* కడుపులో కత్తిదించి కౌగిలించుకొన్నట్టుంది రైతులపై కేసీఆర్ ప్రేమ: షర్మిల
‘కడుపులో కత్తిదించి కౌగిలించుకొన్నట్టు ఉంది రైతులపై కేసీఆర్ ప్రేమ’ అని వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. రైతు బందు మినహా మిగిలినవన్నీ బంద్ చేశారన్నారు. ‘‘కడుపులో కత్తిదించి కౌగిలించుకొన్నట్టు ఉంది రైతులపై కేసీఆర్ ప్రేమ. రుణమాఫీ బంద్. ఇన్ పుట్ సబ్సిడీ బంద్. పంట బీమా బంద్. ఉచిత ఎరువులు బంద్. సబ్సిడీ విత్తనాలు బంద్. ఇచ్చేది ఒక్కటే రైతు బందు. సర్వరోగ నివారిణి రైతు బంధు అన్నట్లు. రైతులకు సాయం చేసే మిగిలిన అన్ని పథకాలను బందు పెట్టారు. రైతులకు 25 వేలిచ్చే దగ్గర 5 వేలే ఇచ్చి నష్టం చేశారు. వరి వేస్తే ఉరేనని, రైతు బంధు పైసలు ఇచ్చేది లేదన్న దొర. వ్యతిరేకత రావడంతో ప్రతి ఒక్కరికి ఇస్తామని వారోత్సవాలు చేసుకొంటున్నారు. గప్పాలు కొట్టుడే కాని రైతును ఆదుకోవడం చేతకాని ముఖ్యమంత్రి మనకొద్దు’’ అని ట్వీట్‌లో షర్మిల పేర్కొన్నారు.
* ఈ నెల 8న రైతుల సమస్యలపై పోరాటం చేయాలి: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.ఈ రోజు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ. రాష్ట్రంలో ప్రభుత్వం ఎవ్వరినీ వదిలి పెట్టకుండా వేధిస్తోందని ఆరోపించారు. బాధితుల తరఫున తమ పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు. స్థానికంగా వైసీపీ నేతలు పాల్పడుతోన్న మోసాలను ఎండగట్టాలని తమ పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు. వైసీపీ నేతలు చేస్తోన్న తప్పులను ప్రజలను వివరించి చెప్పాలని తెలిపారు. టీడీపీ తరఫున నియోజక వర్గాల్లో నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు.
మహానాడు నిర్వహించే వరకు వరుస కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. ఇందుకోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని తెలిపారు. ఈ నెల 8న రైతుల సమస్యలపై పోరాటం జరపాలని ఆయన సూచించారు. ఈ నెల 18న టీడీపీ సభ్య నమోదు కార్యక్రమం నిర్వహించాలని చెప్పారు. టీడీపీకి ఈ ఏడాది చాలా ముఖ్యమని ఆయన తెలిపారు. పార్టీ తరఫున ఏం చేసినా ఈ ఏడాదే చేయాలని అన్నారు. వచ్చే ఏడాది ఎన్టీఆర్ జన్మించి వందేళ్లు అవుతుందని చెప్పారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో పార్టీ కార్యకర్తలు ముందకు వెళ్లాలని సూచించారు. నాయకులు ధైర్యంగా లేకుండా కార్యకర్తలు కూడా డీలా పడతారని ఆయన చెప్పారు. ప్రజలకు ద్రోహం చేస్తోన్న నేతల తీరును ఎండగట్టాలని చెప్పారు. ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. వివిధ వర్గాలను కలుపుకుని ముందుకు వెళ్లాలని చెప్పారు.
* జగన్ చేసిన తప్పులను చరిత్ర మరిచిపోదు: చంద్రబాబు
వైకాపా పాలనలో రాష్ట్రం మళ్లీ కోలుకోలేని విధంగా దెబ్బతీశారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఈ విషయంలో సీఎం జగన్ చేసిన తప్పులను చరిత్ర మరిచిపోదన్నారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో 175 శాసనసభ, 25 లోక్‌సభ నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పాలనపై విమర్శలు చేశారు. రాష్ట్ర విభజన కంటే జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా దెబ్బతిందని. ఏమాత్రం అభివృద్ధి లేదని విమర్శించారు.తెదేపాతోనే అభివృద్ధి సాధ్యమని చంద్రబాబు చెప్పారు. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయని. ప్రజలు సంతోషంగా సంక్రాంతి పండగ జరుపుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. పన్నులపై పన్నులు వేసి భారం మోపుతున్నారని ఆక్షేపించారు. ఆఖరికి చెత్తపైనా పన్ను వేసే పరిస్థితికి వచ్చారని మండిపడ్డారు. రాష్ట్రం బాగుపడాలంటే వైకాపా గ్రహణం వీడాలన్నారు.
* యూపీ ఎన్నికలపై కరోనా ఎఫెక్ట్. ప్రచార ర్యాలీలను రద్దు చేసిన కాంగ్రెస్
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై కరోనా మహమ్మారి ప్రభావం పడినట్లే కన్పిస్తోంది. యూపీ వ్యాప్తంగా చేపట్టాల్సిన అన్ని ప్రచార ర్యాలీలను రద్దు చేస్తున్నట్లు కాంగ్రెస్ బుధవారం ప్రకటించింది. దేశంలో కరోనా కేసులు నానాటికీ పెరుగుతుండటంతో పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న పలువురు రాజకీయ నాయకులు కూడా వైరస్ బారినపడటంతో హస్తం పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నోయిడా ర్యాలీని రద్దు చేసుకున్నారు. నోయిడాలో గురువారం సీఎం ప్రచారం చేపట్టాల్సి ఉండగా.. అక్కడ కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే కాంగ్రెస్ లాగే బాజపా కూడా అన్ని ప్రచార కార్యక్రమాలు, ర్యాలీలను రద్దు చేస్తుందా లేదా అన్నదానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు.
*పథకాలకు పేర్లు మార్చండి. లేదంటే మేమే మార్చేస్తాం:
సోము వీర్రాజు కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చిన పథకాలకు ఏపీ ప్రభుత్వం ప్రధాని మోదీ పేరు పెట్టాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. పేర్లు మార్చకపోతే భాజపా రాష్ట్ర శాఖే రంగంలోకి దిగి మారుస్తుందని చెప్పారు. గుంటూరు జిల్లా బాపట్లలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు భరోసా కేంద్రాలకు మోదీ పేరు పెట్టాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. సీఎం జగన్ దిల్లీ పర్యటనలో కేంద్రమంత్రులను కలిశారని. రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి రూ.10వేల కోట్లు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవేను కేంద్ర ప్రభుత్వమే చేపట్టిందన్నారు.
*‘పాంగాంగ్’ పై చైనా వంతెన నిర్మాణం. ప్రధాని మోదీ మౌనమేల?
భారత్ సరిహద్దుల్లో దూకుడుగా వ్యవహరిస్తున్న చైనా పాంగాంగ్ సరస్సుపై వంతెన నిర్మిస్తుండటంపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ప్రధాని మౌనం భరించలేనిదన్న రాహుల్. మన భూమి, మన ప్రజలు, మన సరిహద్దులు ఎంతో బాగుండాలంటూ ట్వీట్ చేశారు. లద్ధాఖ్‌లో వాస్తవాధీనరేఖకు అత్యంత సమీపంలోని పాంగాంగ్ సరస్సుపై చైనా గత రెండు నెలలుగా వంతెన నిర్మాణ పనులు కొనసాగిస్తున్నట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. పాంగాంగ్ సరస్సులోని ఉత్తర, దక్షిణ కాల్వలను కలుపుతూ ఈ నిర్మాణం చేపడుతోంది. 2020 జూన్‌లో గల్వాన్ లోయలో భారత్, చైనా జవాన్ల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలు చెలరేగినప్పట్నుంచి తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో భద్రతలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ విమర్శలు చేస్తూ వస్తున్నారు.
* ఆ రెండు పార్టీల మధ్య ఒప్పంద గొడవలు: రేవంత్‌రెడ్డి
తెలంగాణలో భాజపా, తెరాస పార్టీలను 2023 ఎన్నికల్లో బంగాళాఖాతంలో కలుపుతామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్ష, అరెస్టు తర్వాత జరుగుతున్న పరిణామాలపై రేవంత్‌రెడ్డి ట్విటర్ ద్వారా స్పందించారు. ఆ రెండు పార్టీలు ఒక తాను ముక్కలేనని వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఈ విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తించిందన్నారు. బండి సంజయ్ అరెస్టు ఒకటో భాగం కాగా, నడ్డాను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారని ముందే ప్రచారం చేయడం రెండో భాగమని అభివర్ణించారు. భాజపాను తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా చూపించేందుకు తెరాస ఆడుతున్న నాటకంగా రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆ రెండు పార్టీల మధ్య ఒప్పంద గొడవలు జరుగుతున్నాయని ఆరోపించారు.
* ధర్మ యుద్ధాన్ని నిర్ణయాత్మక దశకు తీసుకెళ్తాం:
జేపీ నడ్డా ఉద్యోగులు, ప్రజల పక్షాన భాజపా పోరాడుతుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ. ఉద్యోగులకు మద్దతిచ్చేందుకే హైదరాబాద్ వచ్చినట్టు తెలిపారు. జీవో 317 ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉందన్నారు. బండి సంజయ్ శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే. భాజపా కార్యాలయంలోకి పోలీసులు బలవంతంగా చొచ్చుకెళ్లి అరెస్టు చేశారన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానం కలుగుతోందన్నారు. రాష్ట్రంలో నియంతృత్వ, కుటుంబ పాలన సాగుతోందని విమర్శించారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు. కేసీఆర్ పాలన ఉందని ధ్వజమెత్తారు.