యావత్ ప్రపంచం కొత్త ఏడాదిలోకి అడుగు పెడుతున్న వేళ అమెరికా సెన్సస్ బ్యూరో జనాభాకు సంబంధించిన ఆసక్తికర గణాంకాలను విడుదల చేసింది. 2021లో ప్రపంచ జనాభా భారీగా పెరిగిందని, 2022 జనవరి 1 నాటికి ప్రపంచ జనాభా 786 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేసింది. 2022 జనవరి 1 నాటికి అమెరికా జనాభా 33,24,03,650గా ఉంటుందని పేర్కొంది. అలాగే, 2021 ప్రారంభం నుంచి అమెరికా జనాభాలో 7,06,899 (0.21%) పెరుగుదల నమోదైనట్టు వెల్లడించింది. అమెరికా నేషనల్ సెన్సస్ డే (ఏప్రిల్ 1, 2020) నుంచి చూస్తే ఆ దేశ జనాభా 9,54,369 (0.29%) పెరిగినట్టు అధ్యయనంలో పేర్కొంది. అలాగే, 2022 జనవరిలో ప్రతి 9 సెకెన్లకు ఒకరు చొప్పున పుట్టనుండగా.. ప్రతి 11 సెకెన్లకు ఒకరు మరణిస్తారని అంచనా వేసింది. దీంతో పాటు ప్రపంచ దేశాల నుంచి వలస రావడం ద్వారా ప్రతి 130 సెకెన్లకు ఒకరు అమెరికా జనాభాకు తోడవుతారని అంచనా వేసింది. అయితే, ప్రపంచ వ్యాప్తంగా సంభవించి జననాలు, మరణాలు, వలసల వల్ల అమెరికా జనాభాలో ప్రతి 40 సెకన్లకు ఒకరు చేరుతున్నట్టుగా విశ్లేషించింది. 2021లో ప్రపంచ జనాభా భారీగా పెరిగిందని అమెరికా సెన్సస్ బ్యూరో అధ్యనంలో వెల్లడైంది. 2022 జనవరి 1 నాటికి ప్రపంచ జనాభా 786,88,72,451గా ఉంటుందని అంచనా వేసింది. 2021 జనవరి 1 నుంచి 7,42,35,487 (0.95్%) జనాభా పెరిగినట్టు తెలిపింది. 2022 జనవరిలో ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సెకెనకు 4.3 జననాలు, 2 మరణాలు నమోదవుతాయని ఆ సంస్థ అంచనా వేసింది.