WorldWonders

అరుదైన చేప రూపంలో తలుపు తట్టిన అదృష్టం

అరుదైన చేప రూపంలో తలుపు తట్టిన అదృష్టం

పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు మిడ్నపూర్, దిఘాకు చెందిన మత్స్యకారుడు మనోరంజన్ ఖండాకు అరుదైన చేప రూపంలో అదృష్టం తలుపు తట్టింది. కరోనా వైరస్ మహమ్మారి అష్టదిగ్బంధనంతో వచ్చిన నష్టాలన్నీ భర్తీ అయ్యే స్థాయిలో డబ్బు వచ్చింది. జీవనోపాధి కోసం చేపల వేటకు వెళ్ళిన ఆయన ట్రాలర్‌కు 121 అత్యంత అరుదైన తేలియా భోలా చేపలు పడ్డాయి. వీటిని శనివారం మధ్యాహ్నం మోహన ఫిష్ మార్కెట్‌లో అమ్మడంతో దాదాపు రూ.2 కోట్లు వచ్చాయి.

స్థానిక మత్స్యకారులు మీడియాతో మాట్లాడుతూ, తేలియా భోలా చేపల్లో చాలా విలువైన ఔషధ గుణాలు ఉన్నట్లు తెలిపారు. ఈ చేపల మూత్రాశయంలో ఉత్పత్తి అయ్యే లివర్ ఆయిల్‌ను మందుల తయారీలో వాడతారన్నారు. ఖండా మాట్లాడుతూ, తేలియా భోలా చేపలను పట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకుని వెళ్లినప్పటికీ, వాటిని పట్టుకోవడం సాధ్యం కాకపోవచ్చునని, ఇవి చాలా అరుదైనవి కాబట్టి, వాటంతట అవి వలలో పడినపుడే అదృష్టం సొంతమవుతుందని చెప్పారు. శనివారం ఉదయం ఇంత పెద్ద మొత్తంలో ఈ చేపలు పడటం ఊహకు అందని విషయమని చెప్పారు. ఇది నిజంగా దేవుడు ఇచ్చిన వరమేనని తెలిపారు. రెండేళ్ళ నుంచి తాము ఎదుర్కొంటున్న నష్టాలకు పరిహారంగా దేవుడే వీటిని తన వలలో పడేశాడని తెలిపారు. కోవిడ్-19 వ్యాప్తి నిరోధం కోసం 2020లో అష్ట దిగ్బంధనం అమలైనపుడు తాము చాలా కష్టాలు అనుభవించామన్నారు.

మత్స్య శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ (మెరైన్) సురజిత్ బాఘ్ మాట్లాడుతూ, తేలియా భోలా చేప మూత్రాశయం ఔషధాల తయారీకి ఉపయోగపడుతుందన్నారు. అందుకే వీటిని ఎగుమతి చేస్తామని చెప్పారు. వీటిని అత్యధిక ధరకు అమ్ముతామన్నారు. ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఈ చేపలు వలలో పడటం చాలా అరుదు అని చెప్పారు. గత ఏడాది నవంబరులో కూడా తేలియా భోలా చేపలు పశ్చిమ బెంగాల్‌లోని 24 పరగణాల జిల్లాలో ఓ మత్స్యకారుని వలకు చిక్కాయి. ఒక్కొక్క చేప బరువు సుమారు 78 కేజీలు ఉంది.