Sports

17ఏళ్ల చదరంగ సంచలనం

Nodirbek Abdusattorov - New 17 Year Old Rapid Chess Champ

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌కు షాక్‌.. ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో మరోసారి ఫేవరేట్‌గా బరిలో దిగిన అతనికి 17 ఏళ్ల నోడిర్బెక్‌ అబ్దుసటోరోవ్‌ షాకిచ్చాడు. కార్ల్‌సన్‌పై నెగ్గడమే కాకుండా.. చివరి వరకూ దూకుడు కొనసాగించిన ఆ టీనేజర్‌ ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించాడు. ఉజ్బెకిస్థాన్‌కు చెందిన అతను.. ఈ టైటిల్‌ గెలిచిన అతి పిన్న వయస్సు ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

ఈ ఏడాది రికార్డు స్థాయిలో అయిదోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన కార్ల్‌సన్‌ (నార్వే)కు ప్రపంచ ర్యాపిడ్‌ ఛాంపియన్‌షిప్‌లో తిరుగుండదనే అంతా అనుకున్నారు. 10వ రౌండ్‌ ముందు వరకూ అతనే ఆధిక్యంలో ఉండడంతో ఈ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ కచ్చితంగా టైటిల్‌ గెలుస్తాడనే ఊహించారు. కానీ అంచనాలను తలకిందులు చేస్తూ.. అద్భుత ప్రదర్శనతో నోడిర్బెక్‌ ఛాంపియన్‌గా నిలిచాడు. పదో రౌండ్లో కార్ల్‌సన్‌కు షాకిచ్చిన అతను.. అదే జోరు కొనసాగిస్తూ 13వ రౌండ్‌ ముగిసే సరికి 9.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. పోటీల్లో ఏడు విజయాలు సాధించిన అతను.. అయిదు గేమ్‌లు డ్రాగా ముగించాడు. ఒక దాంట్లో ఓటమి పాలయ్యాడు. అతనితో పాటు నెపోమియాచి (రష్యా), కార్ల్‌సన్‌, కరువానా (యుఎస్‌) కూడా 9.5 పాయింట్లే సాధించారు. కానీ టైబ్రేకర్‌లో నెపోమియాచిపై గెలిచిన నోడిర్బెక్‌ సరికొత్త ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించాడు. ఈ టోర్నీలో భారత ఆటగాళ్లలో గుకేశ్‌ 9వ (9 పాయింట్లు), మిత్రభ గుహ 15వ (8.5), విదిత్‌ 45వ (7.5) స్థానాల్లో నిలిచారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన గ్రాండ్‌మాస్టర్లు హర్ష (7), హరికృష్ణ (6.5), అర్జున్‌ (6) వరుసగా 60, 99, 110వ ర్యాంకులతో ముగించారు.

బాల్యం నుంచే..: ఉజ్బెకిస్థాన్‌కు చెందిన టీనేజీ సంచలనం నోడిర్బెక్‌ చిన్నతనంలోనే 64 గళ్లపై మనసు పారేసుకున్నాడు. తొమ్మిదేళ్ల వయసులోనే ఓ టోర్నీలో ఇద్దరు గ్రాండ్‌మాస్టర్లను ఓడించి వెలుగులోకి వచ్చాడు. అక్కడి నుంచి తనకంటే ఎంతో మెరుగైన ఆటగాళ్లను ఓడించడం అలవాటుగా మార్చుకున్నాడు. 11 ఏళ్ల వయసులోనే జూనియర్‌ ర్యాంకింగ్స్‌లో 100లోపు స్థానాల్లో చోటు దక్కించుకున్న తక్కువ వయస్సు ఆటగాడిగా నిలిచాడు. 13 ఏళ్లకే గ్రాండ్‌మాస్టర్‌ హోదా సాధించాడు. అంతర్జాతీయ వేదికలపై విజయాలు అందుకున్నాడు. ఇప్పుడు ఏకంగా కార్ల్‌సన్‌నే ఓడించడంతో పాటు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు.

కార్ల్‌సన్‌ అసంతృప్తి..: ఈ ఛాంపియన్‌షిప్‌లో టైబ్రేకర్‌ నిర్వహించిన విధానంపై కార్ల్‌సన్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. టోర్నీలో 13 రౌండ్లు ముగిసే సరికి నోడిర్బెక్‌తో పాటు నెపోమియాచి, కార్ల్‌సన్‌, కరువానా కూడా 9.5 పాయింట్లతో సమంగా ఉన్నారు. కానీ విజేతను తేల్చేందుకు టైబ్రేకర్‌ మాత్రం నోడిర్బెక్‌, నెపోమియాచి మధ్య మాత్రమే నిర్వహించారు. అలా ఎందుకు అంటే.. నిబంధనల ప్రకారం టోర్నీలో అత్యుత్తమ ర్యాంకింగ్‌తో ఉన్న ప్రత్యర్థులతో తలపడ్డ ఇద్దరు క్రీడాకారుల మధ్యలో టైబ్రేకర్‌ నిర్వహించామని నిర్వాహకులు అంటున్నారు. ఓవరాల్‌ గణాంకాలను పరిగణలోకి తీసుకున్నామని తెలిపారు. అయితే ఈ నిబంధన కార్ల్‌సన్‌కు ఆగ్రహం తెప్పించింది. ఇది పూర్తిగా తెలివి తక్కువ నిబంధన అని అతను అసంతృప్తి వెళ్లగక్కాడు. నిబంధనల గురించి గొడవలు పక్కనపెడితే నోడిర్బెక్‌ అద్భుత విజయం సాధించాడంటూ కార్ల్‌సన్‌ ట్వీట్‌ చేశాడు.