తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను ఈ సంవత్సరం మరింత ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. శనివారం మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డిసత్యవతి రాథోడ్ తదితరులతో కలిసి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ శాశ్వత ప్రాతిపదికన మేడారంలో పనులు చేపట్టినట్టు తెలిపారు. మేడారం మహాజాతరకు కోటి ముప్పై లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నామని చెప్పారు.ప్రతీ భక్తుడికి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.ఆదివాసీల అభిప్రాయాలకు గౌరవం ఇస్తామని, వారి సంప్రదాయాలకు ఆటంకం కలగకుండా చూస్తామన్నారు.కానీ కొందరు జాతరను కూడా రాజకీయం చేయాలని చూస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి ఆరోపించారు. అయినా ప్రభుత్వం భక్తుల మనోభావాలకు అనుగుణంగానే జాతర నిర్వహిస్తుందన్నారు. కాగా జాతర ఏర్పాట్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి రూపాయి కూడా నిధులు రావడం లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో శ్రద్ధతో జాతర నిర్వహణకు ఆదేశించారని చెప్పారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ మేడారం మహాజాతర కోసం ప్రభుత్వం 350కోట్లతో ఏర్పాట్లు చేస్తున్నదని చెప్పారు. ఇప్పటికే కొన్ని డిపార్ట్ మెంట్లలో పనులు పూర్తయ్యాయి, ఇంకా మిగిలి ఉన్న పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు. జాతరకు వచ్చే భక్తుల కోసం 4వేల బస్సులు, పదివేల మంది సిబ్బందితో రవాణా సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు.జంపన్న వాగులో స్నాన ఘట్టాలు ఏర్పాటు చేశామనిఎవరికీ ఇబ్బందులు రాకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. లోపాలు ఉంటే సరిదిద్దుకుంటామని మంత్రి వివరించారు. అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటున్నామని తెలిపారు.ఆందోళన చేస్తున్న ఆదివాసి సంఘాలతో మాట్లాడతామని కూడా మంత్రి వెల్లడించారు. కాగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ ఆదివాసి సంప్రదాయాలకు అనుగుణంగా జాతర నిర్వహిస్తామని స్పష్టం చేశఆరు. పూజారుల మనోభావాలు గౌరవిస్తామని, ఆదివాసి, గిరిజన ఆరాధ్యదైవమైన జాతరకు 350 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని వివరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ఎంతమంది భక్తులు వచ్చినా అసౌకర్యం కలగనివ్వమని అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటున్నామని చెప్పారు.
1.తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం తిరుమల శ్రీవారిని 24,888 మంది దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.10 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 12,650 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు.
2. టీటీడీకి రూ.2 కోట్ల విరాళం
తిరుమల తిరుపతి దేవస్థానానికి శుక్రవారం రూ.2 కోట్లు విరాళంగా అందాయి. చెన్నైకి చెందిన ముని శ్రీనివాసులు రెడ్డి రూ.కోటి విరాళంగా ఇచ్చారు. ఈ మొత్తాన్ని ఆయన శ్రీబాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి వినియోగించాలని కోరారు. మరో అజ్ఞాత భక్తుడు ఎస్వీ వేదపరిరక్షణ ట్రస్టుకు రూ.కోటి విరాళంగా చెన్నైలోని టీటీడీ ఆలయంలో అందజేసినట్టు టీటీడీ చెన్నై లోకల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ ఏజే శేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు.
3. తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. త్వరలో.. – టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడి
తిరుమల శ్రీవారి భక్తులకు త్వరలోనే ఆఫ్‌లైన్ ద్వారా దర్శనం టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. కోవిడ్ వ్యాప్తి చెందుతుందన్న ఆందోళనతో తిరుపతిలో ఆఫ్‌లైన్ ద్వారా టోకెన్ల జారీ విధానాన్ని గత ఏడాది సెప్టెంబర్ 25 నుంచి రద్దు చేశామని చైర్మన్ వివరించారు. ఆన్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నప్పటికీ, అవి గ్రామీణ ప్రాంతంలో వున్న సామాన్య భక్తులకు అందడం లేదనే భావనలో టీటీడీ ఉందన్నారు.ఫిబ్రవరి 15వ తేదీ నాటికి ఒమిక్రాన్ తీవ్రత తగ్గుముఖం పడుతుందని నిపుణులు చెబుతుండటంతో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఫిబ్రవరి 15వ తేదీ వరకు సంబంధించిన సర్వదర్శనం టోకెన్లు మాత్రమే జారీచేస్తున్నామని ఆయన తెలిపారు. శ్రీవేంకటేశ్వ రస్వామి దర్శనం కోసం ఫిబ్రవరికి సంబంధించిన రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లను శుక్రవారం ఉదయం ఆన్‌లైన్‌లో విడుదల చేయగా భక్తులు నిమిషాల్లోనే బుక్ చేసుకున్నారు. ఫిబ్రవరి నెలలో రోజుకి 12,000 చొప్పున టికెట్లను విడుదల చేశారు. ఫిబ్రవరి నెలకు సంబంధించి స్లాట్ సర్వదర్శనం టికెట్లను శనివారం ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. ఫిబ్రవరి 15 వరకు రోజుకు 10 వేల చొప్పున సర్వదర్శనం టికెట్లను విడుదల చేశారు.
*విశేష పర్వదినాల్లో వర్చువల్ సేవ
శ్రీనివాస మంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ముఖ్య పర్వదినాల్లో నిర్వహించే కల్యాణోత్సవాన్ని వర్చువల్ సేవగా నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది.
*సీఎం చేతులమీదుగా శ్రీనివాససేతు ప్రారంభం
తిరుపతి స్మార్ట్ సిటీలో భాగంగా నిర్మిస్తున్న శ్రీనివాససేతు ఫ్లైఓవర్ తొలిదశ నిర్మాణాన్ని సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆయన శ్రీనివాససేతు ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను శుక్రవారం పరిశీలించారు.
4. ట్రాన్స్ జెండర్‌ల బోనం.. కరోనా అంతం కావాలని మొక్కులు
నిర్మల్ జిల్లా కేంద్రంలో ట్రాన్స్ జెండర్లు బుధవారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. కరోనా మూడోదశ తీవ్రమవుతున్న తరుణంలో ప్రజలంతా క్షేమంగా ఉండాలని, అందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ అడెల్లి మహాపోచమ్మకు బోనం సమర్పిస్తున్నట్లు తెలిపారు. బోనాలు అనగానే చిన్నా పెద్ద.. ఆడ మగ తేడా లేకుండా అందరూ కలిసి అమ్మవారి ఆలయాలకు తరలివెళ్లడం, నైవేద్యాలను సమర్పించడం మనమందరం చూస్తూనే ఉంటాం. అయితే నిర్మల్ జిల్లా(Nirmal District)కేంద్రంలో జరిగిన ఈ వేడుక ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. దీనికి కారణం ఉత్సవాలను నిర్వహించింది ట్రాన్స్ జెండర్స్ కావడమే. నిర్మల్ పట్టణంతో పాటు పెద్దపల్లి(Peddapalli), నిజామాబాద్(Nizamabad), గజ్వేల్, బోధన్, ఆర్మూర్ తదితర ప్రాంతాలకు చెందిన పలువురు ట్రాన్స్ జెండర్‌లు జిల్లా కేంద్రంలోని విశ్వనాథ్ పేటకు తరలివచ్చారు. నైవేద్యంతో సిద్ధం చేసిన బోనాల కుండలకు మొదటగా పూజలు నిర్వహించారు. అనంతరం కాలనీలో బాజాభజంత్రీలు నడుమ ప్రదర్శన చేపట్టారు. సాంప్రదాయ వేషధారణ.. పూనకం వచ్చినట్లు ఊగిపోతూ చేసిన నృత్యాలు పలువురిని విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం సారంగాపూర్ మండలంలోని అడెల్లి పోచమ్మకు బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కరోనా మొదటి దశ, రెండవ దశలో అనేక మందిని బలిగొందని, మూడవ దశ తీవ్రం అవుతున్న నేపథ్యంలో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని తాము అమ్మవారికి బోనం సమర్పించినట్లు ట్రాన్స్ జెండర్లు చెబుతున్నారు. అందరూ క్షేమంగా ఉండేలా ఆశీర్వదించాలని అమ్మవారిని పూజించామన్నారు. జిల్లాలో మొట్ట మొదటిసారిగా అమ్మవారికి ట్రాన్స్ జెండర్లు బోనాలు సమర్పించడం విశేషం.
5. వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో భక్తుల రద్దీ
వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మేడారం సమ్మక్క సారక్క జాతర సమీపిస్తున్న తరుణంలో తొలుత రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు వేములవాడకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఫలితంగా వేములవాడ పుణ్యక్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతోంది. ఈ క్రమంలో శుక్రవారం భారీ సంఖ్యలో భక్తులు తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించే భక్తులతో ఆలయ కల్యాణకట్ట నిండిపోయింది. సర్వదర్శనం, శీఘ్రదర్శనం క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు. నిలువెత్తు బెల్లం పంచిపెట్టారు. శుక్రవారం సందర్భంగా లఘుదర్శనం అమలు చేశారు. ఆలయ ఈవో ఎల్.రమాదేవి ఏర్పాట్లు పర్యవేక్షించడంతోపాటు పలుమార్లు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.