కరోనా మహమ్మారి దేశాన్ని చుట్టిముట్టిన తొలి ఏడాది దేశవ్యాప్తంగా రైల్వే సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. కొన్ని నెలల తర్వాతే తిరిగి ప్రారంభమయ్యాయి. అవి కూడా క్రమ క్రమంగానే అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడిప్పుడే పూర్తి స్థాయిలో నడుస్తున్నాయి. అయితే, కొవిడ్ దేశంలోకి అడుగుపెట్టిన 2020-21 ఆర్థిక సంవత్సరంలో రైళ్లు అడపాదడపా అందుబాటులో ఉన్నప్పటికీ.. తత్కాల్ టికెట్ల రూపంలో మాత్రం రైల్వేకు భారీగానే ఆదాయం సమకూరడం గమనార్హం. ఆ ఏడాది తత్కాల్ టికెట్ల రూపంలో రూ.403 కోట్లు, ప్రీమియం తత్కాల్ టికెట్ల రూపంలో రూ.119 కోట్లు, డైనమిక్ ఫేర్స్ రూపంలో రూ.511 కోట్లు ఆదాయం వచ్చినట్లు రైల్వే శాఖ తెలిపింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ దాఖలు చేసిన ఆర్‌టీఐ దరఖాస్తుకు ఈ మేరకు సమాధానం ఇచ్చింది.