పరువు నష్టం దావా కేసుల నుంచి సీఎం స్టాలిన్‌కు ఊరట లభించింది. 18 కేసుల్ని రద్దు చేస్తూ మద్రాసు హైకోర్టు శుక్రవారం తీర్పు ఇచ్చింది. అన్నాడీఎంకే హయాంలో ప్రభుత్వాన్ని, సీఎంను, సీనియర్ అధికారులు, మంత్రులపై అప్పటి ప్రతిపక్ష నేత స్టాలిన్ అనేక ఆరోపణలు చేశారు. దీంతో ఆయన మీద అన్నాడీఎంకే పాలకులు 18 పరువు నష్టం దావా కేసులు నమోదు చేశారు.
విమర్శలు, ఆరోపణలు చేసే హక్కు ప్రతిపక్ష నేతగా తనకు ఉందని, ఈ కేసులను రద్దు చేయాలని కోరుతూ అప్పట్లో స్టాలిన్ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై కొంతకాలంగా విచారణ జరుగుతోంది. అదే సమయంలో డీఎంకే అధికారంలోకి రావడం, సీఎంగా స్టాలిన్ పగ్గాలు చేపట్టడంతో కేసులను ఉపసంహరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిస్థితుల్లో పిటిషన్ విచారణను ముగించిన న్యాయమూర్తి నిర్మల్‌కుమార్ బెంచ్ శుక్రవారం తీర్పు వెలువరించింది. కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకున్న దృష్ట్యా 18 కేసుల్ని రద్దు చేస్తున్నామని ప్రకటించింది.