NRI-NRT

రికార్డు స్థాయిలో ‘తానా’ సభ్యత్వ నమోదు – TNI ప్రత్యేకం

రికార్డు స్థాయిలో ‘తానా’ సభ్యత్వ నమోదు – TNI ప్రత్యేకం Record level ‘Tana’ membership registration - TNI exclusive. 1.5Million USD Earnings. All Time Membership Records.

ప్రపంచంలో పెద్ద తెలుగు సంఘంగా గుర్తింపు పొందిన ఉత్తర అమెరికా తెలుగు అసోషియేషన్ (తానా)లో వర్గాల పోరు పతాక స్థాయికి చేరింది. 45 సంవత్సరాల తానా చరిత్రలో ఇప్పటి వరకు 35వేల మంది సభ్యులుగా ఉండగా ప్రస్తుతం కొత్తగా చేపట్టిన సభ్యత్వ నమోదులో ఆ సంఖ్య రెట్టింపు అయ్యింది. కొద్ది గంటల క్రితమే తానా నూతన సభ్యత్వం నమోదు కార్యక్రమం ముగిసింది. కొత్తగా 36వేలకు పైగా సభ్యులు నూతనంగా తానాలో నమోదైనట్లు సమాచారం. ప్రస్తుతం కొత్త సభ్యులతో కలిసి తానాలో సభ్యుల సంఖ్య 70 వేలు దాటినట్లు సమాచారం. ఇది తానా చరిత్రలో రికార్డుగా చెప్తున్నారు.

*బోగస్ సభ్యత్వాలను తొలగిస్తారా?
తానాలో ప్రస్తుతం నాయకత్వం మూడు వర్గాలుగా చీలిపోయింది. వీరంతా పోటాపోటీగా కొత్త సభ్యులను నమోదు చేయించారు. వచ్చే ఎన్నికల్లో తానాపై తాము పట్టు సాధించాలని మూడు వర్గాల వారు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. దీని మూలంగానే ఇబ్బడిముబ్బడిగా సభ్యత్వాల నమోదు జరిగింది. ప్రస్తుతం తానాలో బోగస్ సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉన్నదని, అనర్హులను సభ్యత్వాల నుండి తొలగించాలని కొందరు సీనియర్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

*భారీగా వచ్చిన ఆదాయం.
తానాలో వర్గాల పోరు ఎలా ఉన్నప్పటికీ నూతన సభ్యత్వాల మూలంగా భారీగా ఆదాయం లభించింది. కొత్త సభ్యుల చేరిక ద్వారా ఒకటిన్నర మిలియన్ డాలర్లు తానాకు ఆదాయంగా లభించినట్లు సమాచారం. ప్రపంచంలో భారీ ఆదాయాన్ని ఆర్జించే సంస్థగా ‘తానా’ రూపుదిద్దుకుంది.

*”బైలాస్”లను సవరిస్తారా?
గతంలో తానాలో నూతనంగా సభ్యత్వం పొందేవారు మూడు సంవత్సరాల పాటు ఆ సంస్థలో కొనసాగితేనే ఓటు వేయడానికి అర్హత సాధించేవారు. కొద్ది సంవత్సరాల క్రితం కొంత మంది పెద్దలు ఈ నిబందనలను తమకు అనుకూలంగా సవరించుకున్నారు. సభ్యులుగా నమోదైన ఏడాది అనంతరం ఓటింగులో పాల్గొనే విధంగా చట్టాన్ని సవరించుకున్నారు. ప్రస్తుతం పాత విధానాన్నే కొనసాగించాలని తానాలో సుదీర్ఘ కాలంగా ఉంటున్న సీనియర్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మరొక పక్క తానా ట్రస్టు బోర్డు చైర్మన్ బండ్ల హనుమయ్య బైలాలను సవరించడానికి తగిన సూచనలు ఇవ్వమని సభ్యులకు సమాచారం పంపారు. కొత్త సభ్యులకు మూడేళ్ళ తరువాత ఓటు హక్కు లభించే విధంగా నిబంధనలను తిరిగి చేర్చాలని చాలా మంది సీనియర్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. —కిలారు ముద్దుకృష్ణ,సీనియర్ జర్నలిస్ట్.