Business

నేటి వాణిజ్య వార్తలు – 22/01/2022

నేటి వాణిజ్య వార్తలు – 22/01/2022

*ఫ్లిప్‌కార్ట్‌ మాజీ ఎగ్జిక్యూటివ్స్‌ ఇద్దరు విభిన్నమైన ఆలోచనతో మొదలుపెట్టిన ఓ స్టార్టప్‌.. ఆర్నెల్లు తిరగకుండానే మూతపడింది. బెంగళూరు, శాన్‌ ఫ్రాన్సిస్కో కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించిన ప్రొటన్‌.. భారత్‌లో బోణీ మొదలుపెట్టకముందే మూతపడినట్లు నిర్వాహకులు ప్రకటించారు. అంతేకాదు ఇన్వెస్టర్లకు డబ్బు మొత్తం వెనక్కి ఇచ్చేసినట్లు తెలిపారు.

*హెరిటేజ్‌ ఫుడ్స్‌.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబరుతో ముగిసిన త్రైమాసికానికి గాను కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.667 కోట్ల నికర ఆదాయాన్ని నమోదు చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికంతో పోల్చితే ఆదాయం 10.3 శాతం వృద్ధి చెందింది. సమీక్షా త్రైమాసికంలో కంపెనీ రూ.20.8 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో లాభం రూ.46.4 కోట్లుగా ఉంది.

*అదానీ గ్రూప్‌ కొత్తగా విద్యుత్‌ వాహనాల (ఈవీ) వ్యాపారంలోకి ప్రవేశిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఒక కంపెనీని నమోదు చేసింది. ఎస్‌బీ అదానీ ఫ్యామిలీ ట్రస్ట్‌ ద్వారా అదానీ గ్రూప్‌ ఈ కంపెనీని ఈ నెల 17న నమోదు చేసింది. పీఎల్‌ఐ పథకం ద్వారా అన్ని రకాల ప్రయాణ వాహనాల ఉత్పత్తి చేపట్టాలని అదానీ గ్రూప్‌ భావిస్తోంది.

*కొవిడ్‌-19 ఔషధం మోల్నుపిరవిర్‌ తయారీ కోసం జెనీవాకు చెందిన మెడిసిన్‌ పేషంట్‌ పూల్‌ (ఎంపీపీ)తో లారస్‌ లాబ్స్‌ ఒప్పందం కుదుర్చుకుంది. కొవిడ్‌ను కట్టడి చేసే యాంటీవైరల్‌ ఔషధం తయారీ కోసం ఎంపీపీతో ఒప్పందం కుదుర్చుకోవటం ఎంతో సంతోషాన్నిస్తోందని లారస్‌ లాబ్స్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ సత్యనారాయణ చావా అన్నారు.

*డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో గ్లాండ్‌ ఫార్మా కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.273 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2020-21 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికం (రూ.204 కోట్లు)తో పోల్చితే లాభం 34 శాతం వృద్ధి చెందింది. వివిధ మార్కెట్లలో అమ్మకాలు గణనీయంగా పెరగటం ఎంతగానో కలిసివచ్చిందని కంపెనీ పేర్కొంది. త్రైమాసిక సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం కూడా రూ.859 కోట్ల నుంచి రూ.1,063 కోట్లకు పెరిగింది.

*జర్మనీ లగ్జరీ కార్ల దిగ్గజం బీఎండబ్ల్యూ గురువారం తన ఎక్స్‌3 ఎస్‌యూవీలో కొత్త వెర్షన్‌ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.59.9 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌). రెండు పెట్రోల్‌ వేరియంట్లలో ఈ మోడల్‌ అందుబాటులో ఉండగా.. వీటి ధర వరుసగా రూ.59.9 లక్షలు, రూ.65.9 లక్షలుగా ఉంది. సరికొత్త లుక్‌, ప్రీమియం ఇంటీరియర్‌, సరికొత్త ఎక్వి్‌పమెంట్‌ ఫీచర్లు, అప్‌డేటెడ్‌ ఇన్ఫోటెయిన్‌మెంట్‌ వంటివి ఇందులో ఉన్నాయని కంపెనీ తెలిపింది.

*మోల్నుపిరవిర్‌ క్యాప్సుల్స్‌ను తయారు చేసి విక్రయించడానికి మెడిసిన్స్‌ పేటెంట్‌ పూల్‌ (ఎంపీపీ)తో నాట్కో ఫార్మా నాన్‌ ఎక్స్‌క్లూజివ్‌ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఒప్పందానికి అనుగుణంగా దేశీయంగా 200 ఎంజీ మోల్నుపిరవిర్‌ క్యాప్సుల్స్‌ను ‘మోల్నునాట్‌’ బ్రాండ్‌తో విక్రయించడంతో పాటు 105 దేశాలకు ఎగుమతి చేస్తుంది. కొవిడ్‌ చికిత్సకు మోల్నుపిరవిర్‌ ఔషధాన్ని వినియోగించడానికి అత్యవసర అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. మోల్నుపిరవిర్‌ లైసెన్స్‌ను మెర్క్‌ షార్ప్‌ అండ్‌ డోమ్‌ (ఎంఎస్‌ డీ) నుంచి ఎంపీపీ తీసుకుంది. నాట్కో మోల్నుపిరవిర్‌ విక్రయాలపై ఎంఎ్‌సడీకి రాయల్టీ చెల్లిస్తారు. కొవిడ్‌ మమమ్మారి కొనసాగినంత వరకూ నాన్‌ ఎక్స్‌క్లూజివ్‌ ఒప్పందం కొనసాగుతుందని నాట్కో వెల్లడించింది. మోల్నుపిరవిర్‌ క్యాప్సుల్‌ ధరను నాట్కో నిర్ణయిస్తుంది.

*హైదరాబాద్‌కు చెందిన పాల్‌రెడ్‌ టెక్నాలజీ్‌సలో బ్లాక్‌స్టోన్‌ ఇండియా మాజీ సహ అధిపతి మాథ్యూ కిరియక్‌ 20 శాతం వాటా తీసుకోనున్నారు. ఇందుకు రూ.32 కోట్లు చెల్లించనున్నారు. ఒక్కొక్కటి రూ.128 ధరతో 25 లక్షల కన్వర్టబుల్‌ వారెంట్లను జారీ చేయడానికి పాల్‌రెడ్‌ టెక్నాలజీస్‌ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ విధంగా లభించిన నిధులను మూలధనం, ఇతర వ్యాపార వ్యయాలకు వినియోగిస్తారు. వారెంట్‌ జారీ ధరలో 25 శా తం ముందుగా లభిస్తుంది. గరిష్ఠంగా తొమ్మిది నెలల్లో మిగిలిన మొత్తాన్ని చెల్లించాలి. వారెంట్లను రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుగా మారుస్తారు. 2017లో మాథ్యూ ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ ఫ్లోరిన్‌ట్రీ అడ్వైజర్స్‌ పాల్‌రెడ్‌ టెక్నాలజీ్‌సలో రూ.22 కోట్ల పెట్టుబడి పెట్టి ఆ తర్వాత వెనక్కి తీసుకుంది. వెటరన్‌ ఇన్వెస్టర్‌ క్రిసిస్‌ క్యాపిటల్‌ వ్యవస్థాపకుడు ఆశిష్‌ ధావన్‌కు కంపెనీలో 7 శాతం వాటా ఉంది.

*ప్రముఖ స్థిరాస్తి అభివృద్ధి సంస్థ అపర్ణ కన్‌స్ట్రక్షన్స్‌ హైదరాబాద్‌లో మరో వెంచర్‌ ప్రారంభించింది. పుప్పాలగూడ, నానక్‌రామ్‌గూడ ప్రాంతంలో ప్రారంభించిన ఈ గేటెడ్‌ కమ్యూనిటీ వెంచర్‌ కోసం కంపెనీ రూ.2,550 కోట్లు ఖర్చు చేయనుంది. మొత్తం 37 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు చేపట్టారు. ప్రాజెక్టులో భాగంగా 33 ఫ్లోర్లతో 14 బ్లాకులుగా 3,664 అపార్ట్‌మెంట్లు నిర్మిస్తారు. కంపెనీకి ఇది 60వ రెసిడెన్షియల్‌ ప్రాజెక్ట్‌. 2027కి పూర్తయ్యే ఈ గేటెడ్‌ కమ్యూనిటీ వెంచర్‌లో 1,020 నుంచి 2,257 చదరపు అడుగుల (ఎస్‌ఎ్‌ఫటీ) విస్తీర్ణంతో సింగిల్‌, డబుల్‌, ట్రిపుల్‌ బెడ్‌రూమ్‌ అపార్ట్‌మెంట్స్‌ నిర్మిస్తారు.