Business

క్రిప్టో ట్రేడర్లకు శుభవార్త ! – TNI వాణిజ్యం 01/02/2022

క్రిప్టో ట్రేడర్లకు శుభవార్త ! – TNI  వాణిజ్యం  01/02/2022

* క్రిప్టో ట్రేడర్లకు శుభవార్త ! కేంద్రం బడ్జెట్‌లో క్రిప్టోకి అనుకూలంగా నిర్ణయం వెలువడింది. భారత ఆర్థిక వ్యవస్థకు పురోగతి అందించే విధంగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో ‘డిజిటల్‌ రూపీ’ 2022-23లో ప్రవేశపెట్టబోతున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వర్చువల్‌ డిజిటల్‌ ఆస్తుల లావాదేవీలపై 30 శాతం టాక్స్‌ విధిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా తెలిపారు. ప్రైవేట్‌ క్రిప్టో లావాదేవీల్లో పన్ను విధానం లేదు. కానీ ప్రభుత్వం తెచ్చే డిజిటల్‌ రూపీలో పన్ను విధానం ఉంటుందని ఆర్థిక మం‍త్రి స్పష్టం చేశారు. క్రిప్టో కరెన్సీకి భారత్‌లో అనుమతులు ఇవ్వాలంటూ ఇటీవల డిమాండ్లు వినిపించాయి. కేంద్రం సైతం శీతాకాల సమావేశాల్లో ఈ అంశంపై చర్చిస్తామని చెప్పింది. అయితే ఆర్బీఐ అధికార వర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశం చర్చకు రాలేదు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ నేరుగా బడ్జెట్‌ ప్రసంగంలో క్రిప్టో అంశాన్ని చేర్చింది కేంద్రం. ఇప్పటికే పలు దేశాల్లో ప్రభుత్వ ఆధీనంలో క్రిప్టో వ్యవస్థలు పని చేస్తున్నాయి.

* కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్ 2022లో నూతన భూ సంస్కరణలు ప్రవేశపెట్టింది. ఒకే దేశం – ఒకే రిజిస్ట్రేషన్ కి సంబంధించిన విషయాన్ని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. ‘ఒకే దేశం ఒకే రిజిస్ట్రేషన్’ సాఫ్ట్‌వేర్‌ నేషనల్ జెనరిక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్‌(NGDRS)తో దేశంలో ఎక్కడి నుంచైనా భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా డీడ్‌లు, రిజిస్ట్రేషన్లకు నూతన ఆధునిక వ్యవస్థను తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు.”మెరుగైన జీవన సౌలభ్యం కోసం, దేశంలో సులభంగా వ్యాపారం చేయడానికి వీలుగా వన్ నేషన్ – వన్ రిజిస్ట్రేషన్ విధానం ఏర్పాటు చేయనున్నట్లు” సీతారామన్ తెలిపారు. అలాగే, దేశంలో సులభంగా వ్యాపారం చేయడానికి 25,000 ఒప్పందాలు తొలగించామని, 1,486 యూనియన్ చట్టాలను కూడా రద్దు చేసినట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. చెల్లింపులలో జాప్యాన్ని తగ్గించడానికి ఆన్ లైన్ బిల్లు చెల్లింపు వ్యవస్థ గురించి అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలతో మాట్లాడినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే, ఎంటర్‌ప్రైజ్, హబ్‌ల అభివృద్ధిని ప్రోత్సహించడానికి ప్రత్యేక ఆర్థిక మండలాల చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకొని రావాలని ఆమె తన బడ్జెట్ 2022 ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ కొత్త చట్టం ఇప్పటికే ఉన్న పారిశ్రామిక ప్రాంతాలను కవర్ చేస్తుందని, ఎగుమతులలో పోటీతత్వాన్ని పెంపొందిస్తుంది అని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు.

* టాటా మోటార్స్‌ కి చిప్‌సెట్ల సెగ
ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్‌ ప్రస్తుత ఆర్థిక సవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో మళ్లీ నష్టాలబాట పట్టింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో రూ. 1,451 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 2,941 కోట్ల నికర లాభం ఆర్జించింది. ప్రధానంగా లగ్జరీ కార్ల బ్రిటిష్‌ అనుబంధ సంస్థ జాగ్వార్‌ ల్యాండ్‌రోవర్‌(జేఎల్‌ఆర్‌) అమ్మకాలపై చిప్‌ల కొరత ప్రభావం చూపింది. ఇక మొత్తం ఆదాయం సైతం రూ. 75,654 కోట్ల నుంచి రూ. 72,229 కోట్లకు క్షీణించింది. అయితే ప్రస్తుత సమీక్షా కాలంలో స్టాండెలోన్‌ ప్రాతిపదికన టర్న్‌అరౌండ్‌ పనితీరు చూపింది. రూ. 176 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత క్యూ3లో రూ. 638 కోట్ల నికర నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం రూ. 9,636 కోట్ల నుంచి రూ. 12,353 కోట్లకు ఎగసింది. ఎగుమతులుసహా మొత్తం వాహన అమ్మకాలు 30 శాతం పెరిగి 2,00,212 యూనిట్లకు చేరాయి. సరఫరా సమస్యలున్నపటికీ వాణిజ్య, ప్యాసింజర్‌ వాహన విక్రయాలు పుంజుకున్నట్లు టాటా మోటార్స్‌ పేర్కొంది.

* బెంచ్‌మార్క్ ఈక్విటీ ఇండెక్స్‌లు మంగళవారం నిలకడ కోల్పోయాయి. ఇంట్రాడే లాభాల్లో చాలా వరకు కోల్పోయాయి. బీఎస్ఈ, ఎన్ఎస్ఈ మంగళవారం ప్రారంభంలో లాభాల్లో కనిపించినా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ముగిసేసరికి కొంత వరకు నష్టాన్ని చవి చూశాయి. మొత్తం మీద 1 శాతానికి పైగా అధికంగా ట్రేడ్ అయ్యాయి.

* కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. రైతులకు ప్రయోజనకరంగా ఉండే విధంగా రైల్వే వ్యవస్థను తీర్చిదిద్దుతామన్నారు. అత్యంత సామర్థ్యం, మెరుగైన సౌకర్యాలు కలిగిన 400 వందే భారత్ రైళ్లను వచ్చే మూడేళ్లలో తీసుకురానున్నట్టు తెలిపారు. అలాగే పీఎం గతిశక్తి పథకంలో భాగంగా 100 గతిశక్తి టెర్మినల్స్, 25 వేల కి.మి. జాతీయ రహదారుల విస్తరణ చేయనునున్నట్టు ప్రకటించారు.

* పార్లమెంటులో సోమవారం ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే ఆశాజనకంగా ఉండడం, సానుకూల అంతర్జాతీయ సంకేతాలు, గణనీయంగా కోలుకున్న రూపాయి మద్దతుతో ఈక్విటీ మార్కెట్‌ రెండు రోజుల భారీ నష్టాలకు తెర దించింది. ఆరంభం నుంచి మార్కెట్‌ సానుకూలంగానే ట్రేడయింది. సెన్సెక్స్‌ పటిష్ఠంగా ప్రారంభమై రోజంతా వేగాన్ని కొనసాగిస్తూ చివరికి 813.94 పాయింట్ల లాభంతో 58014.17 వద్ద ముగిసింది. నిఫ్టీ 237.90 పాయింట్ల లాలభంతో 17339.85 వద్ద క్లోజైంది. 4.88 శాతం లాభంతో సెన్సెక్స్‌ షేర్లలో టెక్‌ మహీంద్రా అగ్రగామిగా ఉంది. మొత్తం 27 షేర్లు లాభాలతో ముగిశాయి. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌ మాత్రం నష్టాల్లో ముగిశాయి.

* ప్రభుత్వ రంగంలోని యూకో బ్యాంక్‌ డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రూ.310.40 కోట్ల లాభం ఆర్జించింది. 2020-21 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.35.44 కోట్లతో పోల్చితే లాభం 775 శాతం పెరిగింది. డిసెంబరు త్రైమాసికంలో వడ్డీ ఆదాయం 25.26 శాతం వృద్ధితో రూ.1762.60 కోట్లకు చేరిందని బ్యాంక్‌ సీఈఓ, ఎండీ సోమశంకర ప్రసాద్‌ తెలిపారు. అన్ని విభాగాల్లోనూ బ్యాంకు మెరుగైన పనితీరు ప్రదర్శించిందన్నారు. త్రైమాసికంలో నికర వడ్డీ మార్జిన్‌ అంతర్జాతీయంగా 3.03 శాతం ఉండగా దేశీయంగా 3.14 శాతం ఉన్నట్టు తెలిపారు. స్థూల ఎన్‌పీఏలు 9.8 శాతం నుంచి 8 శాతానికి తగ్గాయి. ఎన్‌పీఏల ప్రావిజన్‌ కవరేజి నిష్పత్తి 91.3 శాతం ఉంది.

* దక్షిణ కొరియా కార్ల కంపెనీ కియా.. ఆంధ్రప్రదేశ్‌, అనంతపురంలోని తన ప్లాంట్‌ నుంచి కారెన్స్‌ తొలి యూనిట్‌ను ఉత్పత్తి చేసింది. కంపెనీ ఈ కారును ఫిబ్రవరి లో మార్కెట్లోకి విడుదల చేయనుంది. భారత మార్కెట్లోకి సంస్థ విడుదల చేయబోతున్న నాలుగో మోడల్‌ ఇది. కియా ఇప్పటికే సెల్టోస్‌, సోనెట్‌, కార్నివాల్‌ మోడళ్లను దేశీయ మార్కెట్లో విక్రయిస్తోంది. కియా కారెన్స్‌ కంపెనీ దేశీయంగా ఉత్పత్తి చేస్తోన్న తాజా మోడల్‌. స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికిల్‌ (ఎ్‌సయూవీ) హంగులతోపాటు పెద్ద కుటుంబానికి పనికి వచ్చేలా డిజైన్‌ చేసిన రిక్రియేషన్‌ వెహికిల్‌ (ఆర్‌వీ) ఇది. కేవలం అనంతపురం ప్లాంట్‌లో ఉత్పత్తి కానున్న ఈ కారెన్స్‌ కార్లను దేశీయంగా విక్రయించడంతోపాటు 80 దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.

* దక్షిణ కొరియా కార్ల కంపెనీ కియా.. ఆంధ్రప్రదేశ్‌, అనంతపురంలోని తన ప్లాంట్‌ నుంచి కారెన్స్‌ తొలి యూనిట్‌ను ఉత్పత్తి చేసింది. కంపెనీ ఈ కారును ఫిబ్రవరి లో మార్కెట్లోకి విడుదల చేయనుంది. భారత మార్కెట్లోకి సంస్థ విడుదల చేయబోతున్న నాలుగో మోడల్‌ ఇది. కియా ఇప్పటికే సెల్టోస్‌, సోనెట్‌, కార్నివాల్‌ మోడళ్లను దేశీయ మార్కెట్లో విక్రయిస్తోంది. కియా కారెన్స్‌ కంపెనీ దేశీయంగా ఉత్పత్తి చేస్తోన్న తాజా మోడల్‌. స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికిల్‌ (ఎ్‌సయూవీ) హంగులతోపాటు పెద్ద కుటుంబానికి పనికి వచ్చేలా డిజైన్‌ చేసిన రిక్రియేషన్‌ వెహికిల్‌ (ఆర్‌వీ) ఇది. కేవలం అనంతపురం ప్లాంట్‌లో ఉత్పత్తి కానున్న ఈ కారెన్స్‌ కార్లను దేశీయంగా విక్రయించడంతోపాటు 80 దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.

* ప్రభుత్వం 2020-21 ఆర్థిక సంవత్సరానికి ప్రకటించిన జీడీపీ వృద్ధి రేటును సవరించింది. గతంలో జీడీపీ వృద్ధి రేటు మైనస్‌ 7.3 శాతంగా ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా దీన్ని మైనస్‌ 6.6 శాతానికి సవరించింది. కొవిడ్‌-19 ప్రభావం వల్ల గత ఏడాది జీడీపీ తిరోగమనంలోకి వెళ్లింది. స్థిర ధరల ప్రకారం గత ఏడాది వాస్తవ జీడీపీ రూ.135.58 లక్షల కోట్లు కాగా 2019-20 సంవత్సరానికి రూ.145.16 లక్షల కోట్లని జాతీయ గణాంకాల శాఖ కార్యాలయం తెలిపింది. అంటే ముందు ఏడాదితో పోల్చితే జీడీపి మైనస్‌ 6.6 శాతం క్షీణించిందని పేర్కొంది.

* ఈ-కామర్స్‌ స్టార్టప్‌ డీల్‌షేర్‌.. సిరీస్‌ ఈ నిధుల సమీకరణలో భాగంగా డ్రాగనీర్‌ ఇన్వె్‌స్టమెంట్‌ గ్రూప్‌, కోరా క్యాపిటల్‌, యూనీలివర్‌ వెంచర్స్‌ నుంచి నుంచి రూ.1,237.5 కోట్లను సమీకరించింది. ప్రస్తుత ఇన్వెస్టర్లు టైగర్‌ గ్లోబల్‌, అల్ఫా వేవ్‌ గ్లోబల్‌ (ఫాల్కన్‌ ఎడ్జ్‌) కూడా నిధులు అందించిన వాటిలో ఉన్నాయి. తాజా నిధుల సమీకరణతో కంపెనీ విలువ 160 కోట్ల డాలర్లకు (రూ.12,000 కోట్లు) చేరుకుందని డీల్‌షేర్‌ వెల్లడించింది. సమీకరించిన నిధులను టెక్నాలజీ, డేటా సైన్స్‌ సహా లాజిస్టిక్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కోసం వినియోగించనున్నట్లు తెలిపింది. కాగా సమీప భవిష్యత్తులో కంపెనీ రాబడులు 100 కోట్ల డాలర్ల (రూ.7,500 కోట్లు) మార్కును చేరుకోవచ్చని అంచనా వేస్తోంది. డీల్‌షేర్‌ను 2018లో బెంగళూరు కేంద్రంగా వినీత్‌ రావు, శంకర్‌ బోరా, రజత్‌ శిఖర్‌ ఏర్పాటు చేశారు.

* కొత్త చీఫ్‌ ఎకనామిక్‌ అడ్వైజర్‌ (సీఈఏ)గా అనంత నాగేశ్వరన్‌ను ప్రభుత్వం నియమించింది. బడ్జెట్‌కు ముందు ఆర్థిక సర్వే విడుదల చేయనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నియామకం చేపట్టింది. గత ఏడాది డిసెంబరులో కేవీ సుబ్రమణియన్‌ మూడేళ్ల పదవీ కాలం పూర్తి కావటంతో ఈ పదవి నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. క్రెడిట్‌ సూయిస్‌ గ్రూప్‌ ఏజీ, జూలియస్‌ బేర్‌ గ్రూప్‌ మాజీ ఎగ్జిక్యూటివ్‌ అయిన నాగేశ్వరన్‌ శుక్రవారం నాడు సీఈఏగా బాధ్యతలు చేపట్టినట్లు ప్రభుత్వం అధికారిక ప్రకటనలో వెల్లడించింది.