట్లు తెలిపింది. అందువల్ల, దరఖాస్తుదారులు ఎప్పటికప్పుడు తమ సంబంధిత ఎంబసీ, కాన్సులేట్ వెబ్‌సైట్లను పరిశీలిస్తుండాలని సూచించింది.
సాధారణంగా అమెరికాలో ఏ వీసాల జారీకైనా ఇదే తుది ప్రక్రియ. అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించిన అనంతరం అమెరికా కాన్సులేట్ సిబ్బంది దరఖాస్తుదారులను వ్యక్తిగతంగా ఇంటర్వ్యూ చేస్తారు. అందులో ఎంపికైతేనే వీసాలు జారీ అవుతాయి. అయితే ప్రస్తుతం కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో 2022లో ఈ ఇంటర్వ్యూ విధానాన్ని తాత్కాలికంగా పక్కనబెట్టి, వీసాల జారీని మరింత సులభతరం చేయాలని అమెరికా సర్కారు భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే హెచ్-1బీ వీసా సహా పలు రకాల వీసాల జారీలో వ్యక్తిగత ఇంటర్వ్యూలను రద్దు చేసే అవకాశాన్ని కాన్సులర్ అధికారులకు కల్పించినట్లు తెలిపింది.
ఇప్పటివరకు ఏదైనా వీసా పొందిన వారు, వీసా మినహాయింపు ప్రోగ్రామ్‌లోని సభ్య దేశాల పౌరులు, ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఫర్ ట్రావెల్ ఆథరైజేషన్ కింద గతంలో అమెరికా వెళ్లి వచ్చిన వారు.. ఇప్పుడు వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటే వారికి వ్యక్తిగత ఇంటర్వ్యూలు రద్దు చేసే విచక్షణాధికారం కాన్సులేట్ అధికారులకు ఉంటుంది.