ఆ ఆలయంలో యాచకులకు ఆహారం దానం చేయడం ఆనవాయితీ. అయితే, అక్కడ జరుగుతున్న దానంలో చాలా వరకు పాడైపోయిన ఆహారమే ఉంటోంది. ఒకసారి విక్రయించిన ఆహార పొట్లాలను మళ్లీమళ్లీ విక్రయించడమే ఇందుకు కారణం. పుదుచ్చేరిలోని ప్రఖ్యాత తిరునల్లార్ శనీశ్వరన్ మందిరంలో ఈ తతంగం జరుగుతోంది. ఇక్కడి నలన్ నీటి కొలనులో స్నానమాచరించిన తర్వాత భక్తులు ఆహారాన్ని దానం చేస్తారు. అందువల్ల అక్కడి వ్యాపారులు కొలను వద్దే ఆహార పొట్లాలను విక్రయిస్తుంటారు. అయితే, వీరు అమ్మే ఆహారం చాలా వరకు కలుషితమైనదే ఉంటోందని భక్తుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో తనిఖీలు చేపట్టిన అధికారులు.. అక్కడ జరుగుతున్న తతంగాన్ని చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. ముందుగా కొలను వద్ద భక్తులకు వ్యాపారులు తమ వద్ద ఉన్న ఆహార పొట్లాలను విక్రయిస్తున్నారని, వాటిని భక్తులు యాచకులకు దానం చేస్తున్నారని తెలిపారు. యాచకులు వాటిని తీసుకొచ్చి వ్యాపారులకు తిరిగి విక్రయిస్తున్నారని చెప్పారు. ఇలా యాచకుల నుంచి తీసుకున్న ఆహార పొట్లాలను వ్యాపారులు మళ్లీ భక్తులకు అమ్మేస్తున్నారని తెలిపారు. ఇందులో కలుషిత ఆహారమే అధికంగా ఉంటోందని వెల్లడించారు. ఈ మేరకు యాచకులు, వ్యాపారుల నుంచి పాడైపోయిన ఆహార పొట్లాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.