*మరో 59 మందికి గాయాలు…ఆసుపత్రులకు తరలింపు
పశ్చిమ ఘనా దేశంలో ఘోర పేలుడు సంభవించింది.పేలుడు పదార్థాలను తీసుకువెళుతున్న మైనింగ్ ట్రక్ పేలుడు ఘటనలో 17 మంది మరణించగా, మరో 59 మంది తీవ్రంగా గాయపడ్డారు.
నైరుతి ఘనాలోని చిన్న పట్టణం అపియాట్‌లో ఈ ఘోర ప్రమాదం జరిగింది.పేలుడు పదార్థాలున్న ట్రక్కు నైరుతి ఘనాలోని అపియాట్ పట్టణం మీదుగా చిరానో బంగారు గనుల వద్దకు వెళుతుండగా మోటారుసైకిలు ఢీకొంది. దీంతో పేలుడు పదార్థాలున్న ట్రక్కులో భారీ పేలుడు జరిగింది. ఈ పేలుడు ధాటికి పలు ఇళ్లు సైతం నేలకూలాయి.క్షతగాత్రులను బొగోసో పట్టణంలోని ఆసుపత్రికి తరలించారు. పేలుడు ధాటికి పలు ఇళ్ల మెటల్ పైకప్పులు ఎగిరి పడ్డాయి. పేలుడు వల్ల గాయపడిన ప్రజలు సంఘటన స్థలంలో చెల్లాచెదురుగా పడిపోయారు.
ఈ పేలుడు ఘటనలో 17 మంది మరణించగా, మరో 59 మంది గాయపడ్డారని నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఆర్గనైజేషన్ ప్రాంతీయ సమన్వయకర్త అబ్దుల్ గనియు మహమ్మద్ చెప్పారు. మైనింగ్ పేలుడు కోసం ట్రక్కులో డైనమైట్ తీసుకువెళుతుండగా ఈ పేలుడు సంభవించిందని మహమ్మద్ చెప్పారు. మృతుల్లో ట్రక్కు డ్రైవరు లేడని అధికారులు చెప్పారు.సంఘటన స్థలంలో కొందరు శిథిలాల కింద కూరుకుపోయారు. దీంతో అత్యవసర సహాయ సిబ్బంది సంఘటన స్థలాన్ని మూసివేసి శిథిలాల్లో చిక్కుకున్న వారిని వెలికితీసే పనుల్లో నిమగ్నమయ్యారు.