ఒకే చోట 108 ఆలయాల సందర్శన
లక్షన్నర కిలోల ఆవు నెయ్యి
“అందరి దు:ఖాలు దూరం చేయడానికి నేనొక్కడిని నరకంపాలైనా ఆనందంగా అంగీకరిస్తా
మాధవుని ముందు మనుషులందరూ సమానులే
అతని నామాన్ని పలికే అధికారం అన్ని కులాలకీ ఉంది
అతని ఆలయం ప్రవేశించే అర్హత కులాలకు అతీతంగా అందరిదీ.”
జనావాసానికి దూరంగా చీకటి బ్రతుకుల్లో మగ్గుతున్న దళితులను, దీనులను మంత్రోపదేశంతో తరింపజేసి వేదసారార్ధ జ్ఞానంతో అందరినీ వైష్ణవులుగా తీర్చిదిద్దిన సమ సమాజ నిర్మాత. ప్రపంచ చరిత్రలోనే పండితులకీ, పామరులకీ, ప్రశాసకులకీ, పాలకులకీ మధ్య సుందర సేతువును నిర్మించి విశ్వకుటుంబ భావనకు ఊపిరిలూదిన సంఘ సంస్కర్త శ్రీ రామానుజాచార్యస్వామి.
* భగవద్బంధువులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన శ్రీ రామానుజ సహస్రాబ్దీ సమారోహం ఇంకా కొన్ని గంటల్లోనే మొదలు కాబోతోంది. ప్రతి ఒక్కరి ఆరోగ్యం, శ్రేయస్సును కాంక్షిస్తూ ఎక్కడా జరగని విధంగా 1035 హోమ కుండాలతో శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువు సమారోహం 12 రోజులూ 24 గంటలూ జరుగుతుంది. స్వచ్ఛమైన దేశీ ఆవు నెయ్యితో లక్ష్మీనారాయణ యాగం నిర్వహిస్తారు. ఇందు కోసం లక్షన్నర కిలోల ఆవు నెయ్యిని ఉపయోగిస్తున్నారు. 5 వేల మంది వేదపండితులు ఇందులో పాల్గొంటారు. దేశంలోని వివిధ ప్రాతాల నుంచి వేదపండితులు ఇప్పటికే చేరుకున్నారు. 108 దివ్య దేశాల నుండి తెచ్చిన శ్రీసాలగ్రామమూర్తి, దివ్యమృత్తికా ఆయా సన్నిధులలో చేర్చి 108 దివ్య దేశాల ప్రాణ ప్రతిష్ట జరుగుతుంది. దేశంలోనే కాకుండా, నేపాల్ లోని ఆలయాలను ఇవి పోలి ఉంటాయి. అందుకే 108 ఆలయాలను ఒకే చోట సందర్శించిన భాగ్యం ఇక్కడ కలుగుతుంది.
* 9 అంకెను చాలా మంది ఇష్ట పడతారు. 9 కి చాలా మహత్మ్యం ఉందంట. ఈ అంకె నాశనం లేని తత్వాన్ని కలిగి ఉంటుందంట. చినజియర్ స్వామి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం లో 9 కి ప్రాధాన్యం ఇచ్చారు. రామానుజ విగ్రహం 216 అడుగులు అంటే 9. దండం 162 అడుగులు అంటే 9. 108 మెట్లు…ఇలా అన్నీ 9 వచ్చేటట్లు ఏర్పాటు చేశారు. శ్రీ రామానుజాచార్యస్వామి సర్వజన హితానికి సర్వ వేదసారమైన సూక్ష్మార్ధాలను 9 గ్రంధాలుగా రచించారు.
సమతా మూర్తి శ్రీ రామానుజాచార్య 1017ADలో శ్రీపెరంబుదూర్ లో అవతరించారు. 2017 కి వెయ్యి ఏళ్ళు అయింది. ఆ సందర్భంగా చేసిన సంకల్పమే సమతామూర్తి విగ్రహ ఏర్పాటుకు దారితీసింది. ఫిబ్రవరి 5వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. 13వ తేదీ రాష్ట్రపతి రాం నాద్ కోవింద్.రానున్నారు. బంగారంతో చేసిన నిత్యపూజా మూర్తి విగ్రహానికి తొలిపూజ చేయనున్నారు.
*శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలకు ముచ్చింతల్‌లోని చిన జీయర్ స్వామి ఆశ్రమం ముస్తాబు అయింది. 45 ఎకరాల్లో రూ.1000 కోట్లతో ఈ దివ్యక్షేత్రం ఆరేళ్లలో సాకారమైయింది. 216 అడుగుల ఎత్తుతో రామానుజుల పంచలోహ విగ్రహం. బరువు 1800 కిలోలు. పద్మపీఠంపై పద్మాసనంలో ఆసీనుడిగా త్రిదండ ధారుడై ముకుళిత హస్తాలతో దివ్య తేజస్సుతో దర్శనం ఇవ్వనున్నారు. గర్భగుడిలో 120 కిలోల బంగారంతో ‘నిత్యపూజా మూర్తి’. సమతామూర్తి చుట్టూ 108 ఆలయాలు.. మధ్యలో భారీ మండపం.శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు ముచ్చింతల్‌లో ఫిబ్రవరి 2 నుంచి 14వ తేదీ వరకు జరగనున్నాయి.
*ప్రధానాకర్షణ ఫౌంటెయిన్!
సమతామూర్తి మహా విగ్రహం చుట్టూ శ్రీవైష్ణవంలో దివ్యదేశాలుగా భావించే 108 పుణ్య క్షేత్రాలు, గర్భాలయాల ఆకృతిలో 108 ఆలయాలను నిర్మించారు. వీటిని అనుసంధానిస్తూ మధ్యలో 468 స్తంభాలతో భారీ దివ్యదేశ మండపాన్ని నిర్మించారు. ఈ దివ్య క్షేత్రంలోకి అడుగుపెట్టగానే అష్టదళ పద్మాకృతిలో ఉండే 45 అడుగుల ఎత్తుతో కూడిన ఫౌంటెయిన్ కనిపిస్తుంది. పద్మ పత్రాలు విచ్చుకునేలా దాదాపు రూ.25 కోట్లతో ఫౌంటెయిన్‌ను నిర్మించారు. పద్మపత్రాల మధ్య నుంచి నీళ్లు, రామానుజులను అభిషేకిస్తున్న భావన భక్తులకు కలుగుతుంది. అదే సమయంలో రామనుజుల కీర్తనలను శ్రావ్యంగా వినిపిస్తాయి. సూర్యాస్తమయం తరువాత రామానుజులు ప్రభోధించిన సమానత్వ ఘట్టాలను మ్యూజిక్‌తో త్రీడీ షో ద్వారా ప్రదర్శించనున్నారు. రామానుజుల జీవిత విశేషాలు తెలిపే మ్యూజియం కూడా ఏర్పాటు చేశారు. కాగా సమతామూర్తి విగ్రహంలో పద్మపీఠంపై పంచలోహాలతో తయారు చేసిన 36 శంఖు, చక్రాలతో పాటు ఏనుగు ఆకృతులు అమర్చారు.