NRI-NRT

అప్పుల ఊబిలో అమెరికా

అప్పుల ఊబిలో అమెరికా

ప్రపంచ పెద్దన్నగా పేరొందిన అమెరికాకు అప్పులు ఉన్నాయంటే నమ్మడం కొంచెం కష్టమే. ప్రపంచంలోనే భారీ ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్న అగ్రరాజ్యానికి ఇప్పుడు అదే స్థాయిలో బకాయిలు ఉన్నాయట. ఇది స్వయంగా ఆ దేశ ట్రెజరీ డిపార్ట్‌మెంట్ చెబుతున్నమాట. అది కూడా దేశ చరిత్రలోనే ఇంతకుముందెన్నడూ లేని విధంగా భారీగా అప్పులు పెరిగినట్లు చెబుతోంది. మహమ్మారి కరోనావైరస్ సంక్షోభం తర్వాత ఇలా అగ్రరాజ్యం పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోతోందని ట్రెజరీ డిపార్ట్‌మెంట్ పేర్కొంది. తాజాగా ట్రెజరీ విభాగం వెల్లడించిన డేటా ప్రకారం.. ఆ దేశ మొత్తం ప్రభుత్వ రుణ బకాయిలు ఇప్పుడు 30 ట్రిలియన్ డాలర్లకు(రూ.22కోట్ల 45లక్షల కోట్లు) పైగానే ఉన్నాయని తెలుస్తోంది. జనవరి 2020 నుండి ఇప్పటివరకు అంటే ఏడాది కాలంలోనే జాతీయ రుణం సుమారు 7 ట్రిలియన్ డాలర్లు పెరిగింది. ఇక యూఎస్ అప్పులు ఇలా భారీగా పెరిగిపోవడానికి కారణం కరోనా సంక్షోభం నుంచి బయటపడటానికి ఆ దేశం ఎక్కువ మొత్తంలో వెచ్చించడమే. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు ప్రస్తుతం అధికారంలో ఉన్న జో బైడెన్ సైతం ఇలా కరోనా సంక్షోభం నుంచి కోలుకునేందుకు భారీ మొత్తంలో ఖర్చు చేశారు.

**పీటర్ జి. పీటర్సన్ ఫౌండేషన్ సంస్థ చెప్పిన దాని ప్రకారం..
ఇది 2051 నాటికి మొత్తం ఫెడరల్ ఆదాయంలో దాదాపు సగం ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం ఉన్న 30 ట్రిలియన్ల డాలర్ల రుణాన్ని ఆ దేశంలో ఉన్న ఒక్కొ కుటుంబానికి పంచితే తల $231,000 వస్తాయట. అలాగే ప్రతి వ్యక్తికి తల 90వేల డాలర్లు వస్తాయని వెల్లడించింది. ప్రతి అమెరికన్ ఫ్యామిలీ ఈ రుణాన్ని కవర్ చేయడానికి నెలకు వెయ్యి డాలర్లు చెల్లిస్తే ఆ మొత్తాన్ని చెల్లించడానికి 19 ఏళ్లు పడుతుందని పేర్కొంది. కాగా, ఫెడరల్ ప్రభుత్వం ఇప్పుడు జపాన్, చైనా నేతృత్వంలోని విదేశీ, అంతర్జాతీయ పెట్టుబడిదారులకు దాదాపు 8 ట్రిలియన్ డాలర్లు బకాయి పడిందని పీటర్ జి. పీటర్సన్ ఫౌండేషన్ సీఈఓ మైఖేల్ ఎ. పీటర్సన్ వెల్లడించారు.

**ఇలా అగ్రరాజ్యం పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోవడం పట్ల ఆ దేశ ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది దేశానికి నిజంగా అతి పెద్ద సమస్య అని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ ప్రధాన ఆర్థిక వ్యూహకర్త డేవిడ్ కెల్లీ మాట్లాడుతూ.. “ఇది స్వల్పకాలిక సంక్షోభం కాదు. కానీ మేము దీర్ఘకాలంలో పేదవారిగా ఉండబోతున్నామని అర్థం” అని చెప్పారు. ఇప్పుడు ఉన్న అప్పులకు సంబంధించి కేవలం వడ్డీ మాత్రమే రాబోయే పదేళ్లలో 5 ట్రిలియన్ డాలర్లు దాటిపోతుందని ఈ సందర్భంగా ఆయన అంచనా వేశారు. అంతకంతకూ పెరుగుతున్న రుణ వ్యయాల కారణంగా వాతావరణ మార్పు వంటి ప్రధాన ప్రాధాన్యతలపై అగ్రరాజ్యం చేసే నిధులు తగ్గే అవకాశం ఉందని కెల్లీ పేర్కొన్నారు.