* దిశా దశా లేని బడ్జెట్: కేకే
కేంద్ర బడ్జెట్ తీవ్ర నిరాశ పరిచిందని ఎంపీ కె.కేశవరావు అన్నారు. దిశా దశా లేకుండా బడ్జెట్ ప్రవేశ పెట్టారని ఆయన ఆరోపించారు. హెల్త్ సెక్టార్‌కి కేంద్రం సరైన నిధులు కేటాయించలేదన్నారు. అర్బన్ అభివృద్ధికి ఏమీ కేటాయించలేదన్నారు. క్రిప్టో కరెన్సీపై 30 శాతం టాక్స్ వేశారన్నారు. క్రిప్టోను లీగల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. పేదలకు ఈ బడ్జెట్‌తో ఎలాంటి ప్రయోజనం లేదని ఆయన మండిపడ్డారు.
* వచ్చే వందేళ్ల కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది: ప్రధాని మోదీ
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వచ్చే వందేళ్ల కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్‌గా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. నాలుగు ప్రధాన సూత్రాల ఆధారంగా బడ్జెట్ రూపకల్పన జరిగింది. 1. ప్రధాని గతిశక్తి యోజన 2. సమీకృత అభివృద్ధి 3. అభివృద్ధి ఆధారిత పెట్టుబడులు 4. పరిశ్రమలకు ఆర్థిక అండ ఈ అంశాలను ఆధారంగా చేసుకుంటూ బడ్జెట్ రూపొందించాము. దేశ యువత ఉజ్వల భవిష్యత్‌కు ఈ బడ్జెట్ ఉపయోగపడుతుంది.ఉద్యోగాలు, మౌలిక వసతులు, అభివృద్ధి ప్రాతిపదికన ఈ బడ్జెట్ రూపొందించింది. ఈ బడ్జెట్లో భారత రక్షణకు పెద్దపీట వేశాం. బడ్జెట్లో మహిళల కోసం మిషన్ శక్తి, వాత్సల్య, సక్షమ్ అంగన్వాడీల రూపకల్పన వంటి 3 ప్రత్యేక పథకాలు తీసుకొచ్చాం. గంగానది తీర రాష్ట్రాల్లో సహజసిద్ధ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాం. దేశ ఆర్థిక వ్యవస్థ సరైన దిశలోనే ప్రయాణిస్తోంది. అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుతుంది. నవశకానికి నాంది పలికేలా ఈ బడ్జెట్ ఉంది’ అని ప్రధాని నరంద్ర మోదీ అన్నారు.
* కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి మొండి చేయి – శైలజానాథ్
కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి మొండి చేయి చూపిందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ ఆరోపించారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా, రైల్వే జోన్ ఇతర అంశాల ప్రస్తావన లేకపోవడం దారుణం అన్నారు. నోట్ల రద్దు నుంచి ఇప్పటివరకు కేంద్రప్రభుత్వం పేదల జీవితాలను చిన్నాభిన్నం చేసి ఇప్పుడు డిజిటల్ భారత్ అంటూ కొత్త పల్లవి అందుకుందని ఎద్దేవా చేశారు. కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలకు, దేశ రైతాంగానికి, సామాన్యులకు, పేదలకు, వృత్తి కులాలకు, ఉద్యోగులకు తీవ్ర నిరాశ నిస్పృహలకు గురిచేసిందని స్పష్టం చేశారు. విజయవాడ ఆంధ్ర రత్న భవన్ నుంచి ఈ మేరకు అయన ఒక ప్రకటన విడుదల చేశారు. మోడీ ప్రభుత్వం ‘జీరో’ సమ్ బడ్జెట్ ప్రకటించిందని, వేతన జీవులకు శూన్యహస్తాలు చూపించారని వ్యాఖ్యానించారు. మధ్యతరగతి ప్రజలకు, బడుగు, బలహీన, పేదలకు, యువతకు, రైతులకు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కూడా మొండిచేయి చూపారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తమ జబ్బలు తామే చరుచుకుంటూ, సామాన్యులను నిరాశా నిస్పృహలకు గురిచేస్తూ , మసిపూసి మారేడు కాయ చేసిన గోల్ మాల్ బడ్జెట్ గా కేంద్ర బడ్జెట్ ను శైలజనాథ్ పేర్కొన్నారు. వ్యవసాయ రంగాన్ని ఆదుకునే దిశగా కేంద్రం తీసుకున్న చర్యలు శూన్యమని అన్నారు. దేశ రైతాంగానికి, వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్ బిగ్ జీరో అని స్పష్టం చేశారు. దేశ చేనేత రంగానికి ఈ బడ్జెట్ సున్నా చుట్టిందన్నారు. నేతన్నలను ఆదుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఉద్యోగులను చిరు వ్యాపారులను బడ్జెట్ తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. ఇన్ కంటాక్స్ లో స్లాబ్స్ ను ఏమీ మార్చకపోవడం విచారకరమని అన్నారు. ఆదాయపన్ను చెల్లింపులో స్లాబుల విధానం కోసం ఆశగా ఎదురు చూస్తున్న ఉద్యోగ వర్గాలు, తదితర పన్ను చెల్లింపుదారులు చకోర పక్షుల్లా ఎదురు చూసారని, వారి ఆశలమీద కేంద్ర బడ్జెట్ నీల్లు చల్లిందన్నారు. కరోనా నేపథ్యంలో దేశ వైద్య రంగాన్ని అభివృద్ధి పరచడం మౌలిక వసతుల పురోగతికి చర్యలు తీసుకునేందుకు చర్యలు చేపట్టలేదన్నారు. వచ్చే 5 ఏళ్లలో 60 లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందన్న కేంద్ర ఆర్ధిక మంత్రి, ఉన్న ఉద్యోగులను ఇంటికి పంపి ప్రైవేటీకరణ చేస్తోందని ఆరోపించారు. వర్క్‌ఫ్రం హోం అమలవుతున్నందున స్టాండర్డ్ డిడక్షన్ లో పలు సవరణలు చేయాలని ఉద్యోగులు కోరినా, ఇన్కమ్ టాక్స్ శ్లాబుల్లో కూడా మార్పులు తేవాలనే డిమాండ్లు ఉన్నా కేంద్ర బడ్జెట్లో వీటికి అవకాశం కల్పించలేదని, పన్నులకు సంబంధించిన అనుబంధ సెక్షన్లలో సైతం ప్రభుత్వం ఎటువంటి మార్పులు చేయకపోవడం శోచనీయం అన్నారు.
* వైసీపీ హయాంలో దళితులకు రక్షణ లేదు: వర్ల రామయ్య
వైసీపీ ప్రభుత్వ హయాంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. టీడీపీ దళిత సెల్ ఆధ్వర్యంలో నగరంలో దళిత ప్రతిఘటన సదస్సు జరిగింది. సదససులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ అన్యాయాన్ని ప్రశ్నిస్తే శిరోముండనం చేయించింది నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. మాస్క్ పెట్టుకోలేదని కొట్టి చంపింది వాస్తవం కాదా అని ఆయన నిలదీశారు. అత్యాచారాలకు గురైన దళిత యువతులకు ఏం న్యాయం చేశారని ఆయన ప్రశ్నించారు. నిందితులకు కొమ్ము కాసేలా అధికార పార్టీ నేతల తీరు ఉందని ఆయన ఆరోపించారు. ఈ సదస్సులో పార్టీ నేతలు యం.యస్.రాజు, నెట్టెం రఘురాం, దేవినేని ఉమ, తదితరులు హాజరయ్యారు.
* కేంద్ర బడ్జెట్ చూస్తే బాధాకరంగా ఉంది: పొన్నాల లక్ష్మయ్య
కేంద్ర బడ్జెట్ చూస్తే చాలా బాధాకరంగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రభుత్వానికి ప్రధాన్యతలు కూడా తెలియదని, పన్నుల వసూలు పెరిగిందని బల్లలు చర్చడం సిగ్గుచేటన్నారు. పేద ప్రజల మీద భారం తగ్గించడానికి కేంద్రం ఏం చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు చట్టబద్ధంగా రావాల్సిన నిధులు ఇవ్వడం లేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ ప్రాణం బీజేపీ చేతిలో ఉందని, అందుకే ముఖ్యంత్రి గిల గిలా కొట్టుకుంటున్నారని అన్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా తీర్మానం చేసి పంపే దమ్ము ఉందా? అని ప్రశ్నించారు. అమెరికా, చైనా ఆర్థిక వృద్ధిరేటు ఎంత?.. భారత్ వృద్ధిరేటు ఎంత? అని ప్రశ్నించారు. ఇది ప్రజాహితం కోరే బడ్జెట్ కాదన్నారు. పీఎం మోదీ నిన్న యూపీలో మాట్లాడిన మాటలు ప్రధాని పదవిని అవమానించేలా ఉన్నాయన్నారు. దేశ అప్పులు 232.8 బిలియన్ డాలర్ల నుంచి 1626 బిలియన్ డాలర్లకు పెరిగిందన్నారు. ఏడింతల అప్పులు పెంచి దేశాన్ని దివాళా తీశారని పొన్నాల లక్ష్మయ్య తీవ్రస్థాయిలో విమర్శించారు.
* పసలేని నిష్ప్రయోజనకర బడ్జెట్: కేసీఆర్
కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు, దేశ రైతాంగానికి, సామాన్యులకు, పేదలకు, వృత్తి కులాలకు, ఉద్యోగులకు తీవ్ర నిరాశా నిస్పృహలకు గురిచేసిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. నేడు కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్…దశ దిశా నిర్దేశం లేని, పసలేని నిష్ప్రయోజనకర బడ్జెట్ అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి చదివి వినిపించిన బడ్జెట్ ప్రసంగం ఆసాంతం డొల్లతనం తో నిండి, మాటలగారడీ తో కూడి వున్నదని అని సిఎం అన్నారు. కేంద్ర ప్రభుత్వం తమ జబ్బలు తామే చరుచుకుంటూ, సామాన్యులను నిరాశా నిస్పృహలకు గురిచేస్తూ , మసిపూసి మారేడు కాయ చేసిన గోల్ మాల్ బడ్జెట్ గా కేంద్ర బడ్జెట్ ను సిఎం పేర్కొన్నారు. వ్యవసాయ రంగాన్ని ఆదుకునే దిశగా కేంద్రం తీసుకున్న చర్యలు శూన్యమని సిఎం అన్నారు.
* రాబోయే పాతికేళ్ల దేశ భవిష్యత్‌కు అద్దం పట్టిన బడ్జెట్: బండి సంజయ్
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ విప్లవాత్మకమని, రాబోయే పాతికేళ్ల దేశ భవిష్యత్‌కు అద్దం పట్టిన బడ్జెట్ అని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశంసించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. దీనిపై స్పందించిన ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ స్వదేశీ వ్యాక్సిన్‌తో కరోనాను కట్టడి చేసిన మోదీ ప్రభుత్వం… ‘ఆత్మ నిర్భర్’ వ్యాక్సిన్‌తో ఆర్ధిక సుస్థిరత సాధించడం చారిత్రాత్మకమని కొనియాడారు. ఆర్దిక ఇబ్బందులున్నప్పటికీ ప్రజలపై భారం మోపకుండా పన్నుల రహిత బడ్జెట్‌ను రూపొందించడం సాహసోపేతమన్నారు. ఎన్నికల రాజకీయాలతో పనిలేకుండా దేశహితమే లక్ష్యంగా దీర్ఘకాల లక్ష్యాలతో రూపొందించిన బడ్జెట్ అన్నారు. ఎస్ఎంఈ, ఎంఎస్ఎంఈ రంగాలకు రూ.6 లక్షల కోట్ల ప్రోత్సాహకాలతో కోట్లాది మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రాబోతున్నయన్నారు. ఇంతటి సాహసోపేత బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రధాని మోదీ, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్లకు బండి సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు.
* యూపీలో పోలింగ్‌కు… ఇస్లామాబాద్ సిద్ధం!
ఇదెక్కడి చోద్యం… పాకిస్తాన్ రాజధాని వాసులకు ఉత్తరప్రదేశ్‌లోని అసెంబ్లీ ఎన్నికలతోసంబంధమేమిటని ఆశ్చర్యపోతున్నారా? మీరునుకుంటున్నట్లు ఇది పాక్‌లోని ఇస్లామాబాద్ కాదు. యూపీలోని జిల్లా కేంద్రమైన బిజ్నౌర్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేజర్ గ్రామపంచాయతీ. జనాభా వదివేలు. ఓటర్లు దాదాపు 4,700 మంది ఉంటారు. ‘పేరులో నేముంది’.. మాకున్న సమస్యల్లా ఇరుకురోడ్లు మెరుగుపడాలి, అభివృద్ధి జరగాలి… ఇవి చేసే అభ్యర్థికే మా ఓటు అంటున్నారు ఇస్లామాబాద్ గ్రామ పెద్ద విజేంద్ర సింగ్. ఇస్లామాబాద్ పేరుండటం మూలంగా మీలో అభద్రతాభావం లాంటిది తలెత్తదా? అని అడిగినపుడు… అసలు మాకు అది శత్రుదేశపు రాజధాని పేరు అనేదే గుర్తుకురాదు. గ్రామంలో ప్రధానంగా చౌహాన్లు, ప్రజాపతి సామాజికవర్గాల జనాభా అధికమని, 400 మంది దాకా ముస్లింలు కూడా ఉంటారని… అంతా కలిపిమెలిసి ఉంటామని చెప్పుకొచ్చారు విజేంద్ర సింగ్.
* నన్ను గంటన్నర పాటు విచారించారు: పోతిన మహేష్
అస్లాం మృతి కేసులో మంత్రి వెల్లంపల్లిపై ఆరోపణలు చేసిన జనసేన అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు విచారించారు. ఈ వ్యాఖ్యలకు ఆధారాలు ఇవ్వాలంటూ ఆయనను కోరారు. గంటన్నరపాటు మహేష్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు విచారించారు. అనంతరం జనసేన నేత మీడియాతో మాట్లాడుతూ…‘‘సయ్యద్ అస్లాం మృతి కేసులో నేను అనేక అంశాలు మాట్లాడాను. ఈ కేసుకు సంబంధించి ఆధారాలు ఉంటే ఇవ్వాలని టాస్క్ ఫోర్స్ ఏసీపీ రమణమూర్తి అడిగారు. ఈ కేసుపైనే నన్ను గంటన్నర పాటు విచారించారు. ఎటువంటి ఆధారాలు ఉన్నా… వ్యక్తుల ప్రమేయం తెలిసినా చెప్పాలన్నారు. నా దగ్గర ఉన్న సమాచారం కూడా పోలీసులకు వివరించాను… దర్యాప్తు పూర్తయ్యే వరకు అన్ని విధాలా సహకరిస్తాను’’ అని పోలీసులకు చెప్పినట్లు పోతిన మహేష్ వెల్లడించారు.
* పాదయాత్రలు, రోడ్ షోలపై నిషేధం పొడిగింపు.
కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకొని ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల ( ఉత్తరప్రదేశ్ , పంజాబ్ , ఉత్తరాఖండ్ , మణిపుర్ , గోవా ) లో పాదయాత్రలు , రోడ్ షోలు , వాహన ర్యాలీలపై నిషేధాన్ని ఫిబ్రవరి 11 వరకు ఎన్నికల సంఘం పొడిగించింది . అయితే కొన్ని మినహాయింపులను కూడా ప్రకటించింది . ఇంటింటి ప్రచారంలో ఇప్పటివరకు 10 మందికి మాత్రమే అనుమతి ఉంది . దాన్ని 20 చేసింది . సభల విషయంలోనూ నిబంధనలను కాస్త సడలించింది. ఇక నుంచి గరిష్టంగా 1000 మందితో ( గతంలో 500 ) లేదా మైదాన సామర్థ్యంలో 50 శాతం .. ఈ రెండింటిలో ఏది తక్కువైతే దాంతో బహిరంగ సమావేశం నిర్వహించుకోవచ్చు . భవనాల్లో నిర్వహించే సమావేశాల్లో పాల్గొనే వారి సంఖ్యను కూడా 300 నుంచి 500 కు పెంచింది.
* మంత్రుల కమిటీతో పీఆర్సీ సాధన సమితి నేతల భేటీ
మంత్రుల కమిటీతో పీఆర్సీ సాధన సమితి నేతలు సమావేశమయ్యారు. హెచ్ఆర్ఏ స్లాబ్‌లు రికవరీ అంశాలపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అలాగే జనవరి నెల పాత వేతనాలపై మంత్రుల కమిటీ చర్చలు జరపనుంది. ఈ భేటీలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాధ్ బొత్స సత్యనారాయణప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి పాల్గొన్నారు. మంత్రుల కమిటీ నుంచి లిఖిత పూర్వకంగా ఆహ్వానం వచ్చినందున స్టీరింగ్ కమిటీ వెళ్లింది.