Kids

కొవిడ్‌ ఎఫెక్ట్‌.. తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగింపు

Auto Draft

తెలంగాణలోని విద్యాసంస్థలకు సెలవులు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 8వ తేదీ నుంచి ప్రకటించిన సంక్రాంతి సెలవులు నేటితో ముగియనున్నాయి. అయితే రాష్ట్రంలో కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో సెలవులు పొడిగించాలని విద్యాశాఖకు వైద్యారోగ్య శాఖ సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ సిఫార్సు మేరకు ఈ నెల 30 వరకు సెలవులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 20వ తేదీ వరకు రాష్ట్రంలో ర్యాలీలు, సభలను జరపరాదని 9న రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దాంతో సెలవులను కూడా మొదట 20వ తేదీ వరకు పొడిగిస్తారని భావించారు. ఎక్కువ రోజులు పొడిగిస్తే సర్కారు పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల విద్యార్థులకు టీవీల ద్వారా ఆన్‌లైన్‌ పాఠాలను ప్రసారం చేయాల్సి ఉంటుంది. లేకుంటే అటు ప్రత్యక్ష తరగతులు లేవు… ఇటు ఆన్‌లైన్‌ పాఠాలు లేవన్న విమర్శ వస్తుందని అధికారులు అనుకున్నారు. పాఠశాల విద్యాశాఖ వర్గాలు మాత్రం ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలను అమలు చేస్తామని గతంలోనే పేర్కొన్నాయి. అయితే సెలవులను పొడిగిస్తారా? లేదా? అనేది త్వరగా ప్రకటిస్తే సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లిన వారు తిరిగి రావాలా? అక్కడే ఉండాలా? అన్నది నిర్ణయించుకుంటామన్న అభిప్రాయాన్ని కొందరు తల్లిదండ్రులు సైతం వ్యక్తం చేశారు. తాజాగా సెలవులు పొడిగిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేయడంతో స్పష్టత వచ్చింది.