బెంగుళూరులో ఒక్కసారిగా సంచలనం సృష్టించింది మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప మనవరాలు సౌందర్య ఆత్మహత్య కేసు. పెళ్లయ్యి కొన్నాళ్లే అయ్యింది. పైగా తనకు తొమ్మిది నెలల బాబు కూడా ఉన్నాడు. సంతోషంగా జీవితాన్ని సాగిస్తుంది అనుకున్నారంతా. కానీ ఒక్కసారిగా ఆత్మహత్య చేసుకొని శవమై కనిపించింది. దానికి కారణాలు ఏంటని పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.శుక్రవారం ఉదయం బెంగుళూరులోని అపార్ట్‌మెంట్‌లో ఉరేసుకుని కనిపించింది యడియూరప్ప మనవరాలు సౌందర్య. డాక్టర్‌గా సౌందర్య ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలో పనిచేస్తుండేది. పెళ్లయిన తర్వాత కూడా సౌందర్య కొన్నాళ్ల వరకు డాక్టర్‌గా చేసింది. కానీ కొడుకు పుట్టిన తర్వాత ఉద్యోగం మానేసింది. అప్పటినుండి తాను ఎక్కువశాతం ఇంట్లో ఒంటరిగానే ఉంటుంది. ఒంటరితనమే సౌందర్య ఆత్యహత్యకు కారణమని సమాచారం. కోవిడ్ సమయంలో సౌందర్య ఇంట్లో ఎక్కువగా ఒంటరిగా ఉండడంతో తాను దానివల్ల డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిందని సన్నిహితులు అనుకుంటున్నారు. ఇదిలా ఉండగా తన మనవరాలు ఆత్మహత్య వార్త విన్న యడియూరప్ప జీర్ణించుకోలేక తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆత్మహత్య గురించి మరిన్ని వివరాల కోసం పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.