DailyDose

TNI నేటి తాజా వార్తలు 23/01/2022

TNI నేటి తాజా వార్తలు 23/01/2022

*రోనా వైరస్ విజృంభిస్తోంది. కొత్త సంవత్సరంలో పాజిటివ్ కేసుల సంఖ్య క్రమేపీ పెరుగుతూ.. సిక్కోలును వైరస్ చుట్టేస్తోంది. జిల్లాలో కేవలం పదిరోజుల్లోనే పది రెట్ల మేర పాజిటివ్ కేసులు పెరిగిపోయాయి. శ్రీకాకుళం జిల్లాలో గడిచిన 921 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 20,45,411 నమూనాలు సేకరించగా.. కరోనా బాధితుల సంఖ్య 1,29,939కు చేరింది. వీరిలో చాలామంది కోలుకున్నారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్లో 5,251 మంది, కొవిడ్ ఆస్పత్రుల్లో 128 మంది, కొవిడ్కేర్ సెంటర్లలో 10 మంది చికిత్స పొందుతున్నారు. ఆదివారం 259 మంది డిశ్చార్జ్ అయ్యారు.

* పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సీఎస్‎కు సమ్మె నోటీస్ ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ప్రతి జిల్లాకు ప్రతి జేఏసీ తరపున ఒక్కో రాష్ట్రస్థాయి నాయకుడిని పంపాలని నిర్ణయించింది. ఉద్యమం విజయవంతం చేయడానికి నలుగురు నాయకులను పంపాలని తీర్మానించింది. ప్రతిరోజూ జిల్లాల్లో జరిగిన ఉద్యమంపై రాష్ట్రస్థాయి నాయకులు నివేదిక ఇవ్వనున్నారు. ఆయా జిల్లాల్లో పీడీఎఫ్ ఎమ్మెల్సీ‎లను కలుపుకుని ఉద్యమం చేయాలని పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది.

*ఈ యేడాది నుంచి ‘బీటింగ్ రీట్రిట్ కార్యక్రమం’లో ‘అబైడ్ విత్ మి’ అనే గీతాన్ని తొలగించడం పట్ల కేంద్ర ప్రభుత్వంపై పలువురు విపక్ష పార్టీల నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీకి ఇష్టమైన ఈ గీతాన్ని తొలగించడం చాలా బాధాకరమని మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం అన్నారు. సున్నితమైన ఆలోచనలను, ప్రజలను ప్రభుత్వం నిరాశపరిచిందని ఆయన అన్నారు. స్కాట్లాండ్కు చెందిన ఆంగ్ల కవి, గేయకారుడు హెన్రీ ఫ్రాన్సిస్ లైట్ ఈ గీతాన్ని 1847లో రాశారు. కాగా, 1950 నుంచి మన దేశంలో బీటింగ్ రిట్రీట్ కార్యక్రమంలో పాడుతున్నారు. కాగా, ఈ ఏడాది నుంచి ఈ గీతాన్ని పాడటం లేదని తాజా భారత ఆర్మీ ప్రకటించింది.

*ఏప్రిల్లో జరగనున్న ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపును ఇంటర్ బోర్డు పొడిగించింది. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా వచ్చే నెల 4వరకు చెల్లించవచ్చని, ఆ తర్వాత రూ.200రుసుముతో వచ్చే10 వరకు, రూ.1000తో 17వరకు, రూ.2వేలతో 24వ తేదీ వరకు చెల్లించవచ్చని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. గత ఏడాది అక్టోబరులో ప్రథమ సంవత్సర పరీక్షలు రాసిన ద్వితీయ సంవత్సర రెగ్యులర్ విద్యార్థులు, పాసైన సబ్జెక్టులకు సంబంధించిన బెటర్మెంట్ పరీక్షలనూ ఏప్రిల్లో రాసుకోవచ్చని ఇంటర్ బోర్డు పేర్కొంది.

*కాంగ్రెస్లో డీఎస్ చేరిక మళ్లీ వాయిదా పడింది. సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిన ఆయన కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా వేసుకున్నారు. పార్లమెంట్ సమావేశాల సమయంలో డీఎస్ కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‎లో డి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా కొనసాగారు. కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్‎గా కూడా పని చేశారు. రాష్ట్ర విభజన తర్వాత డీఎస్ కాంగ్రెస్‎కు గుడ్ బై చెప్పి తెలంగాణ సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‎లో చేరారు. టీఆర్ఎస్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు. కొంతకాలంగా టీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్లో చేరేందుకు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఈ సమయంలో ఆయన చేరిక వాయిదా పడినట్లు ప్రకటన వెలువడింది.

*తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు సర్కారు సిద్ధమవుతోంది. మార్చి 7లోగా అన్ని నియోజకవర్గాల్లో ఈ పథకానికి సంబంధించిన యూనిట్లను లబ్ధిదారులకు ఇవ్వాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కలెక్టర్లను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు దళిత బంధు పథకం అమలుపై జిల్లా కలెక్టర్లతో కరీంనగర్ కలెక్టరేట్ నుంచి మంత్రి శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

*ఈనెల 27న మాజీమంత్రి ఎల్ రమణ ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా రమణ గెలిచారు. అనారోగ్యం కారణంగా కొంతకాలం రమణ విశ్రాంతి తీసుకుంటున్నారని చెబుతున్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఎల్ రమణ విజయం సాధించారు. రమణకు 450 ఓట్లు వచ్చాయి.

*ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడుకు మళ్లీ కరోనా సోకింది. హైదరాబాద్లో నేడు నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆయనకు పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. వైద్యుల సూచన మేరకు వారం రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉంటారని ఉపరాష్ట్రపతి కార్యాలయం ట్వీట్ చేసింది. వెంకయ్యను ఇటీవల కలిసినవారు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించింది.

*భారత నెంబర్ వన్ షట్లర్ పీవీ సింధు మరో ప్రతిష్టాత్మక టోర్నమెంట్ గెలుచుకున్నారు. సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ ఫైనల్లో ఆమె మాల్వికాను ఓడించారు. 21-13, 21-16తో వరుస సెట్లలో ఓడించి విజయబావుటా ఎగురవేశారు.

*నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి పురస్కరించుకుని నేతాజీ రీసెర్చ్ బ్యూరో.. జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు “నేతాజీ అవార్డు 2022″ను ప్రదానం చేసింది. ఈ మేరకు కోల్కతాలోని ఎల్గిన్ రోడ్లో ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ నివాసంలో ఆదివారం వర్చువల్గా జరిగిన కార్యక్రమంలో నేతాజీ అవార్డు 2022ను అబేకు ప్రదానం చేస్తున్నట్లు నేతాజీ రీసెర్చ్ బ్యూరో తెలిపింది.

*మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కొత్తగా నిర్మించిన ఆరు అవినీతి నిరోధక నిఘా విభాగం కార్యాలయాలను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రారంభించారు. కల్లకురిచ్చి, తెన్కాశి, చెంగల్పట్టు, తిరుపత్తూరు, రాణిపేట, మైలాడుదురై నగరాలలో రూ.2.93 కోట్లతో నిర్మించిన ఆ కార్యాలయ భవనాలను సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పళనివేల్ త్యాగరాజన్, ప్రభుత్వ పాలన సంస్కరణల విభాగం ప్రధాన కార్యదర్శి శివదాస్ మీనా, అవినీతి నిరోధక నిఘా విభాగం డైరెక్టర్ పి. కందసామి ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇదే విధంగా సచివాలయం నుంచే రాష్ట్ర నగరాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శివగంగ జిల్లా కళనివాసల్ వద్ద రూ.130.20 కోట్లతో నిర్మించే 900 రెసిడెన్షియల్ ప్లాట్లతో కూడిన భవన సముదాయాలకు ఆయన శంకుస్థాపన చేశారు. తిరుప్పూరు, కరూరు, కోయంబత్తూరు, నామక్కల్, తిరుచ్చి, ఈరోడ్, తంజావూరు జిల్లాల్లో సమగ్ర మంచినీటి పథకాలకు ప్రారంభోత్సవం, కొత్త పథకాలకు శంకుస్థాపన చేశారు.

*తెలంగాణలో ఇంటింటి ఫీవర్ సర్వే కొనసాగుతోంది. ఇప్పటివరకు 1.28 లక్షల మందికి కరోనా లక్షణాలున్నట్టు గుర్తించారు. లక్షణాలున్న ప్రతిఒక్కరికీ హోం ఐసొలేషన్ కిట్స్ అందజేసినట్లు అధికారులు తెలిపారు. సర్వేలో చిన్నారులు, పెద్దవారి వివరాలు విడివిడిగా సేకరించినట్లు అధికారులు పేర్కొన్నారు. తీవ్ర కరోనా లక్షణాలుంటే ఆస్పత్రిలో అడ్మిట్ చేస్తున్నట్లు వైద్య సిబ్బంది వివరించారు.

*హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్దరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. సరోజినిదేవి హాస్పిటల్ సమీపంలో వేగంగా బైక్పై వస్తున్న ఓ యువకుడు టిప్పర్ లారీని ఢీ కొట్టాడు. ఈ ఘటనలో యువకుడు ముందు టైరు కింద పడి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు మోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

*అమరావతిలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. టీడీపీ – వైసీపీ నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లుగా మారాయి. ఇసుక అక్రమ రవాణాపై ఇరు పార్టీల నేతల ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. నేడు లేమల్లేలో బహిరంగ చర్చకు సవాల్ విసిరారు. లేమల్లే బయలుదేరిన టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పోలీసులు – టీడీపీ నేతల మధ్య వాగ్వాదంతో పాటు తోపులాట చోటుచేసుకుంది.

*చైనాతో సరిహద్దులు పంచుకుంటున్న అరుణాచల్ ప్రదేశ్లోని వెస్ట్ కమింగ్ జిల్లాలో బోర్డర్ రోడ్స్ ఆర్గనేజేషన్ (బీఆర్ఓ) చేపట్టిన సెలా టన్నెల్ ప్రాజెక్టు కీలక దశకు చేరుకుంది. తవ్వకం పని శనివారంతో పూర్తయింది. 980 మీటర్ల పొడవైన సొరంగం (టన్నెల్-1) కోసం బీఆర్ఓ డైరెక్టర్ జనరల్..లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ చౌదరి చివరి పేలుడును న్యూఢిల్లీ నుంచి నిర్వహించారు. ప్రతికూల వాతావరణం, భారీ హిమపాతం మధ్య ఈ అరుదైన ఫీట్ సాధించినట్టు ఆయన చెప్పారు. తవాంగ్కు అనుసంధానించే ఈ ప్రాజెక్టు పూర్తి కాగానే ఇదొక లైఫ్లైన్ అవుతుందని అన్నారు. 13,000 అడుగుల ఎత్తులో నిర్మించిన పొడవైన సొరంగాలలో ఇది కూడా ఒకటి. ఈ ప్రాజెక్ట్ లో బిసిటి రోడ్ నుండి బయలుదేరే టన్నెల్ 1కి ఏడు కిలోమీటర్ల అప్రోచ్ రోడ్డు, టన్నెల్ 1 నుండి టన్నెల్ 2ని కలిపే 1.3 కిలోమీటర్ల లింక్ రోడ్డు నిర్మాణం కూడా ఉంది. సెలా టన్నెల్ ప్రాజెక్టులో టన్నెల్-1తో పాటు 1,555 మీటర్ల టన్నెల్-2 కూడా ఉంది.

*అంతర్రాష్ట్ర జల వివాదాలపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకోనున్న నిర్ణయాలపై ఫిబ్రవరి తొలివారంలో అఖిలపక్ష భేటీని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తెలిపారు. మేకెదాటు ప్రాజెక్టుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఫిబ్రవరి 14న విచారణకు రానుందని ఈలోగానే అఖిలపక్షభేటీని ఏర్పాటు చేస్తామన్నారు. నగరంలో శనివారం సీఎం మీడియాతో మాట్లాడుతూ కృష్ణ, కావేరి జలవివాదాలపై కోర్టులో కేసులు ప్రగతిదశలో ఉన్నాయన్నారు. రాష్ట్రం తరపున వాదిస్తున్న అడ్వకేట్లతో వర్చువల్ సమావేశం జరుపుతామన్నారు. అడ్వకేట్ జనరల్, జలనిపుణులు పాల్గొంటారన్నారు. కర్ణాటకకు జల వివాదాలు పలు రాష్ట్రాల నుంచి కొనసాగుతున్నాయన్నారు. ట్రిబ్యునల్ ఆదేశాలు, సుప్రీంకోర్టులో వాయిదాలకు ముందు తరచూ వర్చువల్ సమీక్షలు జరిపి వారు ఏ విధంగా స్పందించదలచుకున్నారో తెలుసుకుంటామన్నారు. కృష్ణ నదికి సంబంధించి బచావత్ ఆదేశాలతోపాటు బ్రిజేశ్ మిశ్రా ట్రిబ్యునల్ నిర్ణయం కూడా వచ్చిందని, గెజిట్ నోటిఫికేషన్ వెలువడాల్సి ఉందన్నారు. మహదాయి ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసినా మరోసారి సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలైందన్నారు. కర్ణాటకతోపాటు మూడు రాష్ట్రాల నీటి పంపిణీకి సంబంధించి విబేధాలు ఉన్నాయన్నారు. కావేరి నదికి అనుబంధంగా మేకెదాటు ప్రాజెక్టు నిర్మాణాలకు కేంద్రం డీపీఆర్ ఆదేశించిందని, ఆ తర్వాత తమిళనాడు సుప్రీంకోర్టును ఆశ్రయించిందన్నారు. వీటిపై ఇప్పటికే పలుమార్లు ఢిల్లీలోనూ చర్చలు జరిగాయన్నారు. త్వరలోనే వర్చువల్ భేటీ జరిపి న్యాయవాదులు, నిపుణులతో మాట్లాడతామన్నారు.

*జంట నగరాల అభివృద్ధిపై మంత్రి కేటీఆర్తో చర్చకు సిద్ధమని ఎమ్మెల్యే రఘునందన్రావు అన్నారు. భాగ్యనగరాన్ని నిర్మించిన కార్మికులకు ఇళ్లు లేకపోవడం బాధాకరమన్నారు. లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మిస్తామని కేసీఆర్ మాట తప్పారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ ఇందిరానగర్లో పర్యటించి బస్తీవాసుల బాధలు తెలుసుకోవాలన్నారు. స్థానిక ఎమ్మెల్యేకు లోకల్ సమస్యలు పట్టడంలేదన్నారు.

*బాపట్ల సమీపంలో గూడ్స్ రైలు ప్రమాదం జరిగింది. 25, 26 బోగీల మధ్య కప్లింగ్ ఊడిపోయింది. రైల్వే ట్రాక్ స్వల్పంగా దెబ్బతింది. దీంతో విజయవాడ-చెన్నై మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైల్వే అధికారులు హుటాహుటిన ట్రాక్ మరమ్మతుల పనులు చేపట్టారు.