NRI-NRT

బ్రిటన్ లో వధువు కోసం పాకిస్థాని భారీ హోర్డింగుతో ప్రకటన. 

వధువు కోసం పాకిస్థాని భారీ హోర్డింగుతో ప్రకటన. 

బ్రిటన్‌లో ఉంటున్న పాకిస్థాన్‌ జాతీయుడు మహమ్మద్‌ మాలిక్‌.. తన జీవిత భాగస్వామిని వెతుక్కునేందుకు బిల్‌బోర్డ్‌లను ఆశ్రయించాడు. ‘నాకు సరిజోడి చూసిపెట్టండి’ అంటూ ప్రకటనలు ఇచ్చాడు. ‘పెద్దలు కుదిర్చే పెళ్లి నుంచి కాపాడండి’ అంటూ పెద్ద అక్షరాలతో ఉన్న హోర్డింగ్‌ను చూసి స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. లండన్‌, బర్మింగ్‌హామ్‌ నగరాల్లో ఈ బిల్‌బోర్డ్‌ ప్రకటన ఇచ్చాడు. తొలుత ఇదేదో ప్రాంక్‌ అయి ఉంటుందని అంతా భావించారు. లేదా సాధారణ ప్రకటనే అనుకున్నారు. మాలిక్‌ మాత్రం తన వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు తెలియజేశాడు ‘ఇది జోక్‌ కాదండోయ్‌’ అంటూ వెబ్‌సైట్‌లో శీర్షిక కూడా ఉంచాడు. ‘‘ఇప్పటివరకు నాకు సరైన మహిళ దొరకలేదు. కాబోయే భార్యను వెతుక్కోవడం చాలా కష్టంగా ఉంది. చాలా డేటింగ్‌ యాప్‌లలో ప్రయత్నించాను. తెలిసిన వారి ద్వారా సంబంధాలు కూడా చూశాం. ఎలాంటి ఫలితం లేదు. చివరకు నా స్నేహితుడి సలహాతో బిల్‌బోర్డ్‌ ప్రకటన ఇచ్చాను’’ అని మహమ్మద్‌ మాలిక్‌ తెలిపాడు. తన ప్రకటనకు స్పందించిన వందలాది మంది యువతులు ఇష్టపూర్వకంగా వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకున్నారని వెల్లడించాడు. ఆ వివరాలను పరిశీలించేందుకు సమయం దొరకడం లేదని వాపోయాడు.