ఖమ్మం నగరంలోని లకారం ట్యాంక్ బండ్ పై దివంగత నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 100 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చొరవతో కృష్ణుడి రూపంలో ఉన్న ప్రతిమను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు ప్రారంభించారు. మే 28 న ఎన్టీఆర్ 100 వ జయంతి సందర్భంగా ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరణ చేయాలన్న లక్ష్యంతో పనులు చేస్తున్నారు. శ్రీకృష్ణుని అవతారంలో ఎన్టీఆర్ పర్యాటకులను ఆకర్షించనున్నారు. బేస్మెంట్తో కలిపి 54 అడుగులు ఎత్తు ఉండే ఈ విగ్రహం ఎటు చూసినా 36 అడుగుల పొడవు వెడల్పుతో వెయ్యి అడుగుల విస్తీర్ణం ఉండే బేస్మెంట్ పై అమర్చనున్నారు. రూ .2.3 కోట్ల వ్యయంతో ప్రత్యేక సాంకేతికతను జోడించి నిజామాబాద్కు చెందిన వర్మ అనే చిత్రకారుడు విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. ఇందుకు అవసరమయ్యే నిధులను తానా సభ్యులతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు , వ్యాపారవేత్తలు , ఎన్నారైలు సహకరిస్తున్నారు. మాయాబజార్ , శ్రీకృష్ణ తులాభారం, దానవీరశూరకర్ణ లాంటి సినిమాలలో కృష్ణుని వేషధారణలో వెండితెర ఇలవేల్పుగా అవతరించిన ఎన్టీఆర్ను చూపాలన్న తపనతో నిర్వహకులు శ్రమిస్తున్నారు.