Politics

మాయావతి సంచలన నిర్ణయం ఎన్నికలకు దూరం

మాయావతి సంచలన నిర్ణయం ఎన్నికలకు దూరం

యూపీ ఎన్నికలకు మాయావతి దూరం-పోటీ చేయబోరని బీఎస్పీ ప్రకటన

2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్ గా భావిస్తున్న ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ అధినేత్రి, మాజీ సీఎం మాయావతి మౌనంగా ఉండిపోవడంపై ఇప్పటికే పలు ఊహాగానాలు రేకెత్తాయి.
వాటిని నిజం చేస్తూ మాయావతి ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని పార్టీ ఎంపీ సతీశ్ చంద్ర మిశ్రా ఇవాళ ప్రకటించారు.

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటికే అధికార బీజేపీతో పాటు విపక్ష సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్, ఇతర పక్షాలు కూడా ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్న నేపథ్యంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి మాత్రం మౌనంగా ఉండిపోతున్నారు. దీంతో ఆమెకు ఉన్న దళిత ఓటు బ్యాంకు ఎటువైపు మళ్లుతుందనే దానిపైనా ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఇలాంటి సమయంలో మాయావతి అసలు అసెంబ్లీ ఎన్నికల్లోనే పోటీ చేయడం లేదని పార్టీ తరఫున ఎంపీ సతీశ్ చంద్ర మిశ్రా ప్రకటించడం సంచలనం రేపుతోంది.

మాయావతితో పాటు తాను కూడా ఈ అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు బీఎస్పీ ఎంపీ సతీశ్ చంద్ర మిశ్రా ఇవాళ వెల్లడించారు. అదే సమయంలో ఎస్పీ, బీజేపీలపై ఆయన సైటెర్లు వేశారు. ఎస్పీకి పోటీ చేయడానికి 400 మంది అభ్యర్ఝులే లేనప్పుడు వారు 400 సీట్లు ఎలా గెలుస్తారని మిశ్రా ప్రశ్నించారు. అంతే కాదు వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చే సత్తా ఎస్పీ, బీజేపీ ఇద్దరికీ లేదన్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది బీఎస్పీ మాత్రమేనని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో బీఎస్పీ రాజకీయమేంటో ఎవరికీ అర్ధం కావడం లేదు.