కుట్టిన దుస్తులు వదులుగా ఉన్నాయని ముగ్గురు కలిసి తీవ్రంగా కొట్టడంతో ఓ టైలర్ మృతి చెందిన ఘటన విశాఖలోని మధురవాడ సమీప మారికవలస రాజీవ్‌గృహకల్ప కాలనీలో గురువారం రాత్రి జరిగింది. ఒడిశాలోని గజపతి జిల్లా కాశీనగర్ తాలూకా గౌరీ గ్రామానికి చెందిన ఎల్.బుడు(60) మారికవలస రాజీవ్‌గృహకల్ప కాలనీ 104వ బ్లాక్ జీఎఫ్-1లో నివసిస్తున్నారు. టైలరింగ్ వృత్తి చేసే బుడుకు..అదే కాలనీకి చెందిన గణేష్ అనే వ్యక్తి తన బట్టలు కుట్టమని పది రోజుల క్రితం ఇచ్చాడు. కుట్టిన దుస్తులను గురువారం అతనికి అందజేయగా.. అవి బాగా వదులుగా ఉన్నాయని, మళ్లీ సరిచేసి ఇప్పుడే ఇవ్వాలని అదే రోజు రాత్రి టైలర్‌పై గణేష్ ఒత్తిడి తెచ్చాడు.
తనకు రాత్రి వేళ కంటి చూపు తక్కువని, మరుసటి రోజు సరిచేసి ఇస్తానని టైలర్ చెప్పగా.. మద్యం మత్తులో ఉన్న గణేష్ వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో గణేష్ సహా అతని కుటుంబ సభ్యులు సూర్యనారాయణ, క్లింటన్ కలిసి బుడును తీవ్రంగా గాయపర్చారు. అపస్మారక స్థితిలోకి చేరిన బుడును ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ ఎ.రవికుమార్ తెలిపారు. తన భర్తను కొట్టవద్దని ఎంత బతిమాలినా వినలేదని మృతుడి భార్య లక్ష్మి చెప్పారు.