Editorials

జిన్నా టవర్ కు జాతీయ జెండా రంగులు

జిన్నా టవర్ కు జాతీయ జెండా రంగులు

ఏపీలోని గుంటూరు నగరంలో ఉండే జిన్నాటవర్‌పై నెలరోజులుగా వివాదం నడుస్తోంది. జిన్నాటవర్ పేరు మార్చాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. అంతేకాకుండా జిన్నాటవర్‌ను కూల్చివేస్తామని హెచ్చరికలు కూడా జారీ చేసింది.దీంతో అధికారులు జిన్నాటవర్ చుట్టూ రక్షణ వలయం నిర్మించారు. అయితే తాజాగా ఈ వివాదానికి పరిష్కారం దొరికినట్లు కనిపిస్తోంది. స్థానిక అధికారులు జిన్నాటవర్‌కు జాతీయ జెండాలోని రంగులు వేశారు. దీంతో జిన్నాటవర్ జోలికి ఎవరూ రాకుండా తెలివిగా వ్యవహరించారు.కాగా గుంటూరు నగరంలో జిన్నా రాకకు గుర్తుగా గతంలో జిన్నాటవర్ ఏర్పాటు చేశారు. ఇది గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉంటుంది. ఈ నియోజకవర్గంలో ముస్లిం జనాభా ఎక్కువ. అయితే హిందువులు కూడా వారితో సమానంగానే ఉంటారు. మత సామరస్యానికి జిన్నాటవర్ కారణంగా గుంటూరులో ఎప్పుడూ ఇబ్బంది రాలేదు. అయితే కొంతకాలంగా జిన్నాటవర్ పేరు మార్చి అబ్దుల్ కలాం పేరు పెట్టాలని బీజేపీ నేతలు తెరపైకి తెచ్చారు. అంతేకాకుండా హిందూవాహిని ఆధ్వర్యంలో జిన్నాటవర్‌పై జాతీయ జెండాను కూడా ఎగురవేయడానికి విఫల ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే జిన్నా టవర్‌కు అధికారులు జాతీయ జెండా రంగులు వేయడంతో ప్రస్తుతానికి వివాదం సద్దుమణిగింది.